Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాళికట్టుకోని కన్యత్వం
ఎప్పటిలానే
మరో కర్ణుడిని, చెత్తకుండికి
జత చేస్తుంది.
గన్నేరుపూల చెట్టు
విత్తనాన్ని ఎడారిలో వదిలేసి, వస్తుంది.
ఎండాకాలం ఆకాశం
ఆడమేఘాన్ని కని
ఎటో తప్పించుకుపారిపోతుంది.
నడిరేయి ఆ లేతదేహం కోసం
రాబందుల చప్పుడు విన్నప్పుడు
దాక్కోడానికి....
అమ్మరెక్కలదాపు జాడ
ఆ కోడిపిల్లకు కానరాదు.
ఏ దెయ్యమో కలలోకొచ్చినప్పుడు
అంత భయపడని
ఆ బుజ్జిగాడు....
నిద్రలేపే సూర్యున్ని చూస్తే వణికిపోతాడు....
మళ్ళీ ఆకలిపిల్లతో ఆడుకోమంటాడని.
ఫుట్ పాత్ పైన ఆ బక్కకడుపులో ఆకలిమంటలను....
కారులో వెళ్తున్న ఏ ఖద్దరుచొక్కాలు చూడవు.
ఆ ఆకలి వాసనను...
పక్కనే వెళ్ళే ఏ స్విగ్గిలు,
ఏ జోమాటలు, పసిగట్టవు.
ఆ పాతబడ్డభవనంలో
ఒంటిరెక్కకిటికి అంచున
కుంటిమంచంపై
దిగాలుముఖంతో
అనాధైన పేగొకటి
వేదనగీతాన్ని ఆలపిస్తూనే వుంటది.
ఒకరోజు
వాడు నడుస్తూ ,వెళ్తుంటాడు
ముళ్ళపొదల చాటున అరుపుని
రెండు అరచేతుల్లోకి
తీసుకొని,ముందుకెళ్తాడు....!
- జోగి నరేష్ కుమార్
నారయణ్ పేట జిల్లా