Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హదయానురాగాలు
లోగిలిలో రాగమాలికలై
పల్లవిస్తూ ప్రకాశిస్తాయి
రక్షణ బంధాల సాక్షిగా
తోడు నీడల సంకల్పానికి
కవచాలుగా నిలుస్తాయి
చిరునగవుల దీపాలై
చిరు శ్వాసల నట్టింట్లో
చిరకాలం వెలుగుతాయి
అండదండల సంపూర్ణంగా
ఆత్మాభిమానాల నీడలో
సవ్య మార్గం చూపిస్తాయి
ఉత్సాహాల కేరింతల్ని
ఇష్టాలుగా తీర్చిదిద్దుకుని
కలకాలం ప్రాంగణంలో
ముగ్గులుగా పరిణమిస్తాయి
బాధ్యతల్లో మిళితమై
స్వర్ణాక్షరాల జీవితాన్ని లిఖిస్తూ
భవిష్యత్తుకు సోపానంగా మారి
మునుముందుకు నడిపిస్తాయి
ఆప్యాయతానుబంధాలు
దేదీప్య కాంతలుమయమై
నిస్వార్థ భావ కుసుమాలతో
అనునిత్యం అలరిస్తాయి
అనుబంధాలు
రుణానుబంధాలుగా ఎగస్తూ
ఆకాశమంత ప్రేమగా
ఈ నేలపై పరుచుకుంటాయి
ఇంద్రధనస్సులా వాలిపోతూ
సప్త రంగుల సంతోషాలను
అనుబంధపు ఒడిలో
రంగవల్లులై విచ్చుకుంటాయి
పవిత్రమైన అనుబంధాలు
శుభకరమగు శ్లోకాలుగా
పౌర్ణమి తలుపులు తెరుచుకుని
లోకమంతా అలరింపజేస్తాయి
ప్రేమగా హత్తుకుపోతాయి
సుదీర్ఘ కాలం చుట్టుకుపోతాయి
- నరెద్దుల రాజారెడ్డి, 9666016636