Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండుగొచ్చిన్నాడు కూరదెచ్చుకునుడు గాదు
కురొచ్చిన్నాడే మా ఇండ్లల్ల పండుగ
గిన్నె నిండున్న సప్పలు సూత్తంటే
శిప్పలు శిప్పలుగా తెగిన సూరీడు
మా గిన్నెలల్ల తలదాసుకున్నడేమో అనిపిస్తది.
గిన్నెకు చెరో కోసకు కూసుండి
మా అవ్వయ్యలు గర్వంగా
శిప్పను నిలువునా శీరుతుంటే
మనువాదాన్ని నిలువునా శీరి ఆరేశినట్టుగా
రేపటి పొద్దు కడుపుకి ధీర గలిగింది
పండుగనాడు అందరిండ్లల్ల
మామిడాకుల దండలు ఎలిస్తే
మా ఇండ్లల్ల మాత్రం
తునుకల దండం ఎలుస్తది
సెట్టుకు తెంపిన ఆకుల దండం
పాణవాయువు ఇత్తదో లేదో తెల్వదు గానీ
మా తునుకల దండం మాత్రం
రేపటి మా బతుక్కి పానం పోత్తది
తునుకల దండంపై ఎండిన అట్టిముక్కలు
ఉత్త అట్టిముక్కలే కాదు
ఎండిన మా బతుకుల శెమట గురుతులు
రేపటికి గాసమెట్లా దాసుకోవాల్నో
ప్రపంచానికి తెలిపిన మా తాతలు ఆది గురువులు
నింగికెగసే మా తునుకల దండం
ఆత్మగౌరవ సూచిక
ఆహార,ఆచార ఆధిపత్యం పై
ధిక్కార పతాక
రేపటి మా విజయాల
వెలుగు రేఖ.
- దిలీప్. వి, 8464030808