Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయం సంధ్యాకాలంలో చుట్టూ రంగురంగుల పూలమొక్కలు... చల్లటి గాలి...
ఇలాంటి వాతావరణం మన ఇంట్లోనే ఉంటే ఆ హాయి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. స్టోన్
బెంచ్ మీద కూర్చొని ఆ పూల అందాలను ఆస్వాదిస్తూంటే వేనవేల కుసుమ సౌందర్యాన్ని
చూడకన్నులు చాలవు. పుష్పించిన ఆ పూల అందాలకు ప్రకతి కూడా పర్వశిస్తుంది.
పూవుతో మనసు వికసిస్తుంది. పరిమళాలు పంచుతూ స్నేహం చేస్తుంది. ఆ చుట్టూ
వాతావరణమంతా ఎంతో హాయిగా.. చల్లగా.. మెల్లగా ఆవరిస్తుంది. మనసు ఉల్లాసంగా
ఉంటుంది. మది పులకించి నవ్వూ పూస్తుంది. ఆ నవ్వు నాలుగు విధాల మేలు చేస్తుంది.
ఆ మది పులికించే కాక్టస్ మొక్కలను పెంచడంపై ఆసక్తిని పెంచుకున్న మచిలీపట్నం
యువకుడు మిథున్ పరిచయమే ఈ వారం జోష్.
మచిలీపట్నానికి చెందిన 26 ఏండ్ల మిథున్‌కు స్వతహగా మొక్కలంటే ప్రేమ. అది కాస్త అభిరుచిగా మారింది. సాధారణ మొక్కలు పెంచడం అభిరుచేముంది. తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనుకున్నాడు. అందుకు తనకు ఎంతో ఇష్టమైన కాక్టస్ మొక్కలను వందల కొద్ది విదేశాల నుంచి రకరకాల మొక్కలను సేకరించాడు. వాటితో అతనిప్పుడు తన ఇంటి పైనే మిద్దె పూలవనాన్ని పెంచుతున్నాడు. అందుకు వాటిలో కొన్ని పాలినేషన్, గ్రాఫ్టింగ్ సాంకేతికతో హైబ్రిడ్లను సష్టించాడు. కాక్టస్ కు సంబంధించి లోబివియా, జిమ్నోస్, కోరిఫాంతా, వేరియెగేటడ్ సిరియస్, మమ్మిలారియా పెక్టినిఫిరా, పీనట్ కాక్టస్, ఎకినోసిరియస్, రెయిన్ బో కాక్టస్, ఇలా వివిధ రకాల కాక్టస్‌లు పెంచుతున్నాడు. ఫార్మసీ పూర్తి చేసిన అతను పై చదువులకు విదేశాలకు వెళ్ళాలని భావించాడు. కాని తాను వెళ్ళిపోతే తన మొక్కలను ఎవరు చూసుకుంటారు అనే సందేహం వచ్చింది. దాంతో విదేశాలకు వెళ్ళే ఆలోచననే విరమించుకున్నాడు.
కాక్టస్ మొక్కల పెంపకాన్ని 2017లోనే మొదలుపెట్టాడు. ఇందుకోసం ఒక ఫేస్ బుక్ గ్రూప్ ఉండగా 2018లో అందులో అతనికి పరిచయమైన స్విడీష్ స్నేహితుడు మార్గన్ ప్రోత్సహంతో ఆసక్తి మరింత పెరిగింది. అతను ఒక చెఫ్ కానీ ఈ మొక్కల గురించి తనకు తెలిసిన ప్రతీ విషయాన్ని పంచుకోవటం చాలా సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. అలా వీరిద్దరూ భారత్, స్విడన్లలో ఉన్న వివిధ రకాల కాక్టస్‌లను షేర్ చేసుకునేవాళ్ళు.
అయితే కాక్టస్‌పై మిథున్‌కు ఆసక్తి ఏర్పడటానికి కారణం 3 నిమిషాల 56 సెకండ్ల నిడివి గల ఓ యూట్యూబ్ వీడియో. అందులో 'ఫ్రికీ ఫ్లవర్స్' అనే పేరుతో ఉన్న వీడియోలో కాక్టస్ పూలు ఎలా పెరుగుతాయో వివరించారు. ఆ వీడియో అతన్ని మైమరచిపోయేలా చేసింది. అలాగే కాక్టస్ పూల అందాన్ని అతనికి పరిచయం చేసింది. దాంతో కాక్టస్‌ను ఐదేండ్లుగా పెంచుతున్నాడు.
కానీ కాక్టస్‌ను పెంచడమనేది అంతసులభమైన విషయం కాదు. ప్రతీ కాక్టస్ పువ్వు రావడానికి 2 నుంచి 10 ఏండ్ల సమయం తీసుకుంటుంది. అలాగే వికసించడానికి 2 నుంచి 24 గంటల సమయం పడు తుంది. కాక్టస్ పువ్వు వచ్చినప్పుడు మిథున్‌కు అది ఒక వేడుక.
'పువ్వు రావడం అనే ప్రక్రియ కూడా నన్ను ఆశ్చర్య పరుస్తుంది. వివిధ రంగుల్లో వికసిస్తుంది. ఆ పువ్వు కోసం ఎన్నో ఏండ్లుగా నేను పడ్డ కష్టం పువ్వు వికసించినప్పుడు మరిచిపోతాను. అనంతరం వివిధ యాంగిళ్లలో పువ్వుతో ఫోటో దిగుతాను'' అంటూ ఆనందం వ్యక్తం చేశాడు మిథున్.
వివిధ రకాలను పొలినేటడ్ చేస్తున్నప్పుడు రెండు మొక్కలు పుష్పించే స్థితిలో ఉన్నాయా అని చూసుకోవాలి. అలాగే ఏ రంగు పువ్వు వస్తుందో మనకు తెలీదు. అది చాలా ఆశ్చర్యపరుస్తుంది. పాలినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎదురు చూసే సమయమే కావడంతో మిథున్ ఆ సమయంలో వివిధ రకాల కాక్టస్‌ను కొత్తవి తీసుకురావడానికి గ్రాఫ్ట్స్ అనే సాంకేతికత ఉపయోగించేవాడు.
తెలుగు రాష్ట్రాల్లో కాక్టస్ పెంచేందుకు డిసెంబర్, జనవరి తప్ప మిగిలిన అన్ని నెలలూ వాతావరణం అనుకూలిస్తుంది. చలి కాలమైన డిసెంబర్, జనవరిలో మెల్లగా పెరుగుతుంది. అదే ఉత్తర భారత దేశంలో ఎక్కువ చలి ఉండడంతో డిసెంబర్ నుంచి మార్చి వరకు కాక్టస్ మెల్లిగా పెరుగుతుంది. అలాగే మిథున్ పేస్‌బుక్‌లో ఎకినోప్సిస్ లవర్స్ ఇండియా అనే ఫేస్ బుక్ గ్రూపును కూడా నడుపుతున్నాడు. అందులో కాక్టస్‌ను పెంచేందుకు సూచనలను గ్రూపు మెంబర్లకు చెబుతుంటాడు.
ఇంకా మిథున్ మాట్లాడుతూ 'చాలా మంది ఇంట్లో కాక్టస్ పెంచడం మంచిది కాదు అని భావిస్తారు. ఈ మొక్కకు ముళ్లుంటాయని, ప్రమాద మని భావించి చాలా మంది వాటిని ఇంట్లో పెంచడానికి ఒప్పుకోరు. అయితే మొక్క దగ్గర పిల్లలు లేకుండా ఉండి, జాగ్రత్తగా కాక్టస్ మొక్కను పెడ్తే అవి ఎక్కడైనా పెరుగుతాయి. ఈ మొక్క పెంచేందుకు ఆ మొక్క గురించి అవగాహన, సహనం రెండూ ఉండాలి' అని అన్నాడు.
కాక్టస్ సవాళ్లు
ఈ కాక్టస్ మొక్కకు అసలైన సవాళ్లు వర్షాకాలంలో ఎదురవుతాయి. మిథున్ అందుకోసం పైన ఒక కవర్‌ను ఏర్పాటు చేశాడు. దీని గురించి ఆయన వివరిస్తూ.. 'కొన్ని రకాల కాక్టస్‌ను ఒక స్టేజ్ వరకు వర్షం నుంచి రక్షించాలి. కొన్ని మొక్కలు మొలకెత్తే సమయంలో ఉన్నా వర్షం వల్ల అవి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన తేమ పరిస్థితుల్లో మొక్కను ఉంచాలి. మొలకెత్తేవి ఒక్కటి కుళ్లిపోవడం మొదలైనా అవి ఒక సెట్లో ఉన్న మొక్కలు చాలా వరకు కుళ్లిపోయే అవకాశం ఉంది. సీజన్‌ను బట్టి వారంలో ఒకసారి లేదా రెండు సార్లు నేను రాత్రి పూట మొక్కలకు నీరు పోస్తాను'. అని చెప్పాడు.
వాటర్ లిల్లీస్
ఎవరైనా మిథున్ ఇంట్లోకి ప్రవేశించగానే సిమెంట్ వాటర్ టబ్‌లలో ఏర్పాటు చేసిన లిల్లీ, లోటస్ మొక్కలు కనిపిస్తాయి. అలాగే ప్రతీ సిమెంట్ టబ్‌లో వివిధ రంగుల్లో చేపలు కనువిందు చేస్తాయి. వాటర్ లిల్లీస్ను పెంచడమనేది మిథున్‌కు ఉన్న పాత అభిరుచి. వాటిని అతను ఫార్మసి విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి అంటే 2013 నుంచి పెంచుతున్నాడు.
దీనిపై ఆయన స్పందిస్తూ..'నా దగ్గర 25 రకాల వాటర్ లిల్లీస్ వివిధ రంగుల్లో ఉన్నాయి. నేను 2013 నుంచి వాటిని పెంచుతున్నాను. ఆ రోజుల్లో చాలా మందికి వాటిని ఎలా పెంచాలో కూడా తెలీదు. కానీ ఇప్పుడు చాలా మందిలో అవగాహన అనేది వచ్చింది. చాలా మంది విజయవంతంగా వాటిని పెంచుతున్నారు. 2017లో నేను కూడా వాటర్ లిల్లీస్ ఎలా పెంచాలి అనే దానిపై ప్రభుత్వానికి చెందిన అర్బన్ డెవలప్ మెంట్ వింగ్‌కు క్లాస్ తీసుకున్నాను
చాలా మంది మిథున్ దీని కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడో అని అనుకుంటారు. కానీ ఎరువులు, కుండల కోసం తాను సంవత్సరానికి సుమారు రూ. 3000 మాత్రమే ఖర్చు చేస్తానని మిథున్ చెబుతున్నాడు. 'సిండర్, ఎరువులు నాకు ఢిల్లీ నుంచి వెండర్ ద్వారా వస్తాయి. అవశేషాలు తీసేసి, శుభ్ర పరిచి వాటిని వాడుకోవాలి. అది చాలా పెద్ద పని' అని మిథున్ అంటున్నాడు. అతనికి తన తల్లి, అలాగే అతని తమ్ముడు సాయపడుతుంటారు.
ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే తన మొక్కలను ఖాళీ సమయాల్లో చూసుకోవచ్చు. అలాగే వివిధ రకాల కాక్టస్ల కోసం భవిష్య త్తులో ఆన్ లైన్ నర్సరీ పెట్టే ఆలోచన కూడా అతనికి ఉంది.
- సీహెచ్ శివకిరణ్, 9396633314