Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం:
జిందగీ ఎక్ అజియ్యత్ హై ముఝే
తుఝ్ సే మిల్నే కీ జరూరత్ హై ముఝే
దిల్ మే హర్ లహ్జా హై సిర్ఫ్ ఎక్ ఖయాల్
తుఝ్ సే కిస్ దర్జా మొహబ్బత్ హై ముఝే
తిరీ సూరత్ తిరీ జుల్ఫే మల్బూస్
బస్ ఇనీ చీజోం సే రఘ్బత్ హై ముఝే
ముఝ్ పే అబ్ ఫాశ్ హుఆ రాజ్-ఎ-హయాత్
జీస్త్ అబ్ సే తిరీ చాహత్ హై ముఝే
తేజ్ హై వఖ్త్ కీ రఫ్తార్ బహుత్
ఔర్ బహుత్ థోడీ సీ ఫుర్సత్ హై ముఝే
సాంస్ జో బీత్ గయా బీత్ గయా
బస్ ఇసీ బాత్ కీ కుల్ఫత్ హై ముఝే
ఆహ్ మెరీ హై తబస్సుమ్ తెరా
ఇస్ లియే దర్ద్ భీ రాహత్ హై ముఝే
అబ్ న వో జోష్-ఎ-తమన్నా బాఖీ
అబ్ న వో ఇష్క్ కీ వహ్శత్ హై ముఝే
అబ్ యూహీ ఉమ్ర్ గుజర్ జాఏగీ
అబ్ యహీ బాత్ ఘనీమత్ హై ముఝే
అనువాదం:
నాకు జీవితమే ఒక నరకయాతన లాంటిది
నిన్ను కలవడం నాకు అత్యవసరం లాంటిది
నీ మీద నాకున్న ప్రేమ యొక్క స్థానమెంతని
నా ఎదలో ప్రతీ క్షణం ఒకటే ఆలోచన ఉంది
నీ మోము నీ ముంగురులు నీ చీరకట్టు అంతే
నాకిప్పుడు ఈ విషయాలపైనే అభిరుచి ఉంది
ఇపుడే తెలిసింది నాకు మానవ జీవన మర్మం
జీవితమా! నా ఆత్రుత అంతా ఇక నీపైనే ఉంది
అందుకోలేనంతగా ఉన్నది కాలానికున్న వేగం
నాకున్న తీరిక మాత్రం ఎంతో చిన్నదిగా ఉంది
గడవాల్సిన నిట్టూర్పులన్నీ గడిచిపోయాయి
ఇక నా దుఃఖమంతా దీనిపైనే ఉండిపోయింది
నేననుభవించే వేదనయే నిన్ను నవ్వించే సాధనం
అందుకేనేమో నా వేదన కూడా వేడుకలా ఉంది
నాకిప్పుడు ఉత్సాహంతో ఉండాలనే కోరికా లేదు
ఇంక వలపులోన వరము లాంటి విరహమూ లేదు
చూస్తుండగానే ఇప్పుడు సమయం గడిచిపోతుంది
ఒకరకంగా ఈ విషయం నాకు దైవ దీవెనలా ఉంది.
ఆధునిక ఉర్దూ నజ్మ్ కవితా శైలి వ్యవస్థాపకులలో ఒకడైన మీరాజీ పూర్తి పేరు ముహమ్మద్ సనాఉల్లాV్‌ా డార్. ఇతను 25 మే 1912లో జన్మించాడు. సాహిత్య పుస్తకాలన్న పాండిత్య పుస్తకాలన్న ఎంతగానో ఇష్టపడే మీరాజీకి అకాడమిక్ చదువులపైన ఆసక్తి ఉండేది కాదు. ఉద్యోగ రీత్యా ఇతను అదబీ దునియా, ఖయాల్ (సంపాదకుడిగా) మాసపత్రికలో పనిచేసాడు. మీరాజీ స్వదేశీ కవులైన చండీదాస్, విద్యాపతి, మీరాబాయిల సాహిత్యాన్ని, పాశ్చాత్య కవులైన పుశ్కిన్ (రష్యా), హైనే (జర్మనీ) మొ. వారి సాహిత్యాన్ని అధ్యయనం చేసాడు. ఫలితంగా, మీరాజీ తనదైన కవిత్వ భాషను సృష్టించుకోగలిగాడు. మీరాజీ కవిత్వంలో ప్రగాఢ భారతీయత, ఉన్నతమైన కవిత్వాన్ని సృష్టించగల సంభావ్యత మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంటారు. 3 నవంబర్ 1949న తీవ్ర అనారోగ్యం వల్ల చిన్న వయసులోనే దేహం చాలించిన మీరాజీ, నిఘర్-ఖానా (గద్య అనువాదం), 223 నజ్మ్ కవితలు, 136 గీతాలు, 17 గజల్లు, 22 ఛందోబద్ధమైన అనువాదాలు, ఐదు పేరడీలతో తన సాహిత్య ఖజానాను నింపాడు.
మీరాజీ రచనల్లో కొన్ని గజళ్ళు మాత్రమే దొరుకుతాయి. ఈ కాలమ్ లో తీసుకున్న గజల్ 9 షేర్లను కలిగి ఉంది. మొదటి మూడు షేర్లలో కవి తన ప్రియురాలిని ఉద్దేశిస్తాడు. (కవి తన కలం పేరు కూడా ఆమె పేరు నుండే స్వీకరించాడు-మీరా సేన్). మిగిలిన షేర్లన్నీ తత్వం, వేదన, విషాదం ప్రధాన నేపథ్యాలుగా సాగాయి. ఈ క్రమంలో వివరించదగ్గ అంశమేం టంటే, ''కవి తన జీవితాన్ని నరకయాతన అని ఎందుకన్నాడు.?'' దీని వివరణ అర్థం చేసుకునే ముందు మీరాజీ గురించి మరింత తెలుసుకోవాల్సి ఉంది. మీరాజీ బోహేమియన్ అంటే సంఘ విరుద్ధమైన (సంప్రదాయేతర) జీవి తాన్ని గడిపాడు. చెడు అలవాట్లకు బాని సయ్యాడు. మీరాజీ చివరి రోజులు ఎంతో దుర్భరంగా గడిచాయి. తాను చనిపోయినప్పుడు ఏ బొంబాయి పత్రిక కూడా సంతాపం తెలపలేదు. మొదటి నుంచే మీరాజీ వేదనా భరితమైన జీవితాన్ని గడిపాడు. బహుశా ఆ వేదనే తనని అలా అనేలా చేసుంటుంది. ప్రపంచంలోని మహాకవులందరూ తీవ్రమైన వేదనను అనుభవించినవారే. వాస్తవానికి కవికి దొరికే అత్యున్నతమైన సౌభాగ్యం ఏదైనా ఉందంటే, అది వేదన మాత్రమే. కవి తాను పడే వేదనతోనే ప్రపంచానికి వినోదాన్ని పంచుతాడు. భౌతికంగా మీరాజీ గుణగణాలు అసహజమైనవే అయినా, అంతరికంగా తాను ఎంతో ఉన్నతమైన మార్మిక జ్ఞానాన్ని కలిగినవాడు. మనిషి యొక్క చేతనా ఉపచేతనా స్థితులు (కాన్షియస్-సబ్ కాన్షియస్ స్టేట్స్) తన ఆలోచనలకు మూల ప్రేరకాలుగా ఉండేవి. మీరాజీ కవిత్వంలో గోచరించే మార్మిక సంయోగం భారతీయ అధిభౌతిక సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. మీరాజీ గురించి మంటో ఇలా అంటాడు- ''ఇతని కలం ఒక జిగ్సా పజిల్ లాంటిది. దాని భాగాలను ఎంతో శాంతితో జోడించి చూడాలి''.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 9441002256