Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట పార్థివ దేహమై పడింది,
పాట పంచ భూతాలలో కలిసింది,
పాట హదయం ముక్కలైంది.
పాటెల్లిపోయిందిరా ఓ మానవుడా!
అంటూ,
దుఃఖిస్తూ కూర్చోలేని దునియా నాది!
అందుకే హఠాత్తుగా ఆలోచించడం మొదలు పెట్టాను అతని గురించి...
ఏమని?
సామాన్యుడు కాదీ ''సమ్మాన్యుడు'' వేంకటయోగి గారి అసామాన్య పుత్ర రత్నం.
లేకపోతే వసంతమే తన దరికి కదలి వచ్చి చెంబోలును లాక్కొని, చేతిలో సిరివెన్నెలను కాయించిపోతుందా మరి?
మహానందిలో నవనందులను మాత్రమే చూసిన మనకు ఏకాదశ నందులను గెలుచుకున్న ఈ కవీరున్ని పరిచయం చేసిన ఘనత మాత్రం తెలుగు సిని కళామ తల్లిదే!
ఈ, వై సత్యారావు శిష్యుని సాహితీ ప్రస్తానాన్ని విమర్శించే హక్కుమాత్రం ఆ చెంబోలు పద్మావతికే చెల్లిందట పాపం,
అయినా కనిపెట్టుకుని ఉండే కళ్యాణికే తెలుస్తాయిలేండి మీ కవితల కాపురంలోని లోటుపాట్లు.
పెళ్ళాం ప్రేయసిని ఉత్తమ విమర్శకు రాలని పొగడిన ఈ సీతారాముడికి ఆమె బెటర్ త్రీ ఫోర్తట.
గదేంది?
బెటర్ హాఫ్ లు తప్ప టూ బై ఫోర్తులు, త్రీ బై ఫోర్తులు తెలియని తిక్కల మనుషులం బాబయ్య.
ఈయనేందమ్మో,వేటూరి సుందర రామునికి, వేలు విడిచిన మేనమామ కొడుకులాగున్నాడు,
బలపం పట్టి భామ వళ్ళో అఆ,ఇఈ నేర్చుకుంటాడంట ఇచ్చంత్రం కాకపోతే?
మళ్ళీ అంతలోనే విధాత తలపుల ప్రభవించినది అంటూ అంబుజోద్భవునికై ఆరాటపడుతాడు.
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు రంగు పూసినవాడినేది అడిగేది అంటూనే 300 శివ కావ్యాలు రాశిండు.
అహంకారానికి చొక్కా, ప్యాంట్ వేస్తే అది నేనేనని చెప్పుకున్నారు బాగానే ఉంది, మల్ల గా ధూమకేతువు చెల్లెలు సిగిరెట్టమ్మకు తలెందుకు వంచినట్టంట?
సత్కవుల్ సదా నరుల నాల్కల మీద నర్తిస్తారని కాబోలు ఈ సిరివెన్నెలయ్య ఒక్క సినిమాలోనే నటించి, గాయం చేసి గేయాల బాట పట్టినాడు.
తెలుసా మనసా!
తెల్లారింది లెగండోరు అని ఎవ్వరూ మనల్ని లేపరని తెలుసా?
అయినా నువ్వు పాడని పాట ఈ మర్త్య లోకంలో నేనెందుకు వ్రాస్తానన్నయ్యా అనుకున్నాడు కాబోలు ఈ నెలబాలుని తమ్మయ్య!
పక్కపక్కన కూర్చుని పక్కాగా రింగులు వదులుతూ అమర సంగీత,సాహిత్యా సేద్యం పండించడానికి వెళ్ళాడు మన ప్రియ మణికి తోడుగా.
ఏ రకంగా చూసినా?
భక్తి,రక్తి,ముక్తులతో మానవ లోకాన్ని,మానస సరోవరంలో విహరింపజేసిన పద్మశ్రీ,
అన్ని వైపుల నుండి అమరగానాన్ని వాయించడంలో ఉస్తాద్ బిస్మిల్లా ఆలీఖాన్ కు ఉత్తమ శిష్యుడీ సుబ్బలక్ష్మి కన్నడు.
పాతనీరు పోయి, కొత్త నీరు నిరంతరం పారుతున్నా?
మర్త్యుల హదయ కవాటాల్లో మాత్రం సిరివెన్నెల సీతారాముని చిత్రం నిత్య వసంతమై ప్రవహిస్తుంది సుమా!
- ఇందిరా వెల్ది, 9247478080