Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నడ్సె బాటొంటి
ఎక్కిరింపుల సూపులు జల్లి
ఎన్నిసార్లు కొలిచిన
ముక్కలవ్వని మనస్సు మాది
గట్ల... ఎన్నిసార్లు తాక్డ దల్గిందో...మాకు
జీవితాలకు ..జీతాలకు మధ్య
నిత్యం నలిగిపోతున్న
తాజ బొండుమల్లెలమై
తరగతి గదులల్లో వ్యాపిస్తం..
లేలేత వాక్యాల నడ్మ
మా బాధను తుంచుకొని
ఆనందాన్ని వెతుకుంటం
పని ఎంతజెప్పిన
చేతులది చేతులనే అందుకుంటం
కడ్పుగాలినా..
తరగతి గదులల్లో
గొంతెత్తి పాడుతం.
నొసటిరాత ఎక్కిరించిన
నోటినిండ పాఠాలమై కురుస్తం..
ఏట ..ఏట..
పోటికి తట్టుకొని వొచ్చి
శ్రమసుట్టు రాలిపోతున్న
ఆకలి పువ్వులం..అతిథులం మేము
సద్వును మన్సుపై మోస్తున్న
అక్షర కాంతులం మేము..
ఎన్నొద్దులు ఎదురుజూసిన
పొద్దు పొద్దుకు
ఆకలి సుద్దులే మొల్వవట్టే
రండి...
ఆకలికి కొత్తనిర్వచనాన్ని వెతుకుదాం
పదండి..పదండి..
ఉలుకు పలుకు లేని
ఊసుకండ్లను దూడ్సి
మన ఆవేదనను ఆర్తిగా వినిపిద్దాం..
పానమెంత పచ్చిపుండైనా
ప్లాస్టిక్ నవ్వులనే
పెదవులపై పూయించి
మన హుందాతనాన్ని ..
చిరునామాగా రాసిద్దాం...
సుట్టు అల్లుకున్న సమస్యలు
ఒక్కొక్కటి తెగేదాక
అందరం ఒకటౌదాం...
రండి..రండి..
కల్సి నడిస్తెనే..
కాలమైన మన కన్నీళ్ళు తుడుస్తది.
ఆత్మగౌరవంగా బతకాలంటే
అందరం ఒక్కటై ..నడ్వాలే
అతిథులంటే ఆకలి దీపాలు కాదు
అక్షర దివ్వెలమని చాటుదాం..
- బోల యాదయ్య