Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పక్షుల ప్రేమ సందేశాలను ఏ పొలాలకో పంపుతున్న ఈ చెట్ల కింద ఇలా ఒక్కన్నే
అలా అని ఏ ఎదురు చూపులూ లేవు నా కళ్ళలో
ఎందుకో అలాగే కూర్చున్నా
అప్పుడప్పుడూ నువ్వు గుర్తొస్తున్న ఊహలు
రంగులేని పరిమళాలను వెదజల్లే
మెత్తని పూలను పూసే
ఈ చెట్లు చూడు ఎంత అందమైనవో
ఆ పూలు గాలి స్పర్శ తగిలినా
నలిగి పోయేంతటి సున్నితమైనవి
చెట్ల కన్నా అందమైన వస్తువు ఎక్కడా లేదేమో
అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.
ఆకాశంలో నలుపు తిరిగిన నీలపు చారికలు
అక్కడక్కడా పాములు చుట్టేసుకున్నట్టు
బురద నిండిన నీళ్ళ గుంటలు
ఆ నీళ్ళున్న గుంటల చూట్టూ ఎంత బురదున్నా వాటిలో మబ్బుల చేపల కదలికలు చూడు ఎంత అందంగా ఉన్నాయో
గాలంతా బూజు దారాలు చుట్టుకున్నట్టు
ఒంటిని అల్లుకు పోతుంటే కాస్త తీరిగ్గా
గాలి పీల్చుకోవడం కూడా సుఖాన్నిస్తోంది
అది అసంకల్పితంగా రోజూ చేసే పనైనా ఎందుకో ఇప్పుడు గాలి పీల్చుకోవడం కూడా నేను సరదాగా ఆశపడి చేసే పనుల్లో ఒకదానిలాగే అనిపిస్తోంది.
జీవితంలోని ఇలాంటి అతి సున్నితమైన
పనులమీద మనకి ఉన్న ఆసక్తినీ ప్రేమనీ
ఏకరువు పెట్టుకునే వాళ్ళం ఇద్దరం
చిన్న రేకులని ఉదయాన్నే గూటిలో పక్షి
రెక్కలను తెరిచినట్టు విచ్చుకునే
పసుపు పచ్చని పూలని చూస్తూ
కళ్ళని వెలిగించుకునే వాళ్ళం
ఎప్పుడూ గమనించలేదు గానీ
ఈ చిన్న చిన్న సరదాలే
మనల్ని చిక్కుడు తీగలాగా అల్లుకుపోయి పచ్చదనాన్ని పంచాయి
ఇప్పుడు నా బాల్యాన్ని
నా విఫల ప్రేమలను తలుచుకోవడం లేదు.
కానీ అవి ఎప్పుడూ మరుపులేని సంగతులే కదా.
ఎక్కడో ఇప్పటి జీవితం మీద
ప్రేమ సన్నగిల్లినప్పుడే గతంలోకి
పోతుంటాం అనుకుంటా
వానతో కొట్టుకుపోయిన దారుల మీద
చీమ మళ్లీ కొత్త దారుల్ని కట్టుకున్నట్టు
ఊహా ఫలితమైన భవిష్యత్తులోకే చూడాలి మనం.
కానీ ఎందుకో ఇప్పుడు కాసేపు కూర్చొని తీరిగ్గా నీతో కబుర్లు చెప్పుకోవాలని ఆశ కలుగుతోంది
నా కళ్లముందు నువ్వు నడుచుకుంటూ వెళ్ళిన
ఈ దారుల మీద ఇప్పుడు
పచ్చగడ్డి మొలుస్తూ కనిపిస్తోంది
ఆ గడ్డి మీద ఏ రంగుల
సీతాకోక చిలుకలు వాలతాయో
- గూండ్ల వెంకట నారాయణ