Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిస్తేజమైన బ్రతుకులు
నిర్వీర్యమైన ఆలోచనలు
చీకటి దుప్పటి కప్పుకుని
వెలుతురుకు దూరంగా కూర్చున్నాయి
సందెవేళ పొద్దులా
దూరపు కొండలు కూడా అస్పష్టంగా కనిపిస్తున్నాయి
సగం కాలిన శవాలలా
మానలేని గాయాలను మోస్తూ, లేస్తూ
దేహాలు మాత్రం మాట్లాడుకొంటున్నాయి
పేదరికపు బ్రతుకులకు వలవేస్తూ
మనసును శిలగా చేసుకొని
కరుడుగట్టిన భావాల పరంపరను ఒలికిస్తూ
అహంకారాన్ని అత్తరుగా రాసుకుని
నీతిని అధ:పాతాలానికి తోసి
అవినీతిని అంచెలంచెలుగా పెంచుకుంటూ
స్వార్ధపు రంగు పులుముకున్న
రాబంధుల అడుగుల చప్పుడు
కాలమెప్పుడూ నా చేతిలోనే ఉందంటుంది
కన్నీళ్ళతో చితి మంటలను చల్లార్చుకోమంటుంది
గరీబు జీవితాలకు
జవాబులేని ప్రశ్నలను సంధిస్తూ
కాలం రెండువైపులా కత్తులకు పదును పెడుతోంది
ముందు నుయ్యి
వెనుక గొయ్యి లను తలపిస్తూ
ఎప్పుడో ఒకప్పుడు
భళ్ళున తెల్లారే రోజు రానే వస్తుంది
అచేతనావస్థలోని నరాల సముదాయము
ఒక్కుమ్మడిగా దాడి చేయడానికి
ఉద్యుక్తురాలవుతుంది, అప్పుడు
నీదనుకున్న కాలం నిన్ను కూడా వదిలిపెట్టదు.
- మచ్చరాజమౌళి, 9059637442