Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టిన సామాన్య కుటుంబ నేపథ్యం, సాగుతున్న అతి సామాన్య పేద జీవితం అతని రచనకు ఏనాడూ అడ్డు రాలేదని అర్థమైంది కదా. మరి ఇలాంటి కుర్రాడికి పురస్కారం ఎందుకు రాలేదని నేను ఆశ్చర్యపోవడంలో అర్థం వుందనే అనుకుంటున్నాను. అతను మాత్రం వాక్యంలో పనికిరాని పదాన్ని తీసేసినంత ఈజీగా అవార్డుల్ని పక్కన పెట్టాడు. కవి ధిక్కారం అలాగే వుంటుంది. కవిత్వ రచనకు ప్రయోజనం కవిత్వమే. మరో వైపు కవి చూశాడా కవిత్వం అతని నుంచి చూపు మరల్చుకుంటుంది. అవార్డుల కోసం అడ్డమైన దారులూ తొక్కే చవకబారు సాహితీ ప్రకాండుల్ని చూసి సిగ్గుపడే కంటే, ఇదిగో ఇలాంటి ధిక్కార కవుల్ని చూసి గర్వపడదాం.
డార్జిలింగ్‌లో నివసించే ఒక నేపాలీ యువ కవిని మీకిప్పుడు పరిచయం చేస్తాను. పేరు మహేష్ దహాల్. మన భాషలో తగుళ్ళ గోపాల్‌కి యువ పురస్కారం వచ్చిందని తెలిసి సంతోషిస్తున్న క్షణాల్లోనే ఇతని నుంచి నాకు ఫోన్ వచ్చింది. 'సార్ యువర్ బ్లెస్సింగ్ హ్యాజ్ బికమ్ ట్రూ. ముఝే సాహిత్య అకాడెమీ యువ పురస్కార్ మిలా.' అప్పుడు నేనొక పెళ్ళి భోజనం తింటున్నాను. భోజనంలో ఉన్న ఏ తీపి వంట కూడా ఈ వార్తంత తియ్యగా అనిపించ లేదు. ఇతని కవిత్వం గురించి మాట్లాడే ముందు ఇతనికీ నాకూ ఏమిటి సంబంధమో చెప్తాను. ఇద్దరం 2018లో ఇండోర్‌లో జరిగిన ఆకాశవాణి అఖిల భారత కవి సమ్మేళనంలో కలిశాం. కలయిక కూడా విచిత్రమే. నేను చిన్నప్పుడు నాకంటే పెద్ద వాళ్ళతో స్నేహంగా తిరిగే వాడిని. పెద్దయ్యాక కుర్రవాళ్ళంటే చాలా ఇష్టపడతాను. నేర్చుకునేది ఏమన్నా వుంటే వాళ్ళ దగ్గరే వుంటుంది. మలయాళీ ప్రముఖ కవి థామస్ కుట్టి, నేను, మహేష్ ఆ రెండు రోజులు ఇండోర్‌లో చాలా ఆనందంగా సాహితీ కబుర్లతో గడిపాం. ఈ కుర్రాడు మమ్మల్ని ఇద్దరినీ ఆకర్షించాడు. కొంచెం జోకులు, కొంచెం అల్లరి, అప్పుడప్పుడు చాలా గంభీరంగా వుండేవాడు. రెండు రాత్రులు పూర్తిగా థామస్ కుట్టితో, నాతో ఇతను కూడా కూర్చున్నాడు. మధుమధురమైన ఆ రెండు రాత్రుల జాగారం ఎంత కవిత్వాన్ని తాగామో తిన్నామో తెలియదు. వయసులో మా కంటే చిన్నవాడు. 30 ఏండ్ల యువకుడు. ఇతను పక్కా శాకాహారి. అమృతం రుచి తెలియని అమాయకుడు. అయితేనేం కవిత్వ రుచి మాకంటే బాగానే మరిగినట్టున్నాడు. అందుకే మా ఇద్దరికీ అంత నచ్చాడు. మేమేదో మాట్లాడుతూ వుంటే మధ్య మధ్యలో అతనేదో అడుగుతూ వుండేవాడు. తర్వాత వాటిని నేపాలీ పత్రికల్లో మా ఇంటర్వ్యూలుగా ప్రకటించాక తేెలింది అతని పనిలో అతనున్నాడని. అలా దగ్గరైనవాడు ఈ మూడేళ్ళలో ఫోన్లో ఇంకా దగ్గరగా వుంటూ వచ్చాడు. కవిత్వాన్ని పంచుకుంటూ వున్నాం. తర్వాత మొన్న నవంబర్‌లో అస్సాం బోడోల్యాండ్‌లో కోక్రాఝార్‌లో జరిగిన వందభాషల కవుల సమ్మేళనంలో కలిశాడు. నేనొస్తున్నానని తెలిసి నాకు ఫోన్ చేశాడు. సార్ అక్కడ నుంచి డార్జిలింగ్ తీసుకువెళతాను అన్నాడు. అయితే ఓకే అన్నాను. కోక్రాఝార్‌లో రెండు రోజులు ఒకే రూంలో వున్నాం. కలిసి వున్నాం. కలిసి తిన్నాం. కలిసి జోకుల మీద జోకులు వేసుకున్నాం. పిచ్చిపిచ్చిగా ఫోటోలు తీసుకున్నాం. నేను కవిత చదివినప్పుడు వీడియో తీశాడు. అతనిది వేరే వేదిక మీద అప్పుడే వుంది. కానీ నా కవితా పఠనం పూర్తయ్యేదాకా అక్కడ నుంచి కదల్లేదు. తర్వాత పరుగు పరుగున మరో వేదికకు వెళ్ళాం. అతని కావ్య పాఠాన్ని నేను ఫోటోలు తీశాను. వీడియా సరిగ్గా తీయలేక పోయాను. అసలతనేం పట్టించుకోడు. నా వయసు కంటే ఎక్కువ మెచ్యూరిటీతో వున్నాడు. ఎవరో కవిత వినిపిస్తున్నారు పాడైపోయిన రోడ్లు గురించి. రోడ్లు గురించి ఎందుకు సార్ ఇంత బాధ పడి మనల్ని బాధ పెడుతున్నారు? పోయి రోడ్లు వెయ్యాలి గానీ కవిత్వం ఎందుకు సార్ అని ఇలా ఒకటే నవ్వించేవాడు. అక్కడ నుంచి నేను అతనితో పాటు డార్జిలింగ్ వెళ్ళాను. అతను ఉంటున్న చిన్న గదికి తీసుకు వెళ్ళాడు. ఎంఏ. చేసి పి.హెచ్.డి చేసిన కుర్రాడు ఏదో పేదరికంలో ఉన్నాడని అర్థమైంది. అతను అంతకు ముందు ఏడాదే తన ఫియాన్సీ అని చెప్పే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఒక ప్రయివేట్ డిగ్రీ కాలేజీలో నేపాలీ బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. జీతం పది పన్నెండు వేలు మాత్రమే. డార్జిలింగ్ లాంటి టూరిస్టు ప్లేసులో అది ఒక గది అద్దెకు కూడా సరిపోదు. మీ ఆవిడ ఏది అని అడిగాను. మా అమ్మ వాళ్ళ దగ్గర గ్రామంలో వుంటోందని చెప్పాడు. బహుశా నేను వచ్చానని ఆమెను పంపించాడేమో అనుకున్నాను. ఈ చిన్న జీవితంలో ఇధ్దరం బతకడం కొంచెం కష్టంగానే వుందని, అందుకే కొన్నాళ్ళు మా ఊళ్ళో ..కొన్నాళ్ళు వాళ్ల అమ్మగారింటి దగ్గర కొన్నాళ్ళు నా దగ్గర, ఇలా మా కొత్త సంసారం సాగుతోంది అని చెప్పాడు. దాదాపు ఏడెనిమిది పుస్తకాలు రాసి, నేపాలీ భాషలో గొప్ప కవిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్న యువకవికి ఇదేం దుస్థితి అనుకున్నాను. నా పెళ్ళయిన కొత్త రోజులు గుర్తుకొచ్చాయి. నాలుగొందలు జీతం. ఇంటద్దె 270. మిగిలిన 130ని ఏం చెయ్యాలో నూట ముప్పరు సార్లు తర్జన భర్జన సాగించేవాళ్లం. ఇద్దరం ఎం.ఏ. చదువుకున్నా, కొన్నాళ్ళు దుర్భర స్థితినే అనుభవించాం. దశాబ్దాలు గడిచినా దేశంలో చదువుకున్న యువత దారిద్య్రం మారలేదని ఇంకా బాగాఅర్థమైంది. ఇలాంటి వాటి పట్ల ఎప్పుడూ అతను చిన్న బాధను వ్యక్తం చేయలేదు. కవి కదా. నవ్వులూ జోకులూ గలగలా వుండేవాడు. నన్ను గొప్ప స్నేహితుడనుకున్నాడేమో. గొప్ప కవి కూడా అనుకుంటాడు. నా మీద గొప్ప వ్యాసం కూడా నేపాలీలో రాశాడు. నేను మాత్రం అతనిని నా కన్న కొడుకులా అనుకున్నాను. నన్ను ఆ రెండు రోజులూ కంటికి రెప్పలా చూసుకున్నాడు. తను పనిచేసే కాలేజీలో స్టూడెంట్స్‌తో నా ఇంటరాక్షన్ పెట్టించాడు. పిచ్చినాన్న కవిత ఇంగ్లీషులో చదివితే ఆడ పిల్లలంతా కన్నీళ్ళతో నన్ను చుట్టుముట్టారు. ప్రిన్సిపాల్, ఇతర స్టాఫ్ నాకు సన్మానం చేశారు. డార్జిలింగ్‌లో వున్న ప్రముఖ సాహితీ వేత్తలతో నన్ను పరిచయం చేశాడు. యువ పురస్కారం ప్రస్తావన వస్తే, ప్రతి సారీ పుస్తకాలు పంపమని, మీ పేరు టాప్‌లో వుందని అంటారు. తీరా ప్రకటన వచ్చేసరికి వేరే పేర్లుంటాయి. అందుకే ఈ సారి పుస్తకాలు అడిగినా పంపలేదు అన్నాడు. అయ్యో ఆ తప్పు చేయకు పంపించు అన్నాను. క్యా అవార్డ్ గివార్డు సార్. క్యా హోతాహై ఉస్ సే. అని కాస్త చికాకు పడ్డాడు. నీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. నీ కవిత్వానికి కొలమానం అవార్డు కాదు గానీ నీకు తప్ప కుండా వచ్చి తీరుతుందని నాకు నమ్మకం వుందన్నాను. ఛోడియేనా సార్. అన్నాడు. లేదు లేదు నువ్వు పుస్తకాలు పంపకపోయినా ఈ సారి నీకు తప్పక వస్తుంది. ఎలా వస్తుందో నాకు తెలియదు అన్నాను. అదిగో అందుకే తనకు అవార్డు వచ్చిన వార్త తెలియగానే మొదటి ఫోన్ నాకే చేశాడు. అప్పుడు నాకు కలిగిన పుత్రోత్సాహం అంతా ఇంతా కాదు. మన తెలుగులో కూడా ఒక ప్రతిభావంతుడైన యువకవికి కూడా ఇవే మాటలు చెప్పాను. అతనికి రాలేదు. అది గీటు రాయి కాదు కదా, అతనేం పట్టించుకునే వాడు కాదులెండి. ఎందుకు నేనంతగా మహేష్ దహాల్కి ఈ కనీస గుర్తింపు రావాలని కోరుకున్నానో చూడండి.
1989లో పుట్టిన ఈ కుర్రాడు 20 సంవత్సరాల వయసులో మొదటి కవితా సంపుటి ప్రచురించాడు. మరో రెండేళ్ళకే రెండో కవితా సంపుటి వేశాడు. అప్పటికి అతని గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాలేదు. 2012 లో గ్రాడ్యుయేషన్, 2014 లో పీిజీ. పూర్తి చేశాడు. ఈ మధ్యలో 2013లో కర్ణ విరాహ అనే కవితో కలిసి రుబాయీల పుస్తకం తీసుకువచ్చాడు. 2014లో గజల్ సంపుటిని వెలువరించాడు. అదే సంవత్సరం బెనారస్ హిందూ యూనివర్సిటీలో పీహెచ్‌డీలో చేరాడు. 2017లో మరో కవితా సంపుటి వేశాడు. 2018లో పీహెచ్డీ పూర్తి చేశాడు. అదే సంవత్సరం ఇప్పుడు పనిచేస్తున్న కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. 2019లో ప్రేరణారారుతో పెళ్ళి, ఇదే ఏడాది అతని మొదటి కథా సంపుటి వేశాడు. అచల్ కుహిరో అనే ఆ కథా సంపుటికే ఇప్పుడు సాహిత్య అకాడెమీ యువ పురస్కారం వచ్చింది. సాహిత్య విమర్శ వ్యాసాల పుస్తకం ఒకటి వచ్చింది. రెండోది సిద్ధంగా వుంది. ఇతతను రాసిన విమర్శ మీద కొందరు పెద్దలు కినుక వహించి వారి పెద్దరికాన్ని ఘనంగా చాటుకున్నారు. దాదాపు 30 జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పత్రాలు సమర్పించాడు. అదీ ఈ యువ కవి సాహిత్య ప్రస్థానం.
పుట్టిన సామాన్య కుటుంబ నేపథ్యం, సాగుతున్న అతి సామాన్య పేద జీవితం అతని రచనకు ఏనాడూ అడ్డు రాలేదని అర్థమైంది కదా. మరి ఇలాంటి కుర్రాడికి పురస్కారం ఎందుకు రాలేదని నేను ఆశ్చర్యపోవడంలో అర్థం వుందనే అనుకుంటున్నాను. అతను మాత్రం వాక్యంలో పనికి రాని పదాన్ని తీసేసినంత ఈజీగా అవార్డుల్ని పక్కన పెట్టాడు. కవి ధిక్కారం అలాగే వుంటుంది. కవిత్వ రచనకు ప్రయోజనం కవిత్వమే. మరో వైపు కవి చూశాడా కవిత్వం అతని నుంచి చూపు మరల్చుకుంటుంది. అవార్డుల కోసం అడ్డమైన దారులూ తొక్కే చవకబారు సాహితీ ప్రకాండుల్ని చూసి సిగ్గుపడే కంటే, ఇదిగో ఇలాంటి ధిక్కార కవుల్ని చూసి గర్వపడదాం. మనకీ ఇలాంటి యువకులు ఎందరో కొత్త కెరటాలై పైకి లేచి కొత్త ఆకాశాలను ఊరిస్తున్నారు. వారు ముందు ముందు అద్భుతాలు చేస్తారు. దారి తప్పిన పెద్దలకు దారి చూపిస్తారు.
ఇక ఇతని కవిత్వంలోకి వెళదాం. ఇద్దరం కలిసి పాల్గొన్న కోక్రాఝార్ వందభాషల కవి సమ్మేళనంలో ఇతను రెండు కవితలు చదివాడు. చిన్నవే. కానీ అతని చూపును పట్టిస్తాయి.
''తాతయ్య..అతని దీవెన'' అనే ఈ కవితను చూడండి.
''నేను మా తాతయ్యను గుర్తు చేసుకుంటున్నాను /ఆయన చేతుల్లో లాంతరు, కలశం/ తాత పెదాల నుంచి జారిన దీవెన/ అలాగే ఆ దీవెనతో పాటు కింద కురిసే/ రెండు మూడు కన్నీటి బొట్లు గుర్తుచేసుకుంటున్నాను./ భీమసేనుడివి కావాలి, కృష్ణుడివి కావాలి/ ఇంకా నేనేదేదో కావాలని తాత కలల దీవెనలెన్నో.../ నేను నేనే కాలేక పోయాను./ ఇప్పుడు నా హృదయంలో మా తాత ఒక మసకబారిన జ్ఞాపకం./ సముద్రం అంతటి దీర్ఘాయుష్సు /నాకు కలగాలని తాత ఆకాంక్ష/ నేను ఇప్పటిదాకా సముద్రమే చూడలేక పోయాను/ ఎంతెంత ఆశల ఆశీస్సులు కురిసేవాడు తాత!/ పచ్చని పాదై నేలంతా పాకాలన్నాడు ,/ పాదునైన మాట నిజమే గాని, వేల పాదల కింద./ రాళ్ళు తాకితే నీళ్ళు కురవాలన్నాడు,/ ఇప్పటికీ నేను రాళ్ళతో కుస్తీపడుతాన్నాను/
ఇప్పుడు భయం వేస్తోంది నాకు/నా మనవళ్ళని, మనవరాళ్ళనీ తాతయ్యలాగా దీవించగలనా లేదా అని./ మా తాతలాగా ఆ పసికందుల చేతుల్లో నాలుగు పైసలు పెట్టి/వాళ్ళ మొహల్లో చిరునవ్వు చూడగలనా లేదా అని''
ఈ చివరి వాక్యాలతో అందరి కళ్ళూ తడిశాయి. ఈ దేశంలో ఒక యువడి హృదయాన్ని అల్లకల్లోల పరుస్తున్న ఆర్థిక పరిస్థితులు దేశమే వింటే దానికీ కన్నీళ్ళు వస్తాయి. ఇంకో చిన్న కవిత. ఆధునికత కోసం.
''మొబైల్లో ఇంటర్నెట్ వేశా'' అమ్మ ఒక రోజు అడిగింది/పొద్దస్తమానం ఆ మొబైల్లో ఏంట్రా చూస్తావ్? అమ్మా ఇంట్లో కూర్చోనే మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నా/నేను ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నా/
అమ్మా మొబైల్లో ఇంటర్నెట్ వేశా/అమ్మ కలల్లో చూసిన రంగుల లోకాన్ని/ అమ్మకు నా చేతుల్లో చూపించా/అమ్మ జమానా నాటి కొన్ని సినిమాలు../ అమ్మ ఎప్పుడూ కననీ విననీ ఇళ్ళూ/ఇంద్రభవనాలూ చూపించా/అమ్మ నోరు తెరిచి అలాగే వుండిపోయింది
అమ్మ నన్ను మళ్లీ అడిగింది/ఇంకేమేం చూపిస్తుందిరా నీ మొబైల్?/పేరుతో పాటు ఖరీదుతో సహా/దేశవిదేశాలు చూపిస్తుందే అమ్మ/నాయకుల వేషాలు../నగ స్త్రీల కేశపాశాలు చూపిస్తుంది అవును అన్నీ చూపిస్తుంది/నిన్నూ నన్నూ తప్ప.''
ప్రపంచం ఇప్పుడు మన చేతుల్లో వుంది నిజమే. అందులో మనం లేము అదీ అసలు నిజం.
ఈ కవి తాత్విక గంభీరత్వాన్ని చూపించడానికి ఒక చిన్న కవిత ఉదహరిస్తా. కాలాన్ని బుద్ధుడితో పోల్చి బుద్ధత్వాన్ని తనలోనికి తర్జుమా చేసుకునే ప్రయత్నాన్ని ఎంత తాత్వికంగా కవిత్వం చేశాడో చూడండి.
''కాలము-నేను''
కాలం అంత క్రూరమైనది కాదు/అలాగని దయాళువూ కాదు/నేను కాలాన్ని ఒక ప్రేరకుడని అనుకుంటున్నా/ ఒక రోజు కాలం నా పాదాలను నిరోధించి/ తన పాదాలను నా మోకాళ్ళపై ఉంచి/ నా మీదకు ఎగబాకింది/
నా ఖాళీ పొట్టలానే కాలమూ అంతే/ ఖాళీగా ఉందనుకున్నా/ మౌనంగా ఊరుకున్నా/ తిరిగి కాలం నా ఛాతీ మీదకు పాకి హర్ష దుందుభి మోగించింది/నా మెడను మరింత ఎత్తుగా నిలబెట్టింది/నా చెవుల్ని విజయ సంకేతాల ప్రతిధ్వనులతో నింపేసింది/కాలం నా కళ్ళని/కాంతివంతం చేయాలని చూసింది/నేను మౌనంగానే ఉండి పోయాను /ఆ తర్వాత కాలం/ నా మస్తిష్కాన్ని అధిరోహించి కూర్చుంది/నేను కాలంలోకి.. కాలం నాలోకి పరావర్తనం చెందాం/నేను బుద్ధుడినయ్యాను/అసలు కాలమే బుద్ధుడు.''
ఇతనికి కవిత్వం పట్ల సాహిత్యం పట్ల సమాజం, మనుషులు లోకం, రాజకీయ పోకడలు, ప్రాపంచిక పరిణామాలు అన్నింటి పట్ల చాలా స్పష్టమైన అవగాహన వుంది. ఉరకలెత్తే ఉత్తేజం, సాహసం, ప్రయోగాభిలాష, మానవ స్పందనల మహానుభూతులు ఇతని అక్షరాల నిండా కనిపిస్తాయి. ఎలాంటి రచనలంటే ఇష్టపడతారని అడిగాను. ఏ విషయమైనా దాంట్లో పూర్తి సంలీనం కాకుండా రాయనని అంటాడు అయినా సామాజికత, సమకాలీనత, రాజనైతిక విశృంఖలత, జీవన దార్శనికత తన నిత్య అధ్యయనం అని చెప్తాడు. యువత సమస్యల మీద తన చూపు స్పష్టంగా వుంటుందన్నాడు. ప్రస్తుతం అతని కవితలు హిందీలోకి అనువాదం అవుతున్నాయట. కొత్త కవితా సంపుటి కూడా రెడీగా వుంది. మరో విమర్శ వ్యాసాల పుస్తకం ప్రచురణకు సిద్ధంగా వుందని చెప్పాడు. నేపాలీ సాహిత్య చరిత్ర, నేపాలీ పోరాట చరిత్ర రేఖామాత్రంగా వినిపించాడు. నా ద్వారా తెలుగు కవిత్వ రుచిని ఆస్వాదించే అదృష్టం కలిగింనందుకు సంతోషిస్తున్నానని, తెలుగు పాఠక లోకానికి తన వినమ్ర ప్రణామాలు అందజేశాడు. కాసులు లేకున్నా కవిత్వం లోకాన్ని కనిపెట్టుకుంటుంది. కాసులు లేని కవిత్వం జీవితాన్ని కాపాడలేదు. జాగ్రత్త అన్నాను. కన్నీళ్ళతో కవిత్వం కడుపునింపుతావు, నీ కడుపు నిండదు. మంచి ఉద్యోగంలో చేరానని నువ్వు చెప్పే వార్తే నాకు నిజమైన సంతోష వార్త అన్నాను. కొన్ని సూచనలు చేశాను. మరి రానున్న కాలంలో ఈ యువ కవి అనేక కొత్త పుంతలు తొక్కి తనకాలపు మహిమాన్విత నేపాలీ సాహిత్య దీపాన్ని దిగ్విజయంగా వెలిగిస్తాడని, ఎన్నో కీర్తి శిఖరాలు అధిరోహిస్తాడని అందరం ఆశిద్దాం. మహేష్ కి నా హృదయాభినందనలు.
కాలము-నేను
కాలం అంత క్రూరమైనది కాదు/అలాగని దయాళువూ కాదు/నేను కాలాన్ని ఒక ప్రేరకుడని అనుకుంటున్నా/ ఒక రోజు కాలం నా పాదాలను నిరోధించి/ తన పాదాలను నా మోకాళ్ళపై ఉంచి/ నా మీదకు ఎగబాకింది/నా ఖాళీ పొట్టలానే కాలమూ అంతే/ ఖాళీగా ఉందనుకున్నా/ మౌనంగా ఊరుకున్నా/ తిరిగి కాలం నా ఛాతీ మీదకు పాకి హర్ష దుందుభి మోగించింది/నా మెడను మరింత ఎత్తుగా నిలబెట్టింది/నా చెవుల్ని విజయ సంకేతాల ప్రతిధ్వనులతో నింపేసింది/కాలం నా కళ్ళని/కాంతివంతం చేయాలని చూసింది/నేను మౌనంగానే ఉండి పోయాను /ఆ తర్వాత కాలం/ నా మస్తిష్కాన్ని అధిరోహించి కూర్చుంది/నేను కాలంలోకి.. కాలం నాలోకి పరావర్తనం చెందాం/నేను బుద్ధుడినయ్యాను/అసలు కాలమే బుద్ధుడు.''
- డా|| ప్రసాదమూర్తి,8499866699