Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిటికీ దగ్గర కూర్చొని
కనబడుతున్న ప్రపంచాన్ని తదేకంగా పరిశీలిస్తా.
కనబడుతుందే ప్రపంచమనుకుంటూ
అందులో ఏదో ఓ మూల నువు కనిపిస్తావనుకుంటూ!
వెర్రిగా చదూతున్న చలం వాక్యాలో
లోకమ్మరచి చూస్తున్న మణిరత్నం సినిమాలో
నిండుగా నిన్ను నా పక్కన కూర్చోబెడతాయి
పట్టుకోలేనంతగా దగ్గర చేస్తాయి.
ఒంటరి దారులు, సాయంకాల గాలులు
నీడలా నిన్ను నా పక్కన్నడిపిస్తాయి.
ఓ తేలికైన చిరునవ్వుని నిన్ను తల్చుకుంటూ
ఈ ప్రపంచంపైకి బరువుగా వదులుతా.
దాన్ని భరించలేకైనా నిన్ను నాకంటికి చూపిస్తుందేమోననుకుంటూ!
నేనిక్కడ నిన్ను కలవరిస్తూంటే
నీకక్కడ పొలమారటంలేదూ?
నువు నిండుకున్న మనసుతో నే నిట్టూర్చితే
నీ ఊపిరి బరువెక్కడంలేదూ?
వాటినైనా కనుక్కోలేకపోయావా?
కారణమేంటో!
మదిగదుల్లో చిక్కుకున్న నీ చిత్రాన్ని ఆకాశంపై చెక్కితే
నన్ను చూసి పిచ్చనుకునే ఈ జనాలు
కనిపించని గాలిలో, పూతావిలో
పరిమళించే ప్రేమని ఎలా పరికించగలరూ?
-సాయి శ్రీనివాస్ బస్వా, 7032319388