Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృషి, పట్టుదల ఉండాలే గానీ అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించాడు మన జగిత్యాల యువకుడు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టాడు. ఐఏఎస్ కావాలని కలలను కన్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరోలా ఆలోచించే విధంగా చేశాయి. కానీ అతనిలోని ఆసక్తి, ప్రజలకు సేవ చేయాలనే తపన తన కలను నిజం చేసుకునేలా చేయాలి. అతడే శరత్ నాయక్. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 374వ ర్యాంక్ సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆ విజయం వెనక దాగివున్న శ్రమ గురించి అతని మాటల్లోనే...
సివిల్స్ రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
ఇది నాకు చిన్నప్పటి నుండే ఉంది. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నపుడు ఒకరోజు చర్లపల్లి నుండి జగిత్యాల రావడానికి తెల్లవారు జామున బస్టాప్‌లో నిలుచున్నా. అప్పుడు ఒక గర్భిణి ఒంటి నిండా బట్టలు లేకుండా అర్థనగంగా అటుగా వెళ్ళడం చూశాను. ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగా లేదు. ఆమె ఆలా ఎందుకు ఉంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. సమాజం ఏం చేస్తుంది. ఎవ్వరూ ఆమెను ఎందుకు పట్టించుకోవడం లేదు. అనే ప్రశ్నలు నాలో పుట్టాయి. కానీ నేనేం చేయగలనో మాత్రం తెలియదు. వయసు పెరిగే కొద్ది సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి చూసి భరించలేకపోయేవాడిని. మేము జగిత్యాలలో ఉండేవాళ్ళం. హాస్పిటల్ కోసం చుట్టాలు ఎవరొచ్చినా మా అమ్మనే వాళ్ళకు క్యారేజీ పెట్టి ఇచ్చేది. ఇవ్వడానికి నేను హాస్పిటల్‌కు వెళ్ళేవాడిని. ప్రభుత్వ ఆస్పత్రులలో సౌకర్యాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతుండేవారు. ఇలా నేను పెరుగుతున్న క్రమంలో సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని అర్థమయింది. అలా పదో తరగతి వరకు వచ్చాను. స్కూల్లో డిబెట్ కాంపిటీషన్లు పెట్టినపుడు కాస్త ఎమెషన్గా మాట్లాడేవాడిని. అది చూసి మా సార్ ''శతర్ నువ్వు బాగా చదువుతావు కదా, సామాజంపై కూడా అవగాహన కూడా ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుంది. నీకు అదే సరైనది'' అన్నారు. అలా సార్ అనడంతో నాలో ఐఏఎస్ కావాలనే ఆలోచన వచ్చింది.
అప్పటి నుండే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టారా?
లేదు. మనసులో ఆలోచన ఉంది. కానీ పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు. మా నాన్న భాషా నాయక్. దుబారులో వలస కార్మికుడిగా పని చేసేవాడు. ఆమ్మ యమున, అంగన్వాడీ టీచర్. అమ్మ రోజూ జగిత్యాల నుండి చర్లపల్లికి 40 కిలో మీటర్లు ప్రయాణం చేసేది. నాన్న మాతో ఉండేవాడు కాదు కాబట్టి అమ్మ మా కోసం చాలా కష్టపడేది. నా తర్వాత తమ్ముడు, చెల్లి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఐఏఎస్ చేయడమంటే చాలా కష్టం. ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండాలనే ఆలోచన వచ్చింది. జగిత్యాలలో ఇంటర్ బైపీసీ చేశాను. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో అక్కడ ఫ్రీ సీటు వచ్చింది. కాబట్టి పెద్దగా ఖర్చులేమీ లేవు. తర్వాత మెడిసిన్ కోసం లాంగ్టర్మ్కి వెళ్ళాను. కానీ ఒక్క మార్కులో ఎంబీబీఎస్ సీటు మిస్ అయ్యాను. అప్పుడు అది మిస్ కావడమే ఇప్పుడు ఇది మంచిది అనిపించింది.
మెడిసెన్కు వెళ్ళిన వాళ్ళు మరి ఐఏఎస్ వైపుకు ఎలా వచ్చారు?
ఎంసెట్‌లో బి కేటగిరిలో సీటు వచ్చింది. సంవత్సరానికి ఐదు లక్షలు కట్టాలి. ఇంట్లో చెప్తే కట్టేవాళ్ళేమో. వాళ్ళకు భారం కాదలచుకోలేదు. దాంతో 2017లో కోరుట్లలోని పీవీ నరసింహారావు వెటర్నరీ కాలేజీలో కోరుట్లలో చేరాను. గవర్నమెంట్ కాలేజీలో సీటు రావడంతో ఆర్థిక భారం తగ్గింది. కాలేజీలో బాగా చదివేవాడిని. అక్కడ సార్లకు నాకు ఐఏఎస్ అంటే ఇష్టమని తెలిసింది. వాళ్ళు కూడా నన్ను అలాగే ప్రోత్సహించారు. వాళ్ళ సహకారంతో యూపీఎస్సీకి కావల్సిన ప్రిపరేషన్ మొత్తం అక్కడే చేశాను. అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత అసలైన ప్రిపరేషన్ ప్రారంభిం చాను. నా ఫ్రెండ్ డా.వెంకటేష్ నాకు చాలా సపోర్ట్ చేశాడు.
సివిల్స్ ప్రిపరేషన్ ఎప్పుడు మొదలుపెట్టారు?
2020లో నా గ్రాడ్యుషన్ అయిపోయింది. అప్పుడే సివిల్స్‌కి ప్రిపేర్ అవుతానని ఇంట్లో చెప్పాను. కోవిడ్ రావడంతో మా నాన్నను దుబారు నుండి వచ్చేయమన్నాను. ఏదైనా ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి ప్రిపేర్ కావాలని అనుకున్నాను. కానీ మానాన్న ''ఉద్యోగం ఏమీ అవసరం లేదు. నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. ముందు నువ్వు ప్రిపేర్ అవ్వు. నువ్వు చేయాల్సింది చెయ్యి. అన్నీ నేను చూసుకుంటాను'' అన్నారు. నాన్న ఇచ్చిన ధైర్యంతో 2020 ఆగస్టులో హైదరాబాద్ వచ్చేశాను.
ఆ టైంటో కరోనా వుంది కదా. ఇబ్బంది కాలేదా?
ఇబ్బంది ఉంది. కానీ ఇంకా టైం వేస్ట్ చేయడం కరెక్టు కాదని రూం తీసుకుని నా ప్రిపరేషన్ ప్రారంభించాను. అయితే కరోనా వల్ల కోచింగ్ సెంటర్లు ఏమీ లేదు. దాంతో సొంతంగా ప్రిపరేషన్ ప్రారంభించాను. అది కూడా నాకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చేసింది.
మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఎలా ఉండేది?
అప్పటికే వెటర్నరీ కాలేజీలో ప్రిపరేష్ ఉంది. అది చాలా ఉపయోగపడింది. ఎలా చదవాలి అనేది అక్కడే తెలుసుకున్నాను. కాలేజీ నుండి బయటకు వచ్చేసరికి 50 శాతం ప్రిపరేషన్ పూర్తయిందనే చెప్పాలి. అదే తర్వాత సంవత్సరానికి నాకు ఉపయోగపడింది. ఒక లైబ్రరీ చూసుకుని ఉదయం 6 నుండి రాత్రి 11:30 వరకు చదువుకుంటూ ఉండేవాడిని. మధ్యలో లంచ్ బ్రేక్, నిద్ర తీసేస్తే రోజుకు సుమారు 10 గంటలైనా చదవాలని నిర్ణయించుకున్నాను. నెల, వారం, రోజువారి టార్గెట్లు పెట్టుకొని ప్రిపరేషన్ ప్రారంభించాను.
ఎలాంటి కోచింగ్ లేకుండా ఫస్ట్ ఎటమ్లోనే సక్సెస్ అయ్యారు. దీని కోసం చాలా శ్రమించి ఉంటారు?
అవును. ముందు మెయిన్స్‌పై దృష్టి పెట్టాను. ఎగ్జామ్‌కి కంటిన్యూగా ఆరు గంటలు రాయాలి. అందుకే ప్రతి ఆదివారం ఏడు గంటల నుండి ఎనిమిది గంటలు రాస్తూ కూర్చునేవాడిని. తర్వాత రెండు రోజుల వరకు కుడి చెయ్యి పని చేసేది కాదు. ఆగస్టు నుండి జనవరి వరకు ఇలాగే చేసేవాడిని. ఎలాగైనా ఫస్ట్ ఎటమ్లో నా గోల్ రీచ్ కావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నా. ఎందు కంటే ఇంట్లో వాళ్ళకు ఇబ్బంది కాకూడదు. అలా ప్రిలిమ్స్ విజయవంతంగా పూర్తి చేశాను. ఫస్ట్ టైం కాబట్టి కాస్త భయం వేసింది. ఆన్లైన్ వీడి యోలు, ఆన్లైన్ క్లాసులు బాగా వినేవాడిని. తిండితో పాటు, నాకు సంబంధించిన మిగతా విషయాలన్నీ నా ఫ్రెండ్ వెంకటేష్ చూసుకునేవాడు. నా పని కేవలం చదువుకోవడమే. చాలా కష్టపడ్డాను. ర్యాంక్ వస్తుందనుకున్నాను కానీ అంత మంచి మార్కులు వస్తాయని అస్సలు అనుకోలేదు.
ఐఏఎస్ ఆఫీసర్‌గా మీ పని ఎలా ఉండాలనుకుంటున్నారు?
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య చాలా దూరం ఉంది. సాధారణ ప్రజలు అధికారుల దగ్గరకు రావాలంటేనే చాలా భయపడతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు. ఆ భయాన్ని పోగొట్టాలి. చిన్నతనం నుండి నేను చూసిన సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతాను. ముఖ్యంగా ఉమెన్ ఎడ్యుకేషన్, సాధికారత, గ్రామీణ విద్యపై దృష్టిపెట్టాలి. విద్య అంటే నాణ్యమైన విద్య అందించాలి. వైద్య సదుపాయాలు కల్పించాలి. అవినీతిని నిర్మూలించాలి. అలాగే రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులు, బాద్యతల పట్ల అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేయాలని అనుకుంటున్నాను.