Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ కన్నులు
మాటలాడుతాయి..
ఆ రెండు కన్నులు ఏకమై
మౌనంగా ఎన్నెన్నో గంపలకొద్దీ
ముచ్చట్లను మోసుకు తిరుగుతాయి ..
పలకలేని చోట
పదునైన ఆలోచన చోట
రెప్పలను ఆడిస్తూ
ఎన్నో ఖాళీలను పూరిస్తాయి .
వాడిపోయిన పువ్వులను ,
రాలిపోయిన రెమ్మలను చూసి
ఎక్కడో సగం తెగిపడ్డ ఆకాశాన్ని
గుండెలకద్దుకొని తనలో దాచుకున్న
నదిపాటను పాడుతాయి .
ఆ కన్నులకు కనబడకుండా
కాలం చేసిన ప్రతీ కుట్రలకు
ప్రతిఘటిస్తూ ఒక్కోసారి ఎర్రబడుతాయి .
అనంత సైన్యాన్ని వెంటేసుకొని
ఒక్క సైగతో యుద్ధం చేస్తాయి .
ఆపుతాయి కూడా ...
ఆ కన్నులకు
మరో కన్నులు జత కలిస్తే
లోకమంతా పచ్చగా పరిమళిస్తుంది
ఎన్నో హావభావాలతో స్నేహం చిగురిస్తుంది .
ఆకాశానికి కట్టిన ఊయలలు ఊగుతూ
సరికొత్త పాటలతో పక్షులై విహరిస్తాయి.
ఎవరైనా కన్నులబాష
వింటే బాగుండు ...
కన్నీటివ్యధలు మాత్రమే కాదు
చరిత్రలో దాయబడ్డ కథలు తెలుసుకుంటే బాగుండు ..
అక్కడొక రెండు కన్నులు
మాట్లాడుతున్నాయి ...
- రామ్ పెరుమాండ్ల,
9542265831