Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చినుకులు పెదాలపై సరిగమల
వాయులీనమై, పలికే రాగాలు
కనులు చైతన్య కాంతులై, కొన్ని క్లుప్త పదాల ఆనంద భాష్పాలు మెరుపు వర్షమై రాలాయి.
చిన్న సంతోషాలకే మురిసిపోతుంది మనసు
అన్ని సమస్యలనూ గాలికి వదిలి మనసు చిన్న పిల్లాడిలా గంతులేస్తోంది.
చీకటి గదిలోనుంచి వెలుగు కిరణమై దూసుకుపోతుంది
శరీరాన్ని దహించి వేస్తున్న వేడి విషయాలు చలి కాచుకుంటున్నాయి.
చేతలకు తెలుసు చేతులు కాల్చుకుంటామనీ
అందుకే మాటలు వేదాలు వల్లిస్తుంటాయి.
కునుకు కలలు తూర్పుకి పయనిస్తున్నాయి
కొత్త రోజు బతుకు బాట పడుతుంది
ప్రకతి బంధాలు ప్రశ్నార్థకాలై, క్లిష్ట సమాధానాలుపెదవి విరుపులై ....
ఉక్కపోత కలిగించే వర్షం ఆగి ఆగి కురుస్తుంది.
కరి మబ్బులను శోధిస్తున్న ఆకాశం ఉబ్బరిస్తుంది
నరకమంటే ఇదే కదా!
స్వేచ్ఛకు, బంధాలకు దూరమై, మస్తిష్కం గోడలపై చెక్కే వేదనాక్షరాలే కదూ!
కరుకు శబ్దాలు చెవులను తాకుతూ చెప్పేదే
చెపుతుంటే,చివుక్కుమంటుంది ప్రాణం.
ఒక స్వేచ్ఛా ప్రవాహం,వాయువై వచ్చి కమ్ముకున్న మబ్బుల్ని తరిమేస్తే,ఎంత బాగుండేదో!
పాచి పట్టిన ఆలోచనలు వ్యూహ రచనలు చేస్తూనే వున్నాయి.
ఊహల్లోని పచ్చదనం, బతుకులో నిండుకుంది.
- ప్రమోద్ ఆవంచ
7013272452