Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యాన్ని అభిరుచిగా మలుచుకొని, పోలీసు ఉద్యోగంలో స్థిరపడినా సాహిత్య రంగంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రతిష్టాత్మక ఓయూ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న ఘనపురం సుదర్శన్‌తో ముఖాముఖి.
'ఆజాదీకా అమతోత్సవ' వేళలో జాతీయోద్యమ సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందడం మీకెలా అనిపిస్తుంది?
తెలంగాణ ప్రాంతపు జాతీయోద్యమ కథలపై సరైన సమయంలో పరిశోధన సిద్ధాంత వ్యాసాన్ని రచించినందుకు ఆనందంగా ఉంది. గతించిన స్వాతంత్య్ర ఉద్యమకారుల స్మతులను, జరిగిన జాతీయోద్యమ ఘట్టాల గురించి యావద్భారతం స్మరించుకుంటున్న ఈ వేళలో ఒక పరిశోధకుడిగా ప్రామాణికమైన అంశంపై పరిశోధన చేసినందుకు ఒకింత గర్వంగా కూడా భావిస్తున్నాను.
నిత్యం సవాళ్లు ఎదుర్కొనే పోలీసుకి, సాహిత్యానికి ఎలా సంబంధం కుదిరింది?
'సర్వ హితేన సాహిత్యం'. ఏ వత్తిలో ఉన్నవారైనా సాహిత్యాన్ని చదువుకుంటే సాటి మనుషుల పట్ల ఉండాల్సిన సగటు మానవతా విలువలు అలవడతాయి. ప్రతీరోజు నా కర్తవ్యంలో ఎక్కడో ఒకచోట అలసిపోక తప్పదు. కాబట్టి ఈ ఆలసట నుంచి ఉపశమనం పొందాలంటే దానికి సాహిత్యమే సరైన ఔషధమని భావించాను. అలా నా వత్తికి, సాహిత్యానికి సమన్వయం కుదిరింది. ఇక్కడొక మాట చెప్పుకోవాలి. నేను ప్రాథమికంగా పరిశోధకుడిని. ఆ తర్వాతనే పోలీసుని.
మీ నేపథ్యం వివరించగలరా ?
మాది రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ తాలూకా అనంతవరం గ్రామం. వ్యవసాయ కుటుంబం. మా నాన్న పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ, అమ్మ కూలీకి వెళ్తూ అనేక కష్టాలు పడి చదివించారు. మేం ముగ్గురన్నదమ్ములం. పెద్దన్నా గ్రామంలో సర్వేయర్. చిన్నన్న కూడా పోలీసే.
మీ విద్యాభ్యాసం గురించి చెప్పగలరా?
పదోతరగతి వరకు మా గ్రామంలోని ప్రభుత్వ బడిలోనే చదివాను. ఇంటర్మీడియట్ చేవెళ్ళలో, డిగ్రీ వికారాబాద్ విశ్వభారతిలో చదివా. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన పిజీ ప్రవేశ పరీక్షలో తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఈ పీజీ ప్రయాణంలో అన్న ఘనపురం పరమేశ్వర్, డిగ్రీలో సత్యయ్య సార్ల ప్రోత్సాహం మరవలేనిది.
సాహిత్యంపై అభిలాష ఎలా ఏర్పడింది?
పీజీలో ఉన్నప్పుడు కేవలం మంచి మార్కులు వస్తే చాలనుకున్న. కానీ మా గురువులైన డా. లక్ష్మణ చక్రవర్తి, డా. బాల శ్రీనివాసమూర్తి గార్ల సాన్నిహిత్యం వలన సాహిత్యం చదవాలి, ఉన్నతంగా ఎదిగేందుకు సాహిత్యం ఒక సోపానం కావాలనుకుని దానిపై అభిలాషను ఏర్పర్చుకున్నాను.
మీపై ప్రభావం చూపిన రచనలు, రచయితలు ?
నేను చదివిన తొలి నవల వట్టికోట ఆళ్వారుస్వామి 'ప్రజల మనిషి'. నాపై అధికంగా ప్రభావం చూపింది. మాత్రం చలం గారి రచనలు. తెలుగు భాష, పదజాలం అంటే ఇలా ఉండాలని వీరి సాహిత్యం ద్వారా తెలుసుకున్న. ఆ తర్వాత శ్రీశ్రీ, తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మల సాహిత్యం చదువుకున్న. ఈ కాలంలో అయితే నాకు జీవితాదర్శంగా నిలిచిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ 'నల్లద్రాక్ష పందిరి' నన్ను అమితంగా ఆకర్షించింది. వీరి జీవితమే నాకొక ఆదర్శం. అలాగే అయాన్ రాండ్ రాసిన 'ఫౌంటెన్ హెడ్' తీవ్ర అలజడికి గురిచేసి నాపై గాఢమైన ప్రభావం చూపింది.
మీ పరిశోధన ప్రయాణం గురించి వివరించండి?
ఉద్యోగంలో చేరకముందే యూజీసీ నెట్లో జీ=ఖీ (జూనియర్ రీసెర్చి ఫెలోషిప్) సాధించాను. దీంతో ఎలాగైనా ూష్ట్ర.ణ. చేయాలని అనుకొన్న కొంత కాలానికే తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చింది. అక్కడితో ఫెలోషిప్ వదులుకొని 2017 డిసెంబర్లో ఓయూలో ూష్ట్ర.ణ లో చేరా. ఈ క్రమంలో ఎంతోమంది చేత అవమానాలకు గురయ్యాను. అయినా నా లక్ష్యమే ముఖ్యమనుకుని వెనుతిరగకుండా వెళ్లాను. నాకు పర్యవేక్షకులుగా వ్యవహరించిన డా.సాగి కమలాకరశర్మ ప్రోత్సాహం ఎనలేనిది. ఇక్కడ ఖచ్ఛితంగా ఒక మాట చెప్పాలి. అదేమంటే నా పరిశోధానాంశ ఎన్నికకు మూలం. మా గురువు డా.లక్ష్మణ చక్రవర్తి. వీరి ప్రోద్భలమే నన్ను ఇక్కడి దాకా తీసుకువచ్చింది.
మీ పరిశోధనలో ఎన్ని కథలు లభ్యమయ్యాయి? వాటి వివరాలు?
నా పరిశోధనలో 123 జాతీయోద్యమ కథలు లభ్యమయ్యాయి. ఈ కథల్లో ప్రముఖ జాతీయోద్యమ ఘట్టాలను తెలిపినవి అనేకం ఉన్నాయి. ఈ కథలని రాసిన రచయితల సంఖ్య 58. వీరిలో బ్రిటీషాంధ్ర రచయితల సంఖ్య 13. తెలంగాణ వారి సంఖ్య 44. ఒకరు ఒడిశా వ్యక్తి.
క్షేత్ర పర్యటనలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు?
నాకిది ఒక సవాల్‌గా మారింది. కథల సేకరణ కోసం పరిశోధక మిత్రులు మధన్మోహన్, విజరులతో కలిసి శ్రీకాకుళంలోని కథానిలయం, విశాఖపట్నం, రాజమండ్రి, కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాను. ఇందుకు నా ఉన్నతాధికారులు చాలా వరకు సహకరించారు.
ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు మరోవైపు పరిశోధన ఎలా సమన్వయం చేసుకున్నారు?
నా సంకల్ప శక్తి, నా ఆప్త మిత్రులైన ఎం.వెంకటేష్, మధన్, నాగరాజు, విజరు, మహేష్‌తోపాటు ఉన్నతాధికారుల సహకారం ఇందుకు చాలా ఉపకరించింది. డ్యూటీ ముగిశాక దొరికిన సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాను.
మీ ఇతర రచనల గురించి ?
నిత్యం జరుగుతున్న సమాజ ఘటనలు నన్ను తీవ్రంగా కలిచి వేశాయి. ఆ కలతలోంచి, వేదనలోంచి నా హదయం ఘోషించింది. అలా వచ్చిన కవిత్వ సంపుటి '' హదయ ఘోష''. దీనికి ప్రముఖ కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ముందుమాట రాయడం. దానిని మరో ''యోగ్యతా పత్రం''గా నేను భావిస్తున్నాను. అలాగే నా తొలి కథ 'గూడు చేరిన పక్షులు' నమస్తే తెలంగాణ వారి బతుకమ్మ సంచికలో, చిన్న కథ ఈనాడు వారి విపులలో ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం మీరు నవతెలంగాణ ఆదివారం అనుబంధం సోపతిలో వారం వారం రాస్తున్న వ్యాసం గురించి తెలపండి ?
భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని, భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమతోత్సవాల సమయంలో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులను పరిచయం చేయాలన్న సంకల్పంతో, ప్రతీ వారం తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల సాహిత్యం, వారి జీవితం గురించి ''తెలంగాణ స్వాతంత్య్రోద్యమ సాహితీకారులు'' పేరిట వ్యాసం రాసేందుకు అవకాశమిచ్చిన నవతెలంగాణ యాజమాన్యానికి కతజ్ఞతలు.
మీ జీవితాశయం ఏమిటి ?
విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠాలు బోధించాల న్నదే నా ఆశయం. అలాగే రోజురోజుకూ దిగజారుతున్న మానవతా విలువలను సాహిత్యం ద్వారా పెంపొందించడం, సజనాత్మక రచయితగా ఎదగడం. నా పరిశోధనా క్రమంలో లభించిన అడ్లూరి అయోధ్య రామయ్య అలభ్య రచనలను వారి కుటుంబ సభ్యుల సహకారంతో పుస్తకంగా తీసుకురాబోతున్నాం. అలాగే 52 వారాలుగా ధారావాహికంగా 'స్వాతంత్రోద్యమ సాహిత్యకారులు' పేరిట రాస్తున్న వ్యాసాలను భవిష్యత్తులో పుస్తకంగా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాం.