Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొంగి తొంగి చూస్తున్న
నీ ఓర చూపులూ
నా కంటి రెప్పలను తాకుతున్నప్పుడు
నేనొక కొత్త ఊపిరినెత్తుకొని
మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది
నీ ముఖంపై
నల్లని కురులు నాతో దాగుడుమూతలు
ఆడుతున్నప్పుడు
నా యెదమీదికి మర్లవడ్డ
నీటిని అంతా ముడేసి
ఎనక్కి లాగేస్తున్నట్టు అనిపిస్తుంది.
నేను నీ చెంతలేనప్పుడు
నువ్వొక వాన జల్లువై
నాకోసం పరితపిస్తుంటే
నా మనుసొక
పాలింకిన పాలకంకి అవుతుంది.
నీ వెనక చల్లగాలిలా
అంటిపెట్టుకొని నన్ను కాపాడుకుంటుంటే
నేను నడిచే నిప్పుల తోవకు
నువ్వొక నీటి వాగులా అనిపిస్తుంది.
నా వైపు చూస్తూ
అందంగా నవ్వినప్పుడు
నీ మొహంలో వచ్చే వెలుగుకు
ఉడుకు ఉడుకు గంజిలో
నేనొక బువ్వ మెతుకును అవ్వలేనా..!
ఆ వెలుతురు కాంతులను
నా చీకటి దారుల ఇనుప కంచెలముందు
పూతోటలు పూయించి
ఓ పువ్వునై పూస్తున్నాను.
నవ్వడం మరిచిపోతున్న
నా పెదాలకు
నవ్వును పరిచయం చేసింది
నీ పరిచయమే కదా..!
మా పత్తి శెల్కలో
పత్తి ఆకులు ముడుసుకున్నట్లు
అలిగి నువ్వు మూతి ముడుసుకుంటే
సిగ్గెక్కిన నీ ఎరుపు సెంపలపైన
నా పెదాలు తడిచేస్తున్నప్పుడు
పత్తి పువ్వోలే అందంగా
నీ నవ్వులు పురుడోసుకుంటై.
నీ కనుబొమ్మలు... నాకై
నెమలి పింఛములా విచ్చుకుంటై
నా కంటిపాపల్లో నువ్వొక
అక్షరాల తీగవై పారుతున్నప్పుడు
నీ సొగసంచుకు కవిత్వాన్ని అల్లాలని
ఎప్పటికప్పుడు సీరా చుక్కనై వాలిపోతూ ఉంట..
నా కౌగిల్లో నువ్వు జారిపోతే
పేదోని ఇండ్ల అప్పు కాగితంలో
మిత్తీలు మోసుకొచ్చిన
కన్నీటి బరువు యాధికొత్తాంది
నా మనుసుకు ఊపిరందని క్షణాన
నీ పలకరింపే నాకొక
పచ్చని చేనులు మోసుకొచ్చిన
ప్రకృతి పైరగాలోసొంటిది.
నీ ఊపిరి నా ఊపిరితో
పెనవేసుకొని ఒక్కటైనప్పుడు
భూమాత ఒడిలోనుంచి
అప్పుడే పుట్టుకొచ్చే
మొక్కలవుతున్నం.
నీ పాదాలు చేసే అడుగుల సప్పుడుకు
నేనొక '' మువ్వల-పట్టీను'' అవుతానో
నీ సెంపల్లో మొలిచే సిగ్గుకు
నేనొక గాలి అణువును అవుతానో
కలసి వేసిన అడుగుల అలసటలు
చెబుతాయి.
మనిద్దరి మధ్య
కన్నీళ్ళు లేని ప్రేమను చూడాలని ఉంది
ఒకవేళ ఉంటే
ప్రేమతో ఆనందంగా వచ్చే కన్నీళ్ళు మాత్రమే
అయ్యి ఉండాలి..!
- శివకుమార్ తాళ్ళపల్లి , 9133232326.