Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకేమీ తెలుసమ్మా ఈ సమాజం గురించి
నీను పుట్టడం మీకు ఇష్టం లేదని తెలుసు
నన్ను చదివించే స్తోమత మీకు లేదని తెలుసు
ఎన్నాళ్లున్నా నిను మీకు భారమని తెలుసు
ఐనా నాకేమీ తెలుసమ్మా..
మీరు చెప్పిన వాడితో తలవంచి
తాళి కట్టించుకోవడమే తెలుసు
తొగొచ్చి కొడితే ఆ దెబ్బలను మీకు
కనబడకుండా దాచడమే తెలుసు
సిగరేటు గాయాల్ని
గంజి వొలికిందని చెప్పడమే తెలుసు
దెబ్బలకు వాచిన మొఖానికి,
వేవిళ్ల ముసుగేయడం తెలుసు
ఐనా నాకేమీ తెలుసమ్మా..
భర్త గుర్తోచ్చి ఉలిక్కిపడి,
కడుపులో బిడ్డ తన్నాడని అబద్ధం చెప్పడం తెలుసు
కడుపులో ఉన్నది మగ బిడ్డ కాకపోతే
జరిగే పరిణామాలు తెలుసు
ఒకవేళ ఆడపిల్ల అయితే దాని జీవితం కూడా నాలాగే అని తెలుసు
రాచి రంపాన పెట్టే అత్తని మరో తల్లిగా భావించడం తెలుసు
ఐనా నాకేమీ తెలుసమ్మా..
ఈ సమాజం ఎప్పుడు మారుతుందో..
నాకేమి తెలుసు..
- ఇనుగుర్తి సాయికీర్తి