Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నచ్చిత్రాలను తెంపకచ్చి
నేలమీద సల్లినట్టు సెనిగపూలసోకుతో
సేనుసేనంతా సింగారాలుపోతావుంటే
ఆకుపసిమి ఆకాసాన
పొసుపు కాంతి సుక్కలు నడుమ
నిండుసెందమావ మాదిరి పకపకా నవ్వేటి
నా పుల్లెంటికల పిల్లా..!
అమ్మలక్కసెప్పే కూతుమాటలకు నవ్వీ నవ్వీ
నన్నో నవ్వులసెలమ చేసేదానా.!
వొంచిన నడుం పైకెత్తకుండా
సాలల్లో తొలికేసి తొవ్వీ తొవ్వీ
కలుపుదీసి కువ్వలేసినట్టే
దేసెంనిండా...
మన్సులెత్తు పెరిగిపూడ్సిన యీ అవినీతికలుపుని
మన్సితనాన్ని కమ్మేసిన యీ రాజకీయ బోదగెడ్డిని
ఒడుపుగా పిడికిటబట్టికోసి పోగులెప్పుడేస్తావమ్మీ.!
చెనిగి తొవ్వాటంలో
సేవదిరిగిన నీ సేతులతో
కసువుకఱ్ఱలేరియేరీ కరుకుదేలిన
నీ బూడిదరంగు పిడికెళ్లతో
యీ అండేరపు ముండ్లు చేస్తున్న గాయాల్ని
యీ ఆంబోగపు పల్లేర్లు గుచ్చే సలపరింతల్ని
ఏర్లతోసహా యెప్పుడు తవ్విపారేస్తావమ్మీ!
అడ్డబలుపు గెడ్డితింటున్న దోపిడిదున్నలు
అందినకాడికి మేసిపోతుండాయి
అదిలించో బెదిరించో యెల్లగొట్టకపోతే
పొగరుబోతుగిట్టలకింద
చిదగాబొదగ నలిగిపోతున్న జనపదాల సేనూ
సేను లాంటి దేసెం-దేశిం లాంటి సేనూ
యామైపూడిస్తాయోయని తెగ దిగులుగున్నాదే.!
అమ్మీ..!
వొక తుపానొస్తేనే
ఇల్లూవాకిలి కయ్యాగాల్వ
యేమవుతాయోయని బలే యిదైపోయేటోళ్లం
దేసెమంతా ఇగబగాల మబ్బులుకమ్మి
కుటిలపిడుగుల యిసపువాన కురస్తావున్నా
ఇట్టా గొమ్ముగుండటం బాగుంటాదా?
అట్టా నోరు మెదపకపోడం మనిసిపుట్టకవుతాదా?
పొద్దుపువ్వును కొప్పులో బెట్టుకుని
పొద్దులొస్తం సేద్దెంసేసే చెమటగువ్వా
దిరసాని చెట్టుమీద జెముడికాకి పాట వింటూ
నా ఎదసేను కవిగిట్లో సేదతీరే సెంద్రవంకా.!
ఇట్టా దుక్కిస్తున్న ఊళ్లను చూస్తూ
నీ సుక్కలరైకపై కవితెట్టా రాసేదమ్మీ.!
సద్దెకూటినీళ్లు తాగేటప్పుడల్లా
యీ నేల దుఃఖాన్ని తలుచుకుంటూ
యెన్నితూర్లు తాండ్రచెట్టుతావ కుమిలిపోతిమో
యెన్నిమార్లు బాయిగుట్టకాడ బంగపోతిమో
మనం బుట్టిన మట్టికోసరం
మట్టిపై కూలిపోతున్న బతుకులకు
ఏదో ఒకటి జెయ్యాలని
సైగసైగ్గా సెంపల్ని ముద్దులాడేటపు గూడా
సత్తిబాసలెన్నో చేసుకుంటిమి గదా.!
దేసెమంత మరులుతో
నా భుజంకొమ్మలపై వాలే నీలికనుసోగల పిట్టా.!
దిగులులేని జాతికోసరం
దుఃఖంలేని ఊళ్లకోసరం
మనిసితనపు దోరణాలు
యీదీదిన కాపుగట్టడానికి
నా గడ్డిపూల సేతులుసాపి పిలస్తావుండా
కాదనక వస్తావు గదూ..!
నా కవితెల రగస్యాన్ని
కండ్లలో దాపెట్టుకున్నదానా
కవితను రాసే సేతుల్ని
ముద్దుపెట్టుకుంటావు గదూ..!
- పల్లిపట్టు నాగరాజు