Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోడౌన్ లో రసాయనాలు అక్రమ నిల్వ
- ప్రశ్నించిన సర్పంచ్, గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తన
- పట్టించుకోని పీసీబీ అధికారులు
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేశారు. ఇదేమని ప్రశ్నించిన సర్పంచ్, గ్రామస్తులపై కంపెనీ యజమాని దురుసుగా ప్రవర్తించడం. ఈ సంఘటన చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఆరెగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్417 లో సుమారు పది సంవత్సరాల క్రితం థర్మల్ కోల్ కంపెనీ నిర్మించారు. కొన్ని సంవత్సరాలు నడిపించి మూసేశారు.అందులో ప్రస్తుతం ఇల్లిగల్‌గా రసాయనాలను నిల్వ చేసే గోదాంగా మార్చి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.
అక్రమంగా రసాయన డ్రమ్స్ నిల్వ
హైదరాబాద్, గుజరాత్‌తో పాటు వివిధ ప్రాంతాల నుండి అక్రమ రసాయనాలు దిగుమతి చేసుకుని నిల్వ చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లుగా గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. యజమానికి గ్రామస్తులు ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెప్తున్నారని వారు వాపోతున్నారు.సోమవారం అందులో నుండి డీసీఎం లో లోడ్ చేసి వెళ్తున్నట్లు గా గ్రామ సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి కి సమాచారం అందడంతో కంపెనీలోకి వెళ్లారు.అక్కడే ఉన్న కంపెనీ యజమాని సర్పంచ్ ను సైతం లెక్క చేయకుండా దురుసుగా ప్రవర్తించారు. అందులోకి వెళ్లి చూడగా మూతపడింది అనుకున్న కంపెనీ లో అక్రమ రసాయనాల నిల్వలు చూసి ఆశ్చర్యపోయారు. పైగా కంపెనీ పరిసరాల్లోనే గతంలో ఉన్న గోదాంకు అనుకొని మరొక షెడ్డును గ్రామపంచాయతీ అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్నట్లు గుర్తించారు. ఇదేమని ప్రశ్నించగా హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఉన్నామని పంచాయతీ అనుమతి అవసరం లేదని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
పట్టించుకోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు
గుట్టు చప్పుడు కాకుండా ఇల్లీగల్ గా రసాయనాలను నిల్వచేసి పెద్ద ఎత్తున దండ నడుస్తున్న కూడా పొల్యూషన్ బోర్డ్ అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి. ఎస్వీ ఆగ్రో పేరుతో కంపెనీ బయట బోర్డు పెట్టారు. కానీ లోపల గోదాంలో అగ్రికి సంబంధించిన వాటితోపాటు వివిధ రకాల రసాయనాలను నిలువ చేసినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిత్యం తనిఖీలు చేయాల్సిన ప్రభుత్వ అధికారులు ఇల్లీగల్ గా రసాయనాలు నిల్వచేసి దందా నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అదనపు షెడ్డుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రమాద కారకమైన రసాయనాల అక్రమ నిలవులపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
-అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం:ఎంపీఓ అంజిరెడ్డి
ఆరెగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 417 లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం పై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. గ్రామపంచాయతీ కార్యదర్శి కి సమాచారం అందించి వెంటనే ఆ యజమాన్యానికి నోటీసులు అందజేస్తాం. ప్రభుత్వ అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలపై తగు విచారణ చేసి జరిమానా కూడా విధిస్తాం.