Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు నాసిరకమైన ఆహారం
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఆలేరు పట్టణకేంద్రంలోని బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్లో సమస్యలపై సర్వే నిర్వహించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాసిరకమైన ఆహారం పెడుతున్నారని తెలిపారు. పరిశీలన కోసం పాఠశాలకు వచ్చిన ఆర్సీఓకు సమస్యల గురించి ఎస్ఎఫ్ఐ నాయకులు వివరించారు . ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కాసుల నరేష్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు .విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని , వంట సామగ్రి నాసిరకంగా ఉంటుందని విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. మురిగిపోయిన కూరగాయలు, టమాటాలు ఉన్నాయని వాటిని వండి విద్యార్థులకు వడ్డిస్తున్నారని తెలిపారు. బియ్యం నాసిరకంగా ఉన్నాయని నూకలు చెత్తాచెదారంతో ఉన్నాయని వివరించారు. హాస్టల్లో దాదాపుగా 600 మంది విద్యార్థినులు ఉన్నారని వారికి సరిపోయే మూత్రశాలలు లేవని, అవి కూడా అపరిశుభ్రంగా కంపుకొడుతున్నాయని తెలిపారు. సమస్యలను ప్రిన్సిపాల్ దష్టికి తీసుకెళ్లగా ఆమె చాలా దురుసుగా ప్రవర్తిస్తుందని విద్యార్థులను బెదిరిస్తున్నట్లుగా తెలిపారు. ఎస్ఎఫ్ఐ బందం పరిశీలనకు వెళ్ళినప్పుడు సైతం ప్రిన్సిపాల్ అదే రీతిగా ప్రవర్తించారని విద్యార్థి సంఘం నాయకులు చెప్పారు . ఇక్కడ అంతా బాగానే ఉంది ,ఎవరూ రావద్దని తాము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని , విద్యార్థులు ఎవరు మాట్లాడరని దురుసుగా మాట్లాడారని తెలిపారు. అధికారులు వెంటనే కల్పించుకొని హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పందించి విద్యార్థినుల సమస్యల పరిష్కారం కొరకు సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యార్థుల సమస్య పరిష్కరించాలన్నారు . జిల్లాస్థాయి అధికారితో హాస్టల్ విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేసి అక్కడి సమస్యలను వారి ద్వారానే తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కంతి విక్రమ్ కమిటీ సభ్యులు జెరిపోతుల సంతోష్,పుట్టల శ్రీకాంత్,జేరిపోతుల పవన్ పాల్గొన్నారు.