Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు పుస్తకాలు కరువు
- ప్రయివేటు పాఠశాలల్లో పుస్తకాల దందా..
- హాస్టల్స్‌లో అందని దుప్పట్లు
- వైద్యశాలల్లో మందుల కొరత
- డబుల్ ఇండ్లకు మోక్షమెపుడో
- వరస వర్షాలతో గుంతలమయమైన రోడ్లు..
- నేడు నల్లగొండ జెడ్పీ సమావేశం
నవతెలంగాణ- నల్లగొండిపాంతీయప్రతినిధి
జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చించే వేదిక జెడ్పీ సమావేశం. కానీ కేవలం కొన్ని శాఖలకు సంబందించిన అంశాలను చర్చించి ప్రతిసారి మ..మ.. అనిపిస్తుంటారు. ఒకవేళ చర్చకు వచ్చిన అంశాలను కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం లభిస్తుందా అంటే అదీ జరగదు. ఇప్పుడు జిల్లాలో విద్యార్థులకు కనీస వసతుల్లేక ఇబ్బంది పడుతున్నారు. పుస్తకాల్లేేవు, హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు లేక వర్షాల కారణంగా చలికి వణికిపోతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల్లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో రోడ్లన్నీ గుంతలుగా మారాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డబుల్‌బెడ్ రూం ఇండ్లు ఎక్కడ వేసిన గొంగలి అనే చందంగా మిగిలిపోయాయి. ఇలా అనేక సమస్యలు పేరుకుపోయాయి. వాటికి పరిష్కారం లభిస్తుందనే ఆశతో జిల్లా ప్రజలు ఉన్నారు.
హాస్టల్స్‌లో అందని దుప్పట్లు..
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన హైస్కూల్, కాలేజీ వసతి గృహాలు సుమారు 150వరకు ఉన్నాయి. వాటిల్లో దాదాపు 16వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి జూన్‌లో పాఠశాలలు ప్రారంభం కాగానే దుప్పట్లు, నోటుపుస్తకాలు, ట్రంకు పెట్టె, ఇతర వాటిని ఆయా సంక్షేమ శాఖలు అందించాల్సి ఉంటుంది. నెల రోజులు దాటినప్పటికి ఇంతవరకు అవేవి రాలేదు. గత ఐదురోజులుగా వర్షాలు కురుస్తుండడంతో విద్యార్థులు చలికి వణికిపోతున్నారు. పాఠశాలల్లో పంతుళ్లు చెప్పె పాఠాలను రాసుకోవడానికి కూడ కనీసం నోటుపుస్తకాలు ఇవ్వలేదు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కరువు..
నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్, కేజీబీవీ, ఇతర పాఠశాలలు కలిపి సుమారు 475 ఉన్నాయి. గత నెలలో పాఠశాలలు ప్రారంభమైనప్పటికి ఇంతవరకు పాఠ్యపుస్తకాలు అందలేదు. ఇప్పటివరకు కేవలం లక్ష పుస్తకాలు మాత్రమే అందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ పాఠశాలలో చాలా చోట్ల మద్యాహ్నాం బోజనం వంట చేసే కార్మికుల సమస్య ఉంది. ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ సరిపోవడంలేదని వారు వంట చేయడం మానేసిన సంఘటనలు ఉన్నాయి.
ప్ర్రయివేటు పాఠశాలలో పుస్తకాల దందా
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్, డొనేషన్ల పరంపరగా కొనసాగుతుంది. ముఖ్యంగా పుస్తకాలు తమ వద్దనే కొనుగోలు చేయాలి.. బయట కొనుగోలు చేస్తే కుదరదు అంటూ పిల్లలను ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యం ఒత్తిడికి గురిచేస్తున్నది. ప్రయివేటు పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలు జరగకూడదని నిబంధనలున్నా వాటిని తుంగలో తొక్కేస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసే జరుగుతుందని, అయినా పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మందుల కొరత
జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో తీవ్రంగా మందుల కొరత ఉన్నట్టు తెలుస్తుంది. ఆస్పత్రి పక్కనే మందులు సరఫరా చేసే గోదాం ఉన్నప్పటికి మందులు ప్రతిపాదన పెట్టి తీసుకురావాల్సిన వైద్యాధికారి నిర్లక్ష్యంగా రోగి ఆస్పత్రికి వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం వల్ల బయటే కొనుగోలు చేస్తున్నారు. రోగులు ఎలాంటి పరీక్షలైనా ప్రయివేటుగా చేయించుకోవాల్సి వస్తుందని, ఆస్పత్రిలో సౌకర్యాలున్నప్పటికీ వాటిని వినియోగించడం లేదనే ఆరోపణలున్నాయి.
గుంతలమయమైన రోడ్లు
ఐదురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో గ్రామాల మధ్య ఉన్న రోడ్లన్నీ వర్షం నీరు నిలిచి గుంతలుగా మారాయి. రవాణ సౌకర్యానికి ఇబ్బందిగా మారింది. వెంటనే వాటిని పూడ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన గ్రామాల ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే తాము గ్రామాభివృధ్ధికి ఖర్చు చేసిన నిధులు రాలేదని, వాటిని కూడ మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
డబుల్ ఇండ్ల సంగతేంటి
ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా మొదలు పెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పదక¸ం ముందుకు సాగడంలేదు. గత ఐదారెేండ్ల్లుగా ఎక్కడ వేసిన గొంగటి అన్నచందంగా ఉంది పరిస్థితి. జిల్లాలో దాదాపు వెయ్యి ఇండ్ల పైగా మంజూరు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఇప్పటివరకు 200 నిర్మాణం కూడ పూర్తిచేయలేదు. చాలా చోట్ల పునాదుల స్థాయిలోనే కట్టడాలు నిలిచాయి. జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయినా అక్కడ మౌళిక వసతులు లేకపోవడం వల్ల పేదలకు పంపిణీ చేయలేదు.ఇలా ప్రతి చోట వాటి ఆగమ్యగోచరంగా ఉంది. జిల్లాలో యావత్తు ప్రజలకు అనేక సమస్యలున్నాయి. కనీసం వాటిని పరిష్కరించడం తర్వాత అయినప్పటికి వాటిని గుర్తిస్తే మంచిదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ జెడ్పీ సమావేశంలోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజలున్నారు.