Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నత్తనడకన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు
- ఇండ్ల కోసం నిరుపేదలు ఎదురుచూపు
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నత్తనడకన సాగుతు పేదలకు ఎదురుచూపులు మిగిలిస్తోంది. మూడు జిల్లాల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి విడతగా ఒక్కో నియోజవర్గానికి 400 ఇండ్ల చొప్పున 4800 ఇళ్లు మంజూరైనప్పటికి నేటికి ఎక్కడా ఒక్క ఇళ్లు కూడా నిర్మాణంపూర్తిగా జరుగకపోవడం పథకం ఎదుర్కోంటున్న సవాళ్లను చాటుతోంది. రెండో విడతలో నియోజకవర్గానికి 1000 ఇళ్ల చొప్పున మంజూరు చేసినా మొదటి విడత ఇండ్ల నిర్మాణాలే అధిక శాతం చేపట్టలేని పరిస్థితుల్లో రెండో విడత ఇండ్ల నిర్మాణాల ఊసు ప్రస్తుతానికి వినబడటం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణ వ్యయానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు చాలక తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు నిర్మాణ పనులకు ఆసక్తి చూపకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో స్థలాల కొరత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఆటంకాలుగా మారాయి. ప్రభుత్వం ఇసుక, సిమెంట్ తగ్గింపు ధరకు అందించేలా ఏర్పాటు చేసినప్పటికి ఆశించిన స్థాయిలో కాంట్రాక్టర్ల నుండి స్పందన లేదు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండ, నకిరేకల్, నాగార్జున సాగర్ నియోజవర్గాల్లో 2065 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయగా 1505 ఇళ్లకు టెండర్లు పిలిచారు. ఇందులో 650 ఇండ్ల కు మాత్రమే టెండర్లు పూర్తయ్యాయి. ఇప్పటిదాకా 415 ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభంకాగా ఎక్కడా ఒక్క ఇళ్లు నిర్మాణం పూర్తవ్వలేదు. నల్లగొండ నియోజకవర్గంలో 200 ఇండ్లు, మిర్యాలగూడలో 60, దేవరకొండలో 173, సాగర్‌లో 30 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. అవన్ని కూడా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. నకిరేకల్ నియోజకవర్గం పరిధిలో ఒక్క ఇంటికి టెండర్స్ కూడా పిలువలేదు. కేవలం దేవరకొండ మండలం కొండబీమనపల్లిలో మాత్రమే స్లాబ్ దశ నిర్మాణం జరుపుకుని ఫ్లాస్టరింగ్ పనులు సాగుతున్నాయి.
సూర్యాపేట మినహా అంతటా వెనకడుగే..!..
సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సైతం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. సాక్షాత్ సిఎం కెసిఆర్ 2015 దసరా రోజున సూర్యాపేట నుండే డబుల్ బెడ్రూమ్ పథకానికి శంకుస్థాపన చేశారు. అదేరోజు సిఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల్లోనూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కు శంకుస్థాపన చేయగా, వాటికి గత డిసెంబర్ 23న ప్రారంభోత్సవం సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఇండ్ల పూర్తికి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఇక్కడ 192 డబుల్ బెడ్ రూమ్ జిం2 మోడల్‌గా ఎనిమిది బ్లాక్‌ల్లో నిర్మాణ పనులకు కాంట్రాక్టర్లను ఒప్పించగా పనులు తుది దశకు చేరుకున్నాయి. పెన్‌పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెంలో 120ఇండ్లు సైతం స్లాబ్ దశ పనులు సాగుతున్నాయి. తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరుపుకున్నా నిర్మాణ పనులు అంతటా మొదలుకాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సైతం భువనగిరి, ఆలేరు, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా లెంటల్ దశలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతి కానరావడం లేదు. ఈ పరిస్థితుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులపై కలెక్టర్లు పదేపదే సమీక్షలు చేసినా క్షేత్ర స్థాయిలో స్థలాల కొరత, లేఅవుట్ల ఖరారు, కాంట్రాక్టర్ల నిరాసక్తతతో డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల నిర్మాణ పనులకు ట్రబుల్స్గా కొనసాగుతున్నాయి.