Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుల భూ సమస్యపై స్పందించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ -ఆలేరుటౌన్
నియోజకవర్గ కేంద్రంలో వారం రోజులనుండి దళితుల భూ సమస్యపై చేపడుతున్న నిరసన కార్యక్రమాలు తన దృష్టికి వచ్చాయని, భూ సమస్య పరిష్కారానికి విచారణ కమిటీ వేయనున్నట్టు ఆలేరు శాసన సభ్యురాలు, రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు .నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన భూ సమస్యపై హైద్రాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద తమ నివాసంలో మహిళలు విషయం తన దష్టికి తీసుకువచ్చారన్నారు . తనతో పాటు కలెక్టర్ పమేలా సత్పతికి, తహసీల్దార్ గణేశ్ నాయక్ సైతం సమస్యను వివరించారన్నారు .నిరసనలు తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు .సమస్య పక్కదారి పట్టవద్దన్నారు. మండల కేంద్రంలో సోమవారం బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో ధర్నా నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు ,నిరసన తెలియజేస్తున్న వారు డీసీఎం డ్రైవర్ ను కొట్టడం జరిగిందని తన దష్టికి వచ్చిందన్నారు .ఆందోళన చేసేవారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు .చిలికిచిలికి గాలివానగా మారి అనుకోని సంఘటనలు ఎదురైతే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్నారు.
ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ పమేలా సత్పతి తో , రాచకొండ కమీషనరేట్ మహేశ్ భగవత్ తో మాట్లాడినట్టు తెలిపారు.దళితుల భూ సమస్య అని రాజకీయ కోణంలో తీసుకువెళ్లేందుకు కుట్రలు జరుగుతున్నాయని తనకు తెలుస్తుందని చెప్పారు .ఆలేరు మున్సిపల్ ఆలేరు పురపాలక సంఘం చైర్మెన్ వసుపరి శంకరయ్య ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గ్యాద పాక నాగరాజులపై మరికొందరి పైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆలేరు కొలనుపాకలో మొత్తం 11 సర్వే నెంబర్లపై 131 ఎకరాల పై విచారణ జరిపిస్తామన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్, వైస్ చైర్మెన్ జి నాగరాజు, గ్రంథాలయాల డైరక్టర్ ఆడెపు బాల స్వామి , టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, పుట్ట మల్లేశం, మునిసిపల్ కోఆప్షన్ సభ్యులు రియాజ్, సీసా రాజేష్ ,టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.