Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
- జిల్లా దవాఖానలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాట్లు
- మలేరియా, డెంగ్యూ, డయేరియా పరీక్షలకు సన్నద్ధం
- అందుబాటులో పరికరాలు, కావాల్సినన్ని మందులు
- ఒకేలా కరోనా, సీజనల్ వ్యాధుల లక్షణాలు
నవతెలంగాణ -నల్లగొండ
ఓ వైపు కరోనా తగ్గుముఖం పడుతున్నా.. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా లక్షణాలు, సీజనల్ వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉండడంతో ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు వ్యాధులు విస్తరించకుండా చర్యలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు, టీకాలు వేసే ప్రక్రియలో నిమగమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు సంయుక్త కార్యాచరణ రూపొందించింది. అవసరమైన చికిత్స అందించడం, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకునేందుకు వైద్య,ఆరోగ్యశాఖ, దోమలు వద్ధి చెందకుండా, ఫాగింగ్, యాంటీ లార్వా, డ్రైడే వంటి చర్యలు చేపట్టేందుకు అధికారులు తాగునీరు కలుషితం కాకుండా చూసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్‌తోపాటు డెంగీ, మలేరియా, డయేరియా వంటివి ప్రబలడం సహజం. వీటిని ప్రతి సంవత్సరం ఆరోగ్యశాఖ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది.
జ్వరాలు రాకుండా అప్రమత్తం..
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా వైరస్ పూర్తిగా ప్రజల నుంచి వీడిపోలేదు. మహమ్మారికి తోడు సీజనల్ వ్యాధులు తోడవనుండడంతో కొవిడ్ వైరస్, ఇటు సీజనల్ వ్యాధులు ఓవర్‌ల్యాప్స్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా వర్షాకాలంలో దోమల కారణంగా డెంగీ జ్వరాలు అధికంగా వస్తాయి. రోగులకు వచ్చిన జ్వరం కరోనాదా లేదా సీజనల్తో వచ్చిందా తెలుసుకోవడం అంత సులువుకాదంటున్నారు వైద్యులు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
బస్తీ స్థాయిలోనే అరికట్టేందుకు ప్రణాళిక..
సీజనల్, కరోనా లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. మూడు రోజుల్లో జ్వరం, జలుబు, దగ్గు వంటివి తగ్గకుంటే కరోనా పరీక్షలు జరిపిస్తాం. సీజనల్ వ్యాధులకు సంబంధించి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, డయేరియా నిర్ధారణ పరీక్షలను బస్తీ దవాఖానలు, పీహెచ్సీ, యూపీహెచ్‌సీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. సీజనల్ వ్యాధులను దాదాపు బస్తీ దవాఖానల స్థాయిలోనే నివారించేలా చర్యలు తీసుకుంటున్నారు.
మూడురోజుల్లో తగ్గకపోతే...
సీజనల్‌గా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారికి స్థానిక ఆరోగ్య కేంద్రాల్లోనే పరీక్షలు చేసి మందులు అందజేయనున్నారు. అంతేకాకుండా రోగికి మూడు నుంచి ఐదురోజుల్లో లక్షణాలు తగ్గకపోతే వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొన్ని ప్రధాన లక్షణాలు, రోగి ట్రావెల్ హిస్టరీ, కాంటాక్ట్ హిస్టరీ తదితరాంశాల ఆధారంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరపనున్నట్లు తెలిపాయి. సీజనల్ వ్యాధుల చికిత్స కోసం ప్రైవేట్లకు వెళ్లకుండా స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనే మందులు సిద్ధంగా ఉంచారు.
కరోనా సేవలు కొనసాగిస్తూనే సీజనల్‌కు సిద్ధం....డీఎంహెచ్‌వో కొండలరావు
కరోనా నిర్ధారణ పరీక్షలు, టీకాతోపాటు రోగులకు కరోనా కిట్లు పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు కరోనాతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలితే విధి నిర్వహణ కత్తిమీద సామువంటిదే. కరోనా తొలిదశలో సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఇప్పుడు కూడా మెరుగైన సేవలు అందిస్తాం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, ఐవీ ఫ్ల్యూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం. అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. కరోనా సమయం కావడంతో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.