Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వాన ముసురుతో నల్లబడిన పత్తి మొక్కలు
-పంట దిగుబడిపై ప్రభావం
-ప్రభుత్వం ఆదుకోవాలంటున్న పత్తి రైతులు
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో రైతన్నలు ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారు. దీనికి తోడు ప్రకతి వైపరీత్యాలతో కురుస్తున్న వర్షాలకు రైతన్న బతుకు కుదేలవుతుంది. పది రోజుల నుంచి కురుస్తున్న ముసురు వర్షాలతో రైతులు వేసిన పత్తి పంట తీవ్రంగా నష్టపోయింది.
మండలంలోని ఆరెగూడెం, కాట్రేవు, చింతలగూడెం గ్రామాలతోపాటు పలు గ్రామాల్లో రైతులు వేసిన పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. విడవని ముసురుతో భూములన్ని నీళ్లతో నిండిపోయిఉన్నాయి. నెల రోజుల నుండి భూముల్లో పత్తి గింజలు వేసిన రైతులకు వాన ముసురు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. మొలకెత్తిన పత్తిమొలకలు వరుసగా కురుస్తున్న వర్షాలతో నల్లబారిపోయాయి. వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. వరుసగా కురిసిన వర్షాల ప్రభావం పత్తి పంట దిగుబడి పై ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 2000 ఎకరాల పైగా పత్తి పంట నష్టపోయినట్టు ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. మొలకెత్తిన పత్తి మొక్కలను బతికించుకుందామని ఆశతో ఉన్న రైతులకు విడువని ముసురు వాన కన్నీరుని మిగిల్చుతుంది. వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
-వర్షాలతో పత్తి మొక్కలు నల్లబడిపోయినాయి
ఎన్నపల్లి ముత్తిరెడ్డి రైతు, ఆరెగూడెం
నెల రోజుల కిందట పత్తి విత్తనాలు వేశాను. మొలకెత్తాయి. ఈ సమయంలోనే వరుసగా పది రోజుల నుండి ముసురువాన కురిసి భూమి జల పట్టిపోయింది. దీంతోని మొలకెత్తిన పత్తి మొక్కలు నల్లవడిపోయినాయి. ఇంకా మొక్కలు బతికే అవకాశం లేదు. మళ్లీ విత్తనాలు వేయాలి. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ వానల వల్ల ఆర్థికంగా నష్టపోయాము. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.