Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరి రూరల్
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ద్వారా 29 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. రెవిన్యూ శాఖ 24, జిల్లా పంచాయితీ అధికారి 3, పోలీసు శాఖ, భువనగిరి మున్సిపల్ శాఖ ఒక్కొక్కటి చొప్పున మొత్తం 29 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఒక వేళ జిల్లా అధికారి హాజరు కాలేని పరిస్థితి ఉంటే బాధ్యత కలిగిన తదుపరి అధికారులు హాజరు కావాలని, ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణిలో కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ విజయ కుమారి కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలని వినతి
జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకుప్రయివేటు విద్యాసంస్థలలో ఉచిత విద్య అవకాశం కల్పించాలని కోరుతూ కలెక్టర్ పమేలా సత్పతికి టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ కౌన్సిల్ నెంబర్ యంబ.నరసింహులు, టీయుడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి వెలిమినేటి జహంగీర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరాఠీ రవి, జిల్లా ఉపాధ్యక్షుడు బోనగిరి మల్లేశం, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.