Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల పక్షాన నిలిచిన నాయకుడు ప్రకాశంశర్మ
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-మోత్కూర్
కమ్యూనిస్టు పార్టీ ప్రశ్నించేతత్వం నేర్పుతుందని, ప్రభుత్వాలను, పాలకులను ప్రశ్నించడం ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో ఆ పార్టీ గ్రామశాఖ కార్యదర్శి మాండ్ర చంద్రయ్య అధ్యక్షతన ఆ పార్టీ సీనియర్ నాయకులు మోత్కూర్ ప్రకాశంశర్మ 6వ వర్థంతి సభ నిర్వహించారు. ఆయన స్మారక స్థూపం వద్ద, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో లౌకిక వాదాన్ని దెబ్బతీస్తుందని, ప్రభుత్వ విదాలాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ అణిచివేయాలని చూస్తుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరచి మత రాజకీయాలను ప్రోచహిస్తుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు మార్చు కొకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.5వేలు ఇస్తానన్న మోడీ హామీని విస్మరించారన్నారు. ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీ ల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆదాయం ఎందుకు పెరగడం లేదని, అదానీ ఆదాయం మాత్రం లక్షల కోట్లు పెరిగి ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యారని, పాలకుల దోపిడీ పై ప్రజలు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. పీడిత ప్రజల పక్షాన పోరాడిన నాయకుడు ప్రకాశంశర్మ అని,
నిత్యం ఆయన ప్రజల్లో ఉండి ఇటు సమస్యలపై పోరాడుతూనే పార్టీ బలోపేతం కోసం ఎనలేని కషి చేశారని కొనియాడారు. ప్రకాశంశర్మ స్ఫూర్తితో నేటి యువత ప్రభుత్వ విధానాలపై పోరాదాలని కోరారు. పార్టీ జిల్లా కమిటీకి రూ.5వేలు, మండల కమిటీకి రూ.5 వేల విరాళాన్ని ప్రకాశంశర్మ కుటుంబం తరపున రిటైర్డు ప్రిన్సిపాల్, సీపీఎం సీనియర్ నాయకులు మోత్కూర్ నరహరిశాస్త్రి అందజేశారు. ఈ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, రాచకొండ రాములమ్మ, గడ్డం వెంకటేశం, మోత్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండలాల కార్యదర్శులు గుండు వెంకటనర్సు, మద్దేపురం రాజు, వేముల భిక్షపతి, బుర్రు అనిల్ కుమార్, పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు, దడిపల్లి ప్రభాకర్, పైళ్ల యాదిరెడ్డి, చింతల కష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.