Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల సొంత పనులకే వాడుకుంటున్న వైనం
- పే స్కెల్‌పై పత్తా లేని సీఎం హామీ
- సమస్యలపై 20నుంచి వీఆర్ఏల పోరుబాట
ఊరిలోకి ఏ ప్రభుత్వ అధికారి , ప్రజా ప్రతినిధి వచ్చినా వారికి అక్కడ ఏం కావాలో దగ్గరుండి చూసుకొని ప్రభుత్వ విధులు నిర్వహించేవారు. అంతేగాకుండా ఊరిలోకి ఏ కొత్త వ్యక్తి వచ్చిన అతనికి సంబంధించిన పూర్తి సమాచారం గ్రామ పంచాయతీకి తెలియజేసే వ్యక్తి అతను. ఊరికంటే ముందే నిద్రలేవాలే... అందరు పడుకున్న తర్వాత నిద్రపోవాలే. అలాంటి నిత్య సేవకుడు మన గ్రామ వీఆర్ఏ. ఒకపుడు షేక్సింద్... ఆ తర్వాత మస్కూరి... ఇపుడు వీఆర్ఏగా పిలవబడుతున్నారు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగి కానీ ఏనాడు వారికి ఆ గుర్తింపు ఇవ్వలేదు...వారందర్ని అధికారులు తమ సొంత పనులకు వాడుకుంటూ బానిసలు కంటే హీనంగా చూస్తున్నారనే ఆవేదన వీఆర్ఏలలో ఉంది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (విఆర్ఏ)లు సుమారు 1800మంది పనిచేస్తున్నారు. అందులో నల్లగొండ 700, యాదాద్రి భువనగిరి 480, సూర్యపేట జిల్లాలో 620మంది వీఆర్ఏలు ఉన్నారు. వీరందరు గ్రామాల్లో రెవెన్యూ విధుల నిర్వహణలో అసిస్టెంట్లుగా విధులు నిర్వహించాలి. వీరికి ప్రభుత్వం కేవలం రూ.10,500వేతనం మాత్రమే అందజేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్నారు. సమగ్ర కుటుంబసర్వే నుంచి నేటి దళిత బందు వరకు అనేక ప్రభుత్వ సర్వేలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు.
సంబంధంలేని పనులకు వాడుకుంటూ..
వీఆర్ఏలను అటెండర్ , నైట్‌వాచ్‌మెన్, స్వీపర్, డ్రైవర్, సెక్షన్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్‌గా వాడుకోవడంతోపాటుగా అధికారులు తమ వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నారు. వారసత్వం నుంచి వచ్చినా, ప్రభుత్వ పోటీ పరీక్ష ద్వారా వచ్చినప్పటికి ఇపుడు విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలు ఉన్నత విద్యావంతులుగా ఉన్నారు. కనీసం వారికి ఏ పనులు చెప్పాలో.. ఏవి చెప్పకూడదో కనీసం అవగహన లేకుండా వారికి ఇష్టానుసారంగా సొంత పనులు చేయించుకుంటున్నట్లు తెలుస్తుంది. అందుకే విధి నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం చేస్తున్న విధుల నుంచి విఆర్లను తప్పించి వారందరికి జాబ్‌చార్ట్ నిర్ణయించి విధులు నిర్వహించేలా చూడాలని విఆర్ఏల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పే స్కేల్‌పై పత్తాలేని సీఎం హామీ..
వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా ఐక్యకార్యచరణ కమిటిగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లను నేరవేర్చాలని కోరుతున్నారు. 2017 సంవత్సరంలో సిఐటీయూ పోరాట ఫలితంగా ఫిబ్రవరి 24న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ విఆర్ఏలను రెగ్యులర్ చేస్తామని ప్రకటించారు. అంతేగాకుండా 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న సందర్బంలో విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ నేటివరకు ఒక్క హామీ కూడ నేరవేరలేదు. సుమారు 22నెలలుగా ఆశతో ఏదురుచూస్తున్న వారికి నిరాశ మిగిలింది. ఇదిలా ఉంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న విఆర్ఏలకు ప్రభుత్వ వేతనంపైనే 30శాతం పిఆర్సీ పెంచి నేటికి జీవోను విడుదల చేయకుండా సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. మొత్తం రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తూ డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించింది.
-విఆర్ఏల పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలి.
- అర్హత కలిగిన విఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలి
- 55ఏళ్లు నిండిన విఆర్ఏల స్థానంలో వారసులకు విఆర్ఏ ఉద్యోగం కల్పించాలి.
- మరణించిన విఆర్ఏల కుటుంబాలకు కారుణ్య నియమాకాలు చేపట్టాలి.
20 నుంచి విఆర్ఏల ఉద్యమ బాట...
రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రాలు అందజేశారు. కానీ ఏనాడు కూడ ప్రభుత్వం వారి సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేసింది. అందుకే రిక్రూట్మెంట్ విఆర్ఏల సంఘం, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘంతో పాటుగా ఇతర సంఘాలు కలిసి ఐక్యంగా విఆర్ఏల ఐక్యకార్యచరణ కమిటి ఆధ్వర్యంలో తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టింది. జులై 19వరకు పరిష్కరించకపోతే జులై 20,21,22 తేదిలలో జిల్లా కలెక్టరేట్ ముందు రిలే దీక్షలు చేపట్టనున్నారు. 23న కలెక్టరేట్‌ను ముట్టడించనున్నారు. 25 నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వానికి, అధికారులకు సమ్మె నోటీస్ అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా విఆర్ఏలను ఉద్యమానికి సిద్దం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారిగా సభలు, సదస్సులు ఏర్పాటు చేశారు.
డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం చేస్తాం
గంటెకంపు శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి, వవీఆర్ఏ ఐకాస నల్లగొండ.ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అనేక దఫాలుగా మా డిమాండ్లను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశాం. సీఎం కేసిఆర్ కూడ అసేంబ్లీ సాక్షిగా స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. కానీ నేటికి హామీలు ఆచరణలో పెట్టలేదు. అందుకే ఉద్యమం చేస్తున్నాం.