Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి.రమణ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
నందనంలో నీరా, తాటి ఉత్సత్తుల పరిశ్రమ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి.రమణ అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని దానికి రూ.8 కోట్లు ప్రభుత్వం కేటాయించగా ఆయన రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజుగౌడ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఇటీవల కొంత నిర్మాణ పనులు కూడా జరిగాయన్నారు. ప్రస్తుతం ఈ పనులు నిలిపివేయడంతో ఈ ప్రాజెక్టు ఇంకా ఎక్కడికైనా తరలి వెళుతుందేమోనని స్థానిక ప్రజలు, గీత కార్మికులు ఆందోళన పడుతున్నారని తెలిపారు. వెంటనే పనులు వేగవంతం చేయాలని కోరారు.30ఏండ్ల క్రితం ఇక్కడ తాటి ఉత్పత్తుల పరిశ్రమ కోసం టాడి కార్పొరేషన్ ద్వారా 5 ఎకరాల భూమి తీసుకున్నట్టు తెలిపారు. పక్కనే ప్రభుత్వ భూమి మరో రెండున్నర ఎకరాలు ఉందన్నారు.. చుట్టుపక్కలో వేలాది తాటి ఈత వనం ఉందన్నారు. ఇది రాష్ట్రంలోనే మంచి అనుకూలమైన ప్రదేశమన్నారు. ఇక్కడ నీరా,తాటి ఉత్పత్తుల పరిశ్రమ నెలకొల్పినట్టయితే గీత కార్మికులకు ఉపాధి కలగ డంతోపాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నీరా కేఫ్ కి నీరా అందించవచ్చన్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన దానిని పునరుద్ధరించడంతో ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని కల్లు గీత కార్మికులు ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించే అవకాశముందని, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నందనం సందర్శించి వెంటనే ఆ పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాగి కిష్టయ్య గౌడ్, బోలగాని జయరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి వెంకట నరసయ్య, మేకపోతుల కష్ణ గౌడ్, స్థానిక సొసైటీ అధ్యక్షులు బొడిగే బాలరాజు గౌడ్, సభ్యులు మట్ట రాములు, వట్టిపల్లి శివకుమార్ పాల్గొన్నారు.