Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి. రమణ
నవతెలంగాణ -చౌటుప్పల్ రూరల్
రాష్ట్రంలో గీత పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో తాటి ,ఈత వనంను నాటాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి.రమణ కోరారు. మంగళవారం చౌటుప్పల్ మండలం జై కేసారం, నేలపట్ల, పంతంగి గ్రామాల్లో గీత పారిశ్రామిక సహకార సంఘాలకు కేటాయించిన ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 439 గీత పారిశ్రామిక సహకార సంఘాలకు తాటి,ఈత చెట్ల పెంపకం కోసం 2004లో టాడి కార్పొరేషన్ ద్వారా రుణం అందించి,1888 ఎకరాలు కొనుగోలు చేసి సహకార సంఘాలకు ఇచ్చిందన్నారు. ఈ భూములను కొంతమంది ఆక్రమణకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఈ భూముల్లో హరితహారం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈత, ఖర్జూర, జీనుగు లాంటి అధిక దిగుబడినిచ్చే చెట్లను నాటాలని కోరారు. భూములు ఆక్రమణకు గురి కాకుండా చుట్టు ఫెన్సింగ్ వేసి కాపాడాలని డిమాండ్ చేశారు. జై కేసారం గ్రామంలో 14 ఎకరాలు, పంతంగిలో 5 ఎకరాలు, నేలపట్లలో నాలుగున్నర ఎకరాలు భూమిని కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు. జై కేసారంలో భూమి ఇప్పుడు పడావుగా ఉందని వివరించారు. నేలపట్లలో కొంత భూమి ఆక్రమణకు గురవుతున్నట్లు తమ దష్టికి వచ్చిందన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కార్పొరేషన్ భూములు అన్యాక్రాంతం కాకుండా నిలువరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాగిరు కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట నరసయ్య, మేకపోతుల కష్ణ, జై కేసారం సొసైటీ అధ్యక్షులు పల్లె మల్లయ్య, ముద్దసాని శంకరయ్య, పొట్ట శ్రీనివాస్, లగ్గోని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.