Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్తీ దవాఖానాల పేరుతో ఎంపిక
- ఒక్కొక్క పోస్టుకు రూ.3లక్షలు
ఆ శాఖలో ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడం అధికారులు సిబ్బందికి అలవాటుగా మారింది. తన వాళ్లుగా భావించిన వాళ్లకు పని జరగాలంటే అవకాశాలను వెతుక్కొని పనిచేసి పెడతారు. అలాగని ఉచితంగా చేయరు సుమా.. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి చక్కపెడతారు..ఆ సమయంలో ఎలాంటి నిబంధనలు అడ్డురావు. ఇదేంటని ఎవరైనా అడిగితే మాకేం తెలియదు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేశామంటూ చేతులెత్తేస్తారు..ఈ పరిస్థితి ఎక్కడో కాదు జిల్లా వైద్యఆరోగ్యశాఖలో జరుగుతున్నట్టు తెలుస్తోంది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా వైద్యఆరోగ్యశాఖలో అధికారులు జూన్ చివరి వారం నుంచి ఈనెల మొదటి వారం వరకు దాదాపు నాలుగు జీఎన్ఎం పోస్టులను భర్తీ చేశారని తెలిసింది. అందులో ఒకటి మేల్ జీఎన్ఎం, మిగతా మూడు ఫిమేల్ జీఎన్ఎం పోస్టులున్నాయి.ప్రస్తుతం వీరిలో ఒకరు నల్లగొండ మున్సిపాలిటి పరిధిలోని మాన్యంచెల్క, మరోకరు కాన్సర్ వార్డులో, ఇంకొకరు లైన్వాడ పీిహెచ్సీలో , మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రిలో ఇంకొకరు పనిచేస్తున్నారు. వీరిని రెగ్యులర్ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ నియమాకాలకు సంబందించిన ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే జరిగింది. తమకు అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేసినందున ఎలాంటి నిబంధనలు పనిచేయనే విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.
బస్తీదవాఖానాల నియామాకాల పేరుతో ..?
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎంపిక చేసిన ఉద్యోగులను బస్తీ దవాఖానాలో వైద్య సేవలందించేందుకు ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడ కూడ ప్రత్యేకంగా బస్తీదవాఖానాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం లేదు. ఈ దవాఖానాలు ఆగస్టు నెలలో మంజూరయ్యే అవకాశం ఉందని, వాటిని కేశరాజుపల్లి, మర్రిగూడ, మిర్యాలగూడలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మంజూరు కాకముందే ఉద్యోగులను నియమించడంలో అధికారులు అత్యుత్సాహం చూపించారు. ప్రస్తుతం మాన్యం చెల్కలో పనిచేసే నర్స్ రాబోయే రోజుల్లో కేశరాజుపల్లిలో రానున్న బస్తీ దవాఖానాలో, లైన్వాడ పిహెచ్సీలో పనిచేసే ఉద్యోగి మర్రిగూడలో వచ్చే అవకాశం ఉన్న బస్తీ దవాఖానాకు , మిర్యాలగూడ ప్రభుత్వ హస్పిటల్లో ప్రస్తుతం పనిచేసే ఉద్యోగి అదే పట్టణంలో మంజూరయ్యే బస్తీదవాఖానాలో పనిచేయించేందుకు ఎంపిక చేశారు. అవి వచ్చే వరకు ప్రస్తుతం అక్కడక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
ఒక్కొక్క పోస్టుకు రూ.3లక్షలు...?
ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే నాలుగు పోస్టులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భర్తీ చేశారు. ఆ నాలుగు పోస్టులకు గాను ముగ్గురికి సుమారు రూ.3లక్షలు, మరోకరికి రూ.3.50లక్షలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా నాలుగు పోస్టులకు కలిపి రూ.12.50లక్షలు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం.
సొమ్ము మొత్తం సంబంధిత శాఖలో పనిచేసే జిల్లా స్థాయి అధికారికి బంధువైన ఓ మహిళ సిబ్బంది ద్వారా డబ్బులు మొత్తం ముట్టజెప్పినట్లుగా తెలుస్తుంది. గతంలో ఇతరుల ద్వారా చేతులు మారడం ద్వారా పెద్దఎత్తున ప్రచారం జరిగిందని భావించిన అధికారులు ఇపుడు రూటు మార్చినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎంపిక వారందరి కూడా ఇప్పటికే వైద్యశాఖలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బందికి దగ్గరి బంధువులు, స్నేహితులు కావడం వల్ల అధికారులు వీరికి అవకాశం ఇచ్చినట్టు తెలిసింది.