Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులపై దమనకాండ
- రైతు కుటుంబాలను పరామర్శించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
ఎపిటోమ్ రియల్టర్ల మోజులో మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామ రైతులపై పోలీసులు దమనకాండ చేశారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి గ్రామ రైతు కుటుంబాలను ఆ పార్టీ నాయకులు సందర్శించి, పరామర్శించారు. అనంతరం ఎపిటోమ్ ఆక్రమించుకుని ధ్వంసంచేసిన రైతుల పంట భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడారు. రైతుల పంట భూములను ఎపిటోమ్ రియల్టర్లు దౌర్జన్యంగా ఆక్రమించుకొని బుల్డోజర్లతో పంటలను ధ్వంసంచేయడం దుర్మార్గమన్నారు. ఏడు రోజుల క్రితం ఎపిటోమ్ బౌన్సర్లు రైతులపై తుపాకులు మర్లబెట్టి కొట్టి, చిత్రహింసలకు గురిచేసి సంఘవిద్రోహ శక్తులుగా వ్యవహరించారన్నారు. పోలీసులు రైతులను రాత్రికి రాత్రే అరెస్టుచేసి కోర్టుకు తీసుకువెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టి జైలుకు పంపడం హేయమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా రాజ్యాంగాన్ని ఎపిటోమ్ యాజమాన్యం వాడుకొని రైతులపై అక్రమంగా కేసులు పెట్టి రాత్రికిరాత్రే జైలుకు పంపించిన ఘనత ఎపిటోం రియల్టర్లకు దక్కిందన్నారు. స్థానిక ఆర్డీఓ రైతుల భూమి ఉన్నదని రియల్టర్లకు తెలిపినా పెడచెవిన పెట్టారని, రైతుల భూమి, నక్షబాట, ప్రభుత్వానికి సంబంధించిన గుట్టలను స్వాధీనపర్చుకున్నారన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి, రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. రైతు కుటుంబాలకు సీపీఐ(ఎం) ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, బూర్గు కష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాస్‌చారి, మున్సిపల్, మండలకార్యదర్శులు బండారు నర్సింహా, గంగదేవి సైదులు, నాయకులు చెన్నబోయిన వెంకటేశం, చీకూరి ఈదయ్య, ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, కొండె శ్రీశైలం, ఎమ్‌డి.పాషా, సిలివేరు జంగయ్య, మొగుదాల రాములు, ఎర్ర ఊషయ్య, బడేటి చంద్రయ్య, మంద బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.