Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ శాఖ నీతికి నిజాయితీకి మారుపేరు అంటూ చెపుతుంటారు.. కానీ ఆచరణలో అది ఎంతవరకు అమలవుతుందో అందరికి తెలిసిందే...ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వివిధ రకాలుగా భయబ్రాంతులకు గురిచేసి తమకు కావాల్సిన వాటిని తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. ఇదెక్కొడో అనుకుంటే పొరపాటే... జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసు అధికారుల వ్యవహారం...
- డీజిల్ బలవంతంగా పోయించుకోవడమేంటి?
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
అధికారాన్ని అడ్డంపెట్టుకుని పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం శ్రమ చేసుకుని వెళ్లే కార్మికులపై పోలీసులు జులుం చూపించి మరీ ఇబ్బంది పెడుతున్నారని రోడ్డు పనులలో పనిచేస్తున్నా కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఈ మధ్య పట్టణంలో అభివృద్ధి పనులలో భాగంగా రోడ్ల వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దానికోసం యంత్రాలు రాత్రి, పగలు అనే తేడా లేకుండా నడుస్తున్నాయి. పని పూర్తయిన తర్వాత యంత్రాలపై పనిచేసే కార్మికులు ఎన్జీ కాలేజీ మైదానంలో వాహనాలు పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయితే పోలీసులు తమ వాహనంలో డీిజిల్ అయినపుడల్లా ఎన్జీ కాలేజీ మైదానంలో ఉన్న యంత్రాల వద్దకు వెళ్లి డీిజిల్ పోస్తారా లేదా అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే గత నాలుగు రోజుల క్రితం పట్టణానికి చెందిన ఓ పోలీస్ స్టేషన్కు సంబందించిన పోలీసులు తమ అధికారి పోలీసు వాహనానికి డీిజిల్ పోయమంటున్నారు. లేకపోతే ఇబ్బందవుతుందని వారిని బెదిరింపులకు గురిచేశారు. దాంతో కొంత భయంగానే ఆ యంత్రాలకు సంబందించిన కార్మికులు వెంటనే తమ వాహనాల కోసం తీసుకువచ్చిన డీిజిల్ను సుమారు 30లీటర్లు పోలీసు వాహనంలో పోశారు. ఆ పోలీసులకు ఇదేం కొత్త కూడా కాదు సుమా.. ఈనెలలోనే సుమారు నాలుగు సందర్బాలలో ఒకసారి 50లీటర్లు, మరోసారి 30లీటర్లు ఇలా మొత్తంగా 150లీటర్ల డీిజిల్ వరకు వారి వద్దను పోలీసులు తీసుకున్నట్లు సమాచారం.
పోలీసు వాహనం తిరగడానికి అవసరమయ్యే డీజిల్ కోసం ప్రభుత్వం బడ్జెట్ వస్తుంది. కానీ ఆ సొమ్మును తమ సొంత అవసరాలకు వాడుకుని ఇతరుల ద్వారా వచ్చే ఆదాయంతో ఇలా కాలం వెళ్లదీస్తున్నారని తెలుస్తుంది. పోలీసులు ఇతరుల సొమ్మును అప్పనంగా లాగేసుకునే ప్రయత్నం చేసిన సంఘటనలు అనేక ఉన్నాయి. అవి కొన్ని బహిర్గతం కాగా.. మరికొన్ని కాలేదు. కానీ ఇలాంటి వాటిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి కట్టడి చేయకపోతే రక్షక భటులపై ఉన్న కాస్త నమ్మకం పూర్తిగా సడలిపోయే ప్రమాదం కూడా ఉంది.