Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్ల కింద మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం
- నల్లగొండ జిల్లాలో 10, యాదాద్రిలో ఆరు స్కూళ్లలో చేరిన విద్యార్థులు
నవతెలంగాణ- నల్లగొండ
పీఏపల్లి మండలంలో విద్యార్థుల్లేక పదేండ్ల కింద మూతబడిన వడ్డెరగూడెం ప్రాథమిక పాఠశాల ఈ విద్యా సంవత్సరం తిరిగి తెరుచుకున్నది. ప్రస్తుతమిక్కడ 25 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు.త్రిపురారం మండలంలోని రాగడప ప్రైమరీ స్కూల్ ఐదేండ్లకు రీ ఓపెన్ అయ్యింది. 13 మంది విద్యార్థులతో సందడిగా కనిపిస్తున్నది.
ఇలా ఈ విద్యా సంవత్సరం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 16 ప్రభుత్వ పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. దీంతో ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం పిల్లలను ప్రయివేటు బాట పట్టించిన తల్లిదండ్రులకు ఫీజుల భారం, నిత్యం పది కిలోమీటర్లు ప్రయాణించిన విద్యార్థులకు దూరభారం తప్పింది. ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతం కోసం రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యలు కలిసివచ్చాయి. 317 జీఓతో మూతబడిన పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించడం, మన ఊరు -మన బడితో వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పు కనిపిస్తున్నది. బడిబాట ద్వారా ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం వల్ల అడ్మిషన్లు మొదలై, ఏండ్ల తరబడి మూతబడిన పాఠశాలలు సైతం తిరిగి తెరుచుకుంటున్నాయి.
జిల్లాలు, జోనల్ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 317తో మారుమూల ప్రాంతాలు, తండాల్లోని సర్కారు బడులకు టీచర్లను కేటాయించారు. ఈ జీఓతో నల్లగొండ జిల్లాలో పిల్లలు లేక మూతబడిన 46 పాఠశాలలకు ఉపాధ్యాయులు వచ్చారు. టీచర్లు రావడంతోపాటు ప్రయివేటు స్కూళ్లలో ఫీజుల భారంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. దాంతో గతేడాది వరకు వెలవెలబోయిన ఆయా పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.
రెండేండ్లకు తెరుచుకున్న బడి
మన ఊరు మన బడి, బడి బాట కార్యక్రమాలతో సర్కారు బడులకు పూర్వ వైభవం వస్తున్నది. విద్యార్థులు చేరుతుండడంతో మూతబడిన స్కూళ్లు సైతం తెరుచుకుంటున్నాయి. చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పద్మానగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలను 2000లో ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గడంతో రెండేండ్ల కింద ఆ బడిని మూసివేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయురాలు ఎస్.రాధిక స్థానికుల సహాయంతో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు అడ్మిషన్లు తీసుకోగా మరో 13 మంది చేరేందుకు సిద్ధమయ్యారు.
పున:ప్రారంభమైన బాసోనిబావి తండా పాఠశాల..
ఈ సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో మూడేండ్ల క్రితం మూతబడ్డ పెద్దవూర మండలంలోని బాసోనిబావి తండా ప్రాథమిక పాఠశాల పున:ప్రారంభమైంది. 2019లో విద్యార్థుల్లేక మూతబడిన ఈ బడిలో ఈ ఏడాది 15 మంది జాయిన్ అయ్యారు. విద్యార్థులు పాఠశాలకు హాహాజరవుతున్నారు.
రాగడప పాఠశాలలో 23 అడ్మిషన్లు ఐదేండ్ల తర్వాత పునఃప్రారంభం..
త్రిపురారం మండలంలోని రాగడప గ్రామంలో రెండు ప్రైవేటు స్కూళ్ల కారణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపడానికి పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. దీంతో విద్యార్థుల్లేక 2017లో సర్కారు బడిని మూసేశారు. ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమంలో ఈ నెల 5నుంచి ఉపాధ్యాయులు గడప గడపకూ తిరిగి ఇంగ్లీష్ విద్యా బోధన, అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. దీంతో సర్కారు బడిలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంఈఓ బాలాజీనాయక్, స్పెషల్ ఆఫీసర్ వీరయ్య ఈ నెల 14న 20 మంది విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలను పున:ప్రారంభించారు.
అందరికీ నాణ్యమైన విద్యకు చర్యలు.. డీఈవో భిక్షపతి
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల్లేక మూతబడిన 46 పాఠశాలకు సైతం జీఓ 317 ద్వారా వచ్చిన ఉపాధ్యా యులను కేటాయించాం. మూతబడిన బడుల్లో పిల్లలను చేర్పించి కచ్చితంగా తిరిగి తెరిచేలా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ సూచనలతో ఆయా మండలాల ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. మరో వైపు మన ఊరు -మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంతో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి తెచ్చింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తుండడం సంతోషంగా ఉంది. ప్రత్యేక శ్రద్ధతో విద్యనందించి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తాం.