Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి
- జీవోల సవరణకై ఆగస్టు 3న చలో హైదరాబాద్ పోస్టరావిష్కరణ
నవతెలంగాణ-నల్లగొండ
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 నిర్ణయించాలని, హమాలీ, ట్రాన్స్‌పోర్టు కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 3న చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ ముద్రించిన చలో హైదరాబాద్ పోస్టర్‌ను దొడ్డి కొమరయ్య భవన్లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.హమాలీ, ట్రాన్స్‌పోర్టు కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం అందకుండా ఇబ్బందులు పడుతున్న వీరికి పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కనీస వేతనాల పెంపుపై ఐదురంగాలకు ఇచ్చిన ఫైనల్ నోటిఫికేషన్‌కు గెజిట్ ఇవ్వాలని, 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా ద్విచక్ర వాహనాలు ఇస్తామని ఇచ్చిన హామీ ని అమలు చేయాలని అన్నారు. ఆగస్టు 3 చలో హైదరాబాదుకు భవన నిర్మాణ, హమాలీ, ట్రాన్స్‌పోర్టు 73 షెడ్యూల్ పరిశ్రమల కార్మికులు, పవర్లూమ్, ఇంటి పని వారు, షాపు గుమస్తాలు తదితర కార్మికులంతా వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ,పట్టణ కమిటీ సభ్యులు సలివోజు సైదాచారి,మన్నే శంకర్, పోలగోని మల్లయ్య,నకిరేకంటి సుందరయ్య, మాండ్ర ఐలయ్య పాల్గొన్నారు.