Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
మండలంలోని రేపాల రెవెన్యూ గ్రామాన్ని మండలకేంద్రంగా ఏర్పాటు చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు డిమాండ్ చేశారు.ఆదివారం రేపాల గ్రామంలో రేపాల మండల సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రేపాల,సీతానగరం సర్పంచులు పల్లి రమణావీరారెడ్డి, పుల్లూరి ఉపేందర్ మాట్లాడుతూ రేపాల రెవెన్యూ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని కోరారు.రాష్ట్రంలో మండలాల పునర్విభజన జరిగిన సమయంలోనే రేపాల గ్రామం గ్రామీణ మండలంగా ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.రేపాల పరిసర గ్రామాలు మండలకేంద్రానికి 10 కి.మీ దూరంలో ఉండడం, నేరుగా రవాణావ్యవస్థ లేకపోవడంతో మండలకేంద్రానికి వెళ్ళ లేని పరిస్థితి దాపురించిందన్నారు.దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.రేపాల గ్రామాన్ని మండలకేంద్రంగా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.ఐదు వేల ఎకరాల రెవెన్యూ కలిగి ఉండడంతో పాటు రేపాలలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఉపకేంద్రం,పశువుల ఆస్పత్రి, సబ్స్టేషన్, కెనరాబ్యాంక్,కోఆపరేటివ్ సొసైటీ,రైతువేదిక, మీ సేవాకేంద్రం, ప్రాథమిక,ఉన్నత పాఠశాలు,సాంఘీక సం క్షేమ బాలుర వసతి గహం,శాఖా గ్రంథాలయం వంటి సౌకర్యాలు ఉన్నాయన్నారు. కోదాడ నుండి వయా రేపాల, మోతె వరకు నడిచే ఆర్టీసీ బస్సును కూడా రద్దు చేయడంతో ఈ ప్రాంతప్రజలకష్టాలు అధికమయ్యాయని తెలిపారు.రేపాల రెవెన్యూపరిధిలోని నర్సింహులగూడెం, జగన్నాథపురం, సీతానగరం, తండా, విజయ రాఘవాపురం, కలకోవ, మాధవరం, నేలమర్రి, ఈదులవాగు తండా,మోతె మండలంలో రాఘవాపురం, నామవరం గ్రామ పంచాయతీలను కలిపి నూతన గ్రామీణ మండలంగా రేపాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరుతాయని సూచించారు .అనంతరం రేపాల గ్రామాన్ని గ్రామీణ మండలంగా ఏర్పాటు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.ఈ సమావేశంలో రేపాల,సీ తానగరం సర్పంచులు పల్లి రమణా వీరారెడ్డి, పుల్లూరి ఉపేందర్,వార్డు సభ్యులు బత్తుల నర్సయ్య, టీఆర్ఎస్, కాంగ్రెస్, గ్రామశాఖ అధ్యక్షుడు పల్లి ఆదిరెడ్డి, చెవుల నరేందర్, దేవాలయ చైర్మెన్లు పోనుగోటి రంగా, రావులపెంట వెంకటేశ్వర్లు(ఆర్వీ), గ్రామ ప్రముఖులు గవిని కోటయ్య, మాచర్ల రాములు, గండురామయ్య, గండు స్వామి, పాల్గొన్నారు.