Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి శుక్రవారం గ్రామాల్లో, ప్రతి ఆదివారం మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలి
- రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
- ప్రతి అర్హునికి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అందేలా చర్యలు
- రాష్ట్ర వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్/ భువనగిరిరూరల్
భారీ వర్షాలు వరదల కారణంగా డెంగ్యూ,మలేరియా, అతిసారం వంటి వ్యాధులు వ్యాపించకుండా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్ నుండి సీజనల్ వ్యాధుల నియంత్రణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అంశాల పై సంబంధిత శాఖల మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఇప్పటి వరకు 1610 డెంగ్యూ కేసులు వచ్చాయని తెలిపారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి డెంగ్యూ కేసుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరం ఇప్పటివరకు 260 మలేరియా కేసులు, 1610 డెంగ్యూ కేసులు, 42 చికెన్ గునియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని గ్రామాల్లో, ఆదివారం పట్టణాలలో ఇంటింటికి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లకు సూచించారు. డెంగ్యూ, మలేరియా కేసులను ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని, మందులు, బ్లడ్ ప్లేట్ లెట్స్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు మోడల్ స్కూల్స్‌లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ వసతి గహాలలో నాణ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే వినియోగించాలని, పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, ప్రతివారం రెసిడెన్షియల్ పాఠశాలలో ఫాగింగ్ చేపట్టాలని, కిచెన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.77 కోట్ల మంది ప్రజలకు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అందించాలని, ఇప్పటి వరకు 20 లక్షల మంది ప్రజలకు బూస్టర్ డోస్ వేసామని తెలిపారు. ఆగస్టు 26 నాటికి ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించి 12 నుంచి 17 ఏండ్ల విద్యార్థులకు 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కోసం ప్రజాసంచారం అధికంగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ మార్కెట్లలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, గ్రామాలు మున్సిపాలిటీలో ఇంటింటా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ వేయాలని ఆదేశించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గ్రామాలలో మురుగు కాల్వలను శుభ్రం చేయాలని చేయాలని, మిషన్ భగీరథ ట్యాంకులను శుభ్రం చేయాలని, పైప్ లైన్ లీకేజీలను అరికట్టాలని సూచించారు. స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్లు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ వసతి గహాలను జిల్లా విద్యాశాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారులు వారానికి ఒకసారి తనిఖీ చేయాలని, వసతి గహాల్లో విద్యార్థులతో భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తరచూ వసతి గహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని, వసతి గహాలు, పరిసరాలలో పరిశుభ్రత పాటించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వసతి గహాలలో ఉన్న పాత బియ్యం స్టాక్ స్థానంలో నూతనంగా బియ్యం సరఫరా చేస్తున్నామని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర మహిళ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ 10 20 రోజులగా భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, ప్రతి గిరిజన పాఠశాలకు ఒక అధికారికి బాధ్యత అప్పగించి ప్రతివారం ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైస్ మిల్లుల త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు 2 షిఫ్టులలో బియ్యం బిల్లింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్, జెడ్పీటీసీ ఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, షెడ్యుల్ద్ కులాల అభివద్ధిఅధికారిసల్మా భాను, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్, బీసీ సంక్షేమ అభివద్ధి అధికారిణి పుష్ప లత, ఎంపిడీఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రిభువనగిరి జిల్లా నుండి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి .శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ సీఈవో కష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు, కష్ణ రెడ్డి, ఎస్టిఎస్ సీబీసీ మైనార్టీ వెల్ఫేర్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.