Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నికకు వెళితే ''పంగనామం'' ఖాయమా
- ఉమ్మడి జిల్లాలో బీజేపీకి అంత సీన్ ఉందా.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. తాజా పాలిటిక్స్‌లో ఆయనే పెద్దహాట్ టాఫిక్‌గా మారిపోయారు. మునుగోడులో ఉప ఎన్నిక రాబోతుందన్న ప్రచారానికి ఆజ్యం పోసింది ఆయనే. తాజాగా రాజ్ గోపాల్ రెడ్డి కాషాయ కండువా వేసుకుంటున్నాడనే వార్తలు విస్త్తృత ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించేశాయి. వాస్తవంగా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతారా.. గత రెండేండ్లుగా బీజేపీ కార్యకర్తలను ఊరిస్తూ ఒకవైపు... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అయోమయంలోకి నెట్టేస్తున్న రాజ్‌గోపాల్‌రెడ్డి ఎందుకు ఏ నిర్ణయం తీసుకోవడంలేదు. అయితే నాలుగు రోజుల కిందట కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో జరిగిన బేటిలో కోమటిరెడ్డి ఏం చెప్పాడు.. ఎలాంటి అంశాలను చర్చించారు. ఆ సందర్భమెంటో బీజేపీ పెద్దలు ఆయనకేలాంటి భరోసా కల్పించారనే అంశాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఇపుడు తలపండిన నేత. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రత్యర్థులకు చిత్తు చేయడంలో ఆయన దిట్ట. ఆయనపై పోటికి దిగాలంటే పేరున్న నేతలు, పార్టీలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారనే పేరుంది. ముక్కు సూటిగా మాట్లాడతాడని, స్వపక్షమైనా, విపక్షమైనా...ఎవర్ని లెక్క చేయరు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. సొంత పార్టీ నేతలనే విమర్శించి ఎన్నో సార్లు వార్తల్లో నిలిచారు.కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన ఆయన ఇపుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్తలు గత రెండేళ్లుగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. తిరుపతి దైవదర్శానికి వెళ్లిన చోట కూడా బీజెపీలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటన చేశారు. మరోసారి కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసే శక్తి బీజెపీకే ఉందని, కాంగ్రెస్‌తో సాధ్యం కాదని బహిరంగంగానే మాట్లాడారు. అప్పటి నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పార్టీ మార్పు అంశం పెద్ద కామేడిగా మారిపోయిందని భావిస్తున్నారు. అంతేగాకుండా కేడర్‌లోనూ రాజ్‌గోపాల్ రెడ్డి చులకనయ్యారని అనుచరులు సైతం అంటుంటారు. ఇక తాజాగా రాజ్ గోపాల్ రెడ్డి అమిత్ షా తో భేటీ అయ్యారని...త్వరలో ముహూర్తం చూసుకుని బీజేపీ తీర్థం పుచ్చుకోబుతున్నారని,మునుగోడులో ఉప ఎన్నిక రాబోతుందని మీడియాలో, సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.ఆ ప్రచారంపై రాజ్ గోపాల్ రెడ్డి స్పందించారు కూడా.అయితే తాను అమిత్‌షాతో భేటీ అయిన విషయాన్ని మాత్రం ధ్రువీకరించారు. ఎంతసేపు కేసీఆర్‌కు వ్యతిరేక పార్టీలో తన పోరాటం ఉంటుందని తప్పా....కాంగ్రెస్ లో కొనసాగుతాననో, బీజేపీ లో చేరుతాననో మాత్రం అస్సలు చెప్పడం లేదు. కాకపోతే రాజీనామా చేసే ప్రసక్తే లేదని మాత్రం ఖరాఖండిగా చెప్పేసాడు.కానీ ఆ రాజీనామా అంశమే రాజగోపాల్ రెడ్డికి బ్రేకులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు ఓ అంచనాకొచ్చారని తెలుస్తుంది. రేవంత్ పీసీసీ పీఠమెక్కిన నాటినుంచి పార్టీ కార్యక్రమాలకు రాజ్‌గోపాల్‌రెడ్డి దూరమయ్యాడు. అప్పటి నుంచి ఇంతవరకూ గాంధీ భవన్ మెట్లెక్కలేదు.సోదరుడు వెంకట్ రెడ్డితో కూడా గ్యాప్ పెంచుకున్నాడు. కాంగ్రెస్‌ను వీడాలనే నిర్ణయానికి వచ్చారని నిర్ణయించుకున్నారనే చర్చ జరుగుతుంది. కానీ ఇపుడు వచ్చిన సమస్యల్లా రాజీనామా అంశమే.
ఇప్పటికిప్పుడు పార్టీని వీడితే ఈటల రాజేందర్ మాదిరిగా అధికార పార్టీపై తొడ కొట్టి గెలవాలని ఆయన వ్యూహం కావొచ్చు కానీ..ఏ మాత్రం బీజేపీికి ఉనికి లేని మునుగోడులో ఆలాంటి ప్రయోగం చేస్తే అసలుకే ఎసరు రాబొచ్చని ఆయన భావన. దానికి తోడు ఆయనపై సహజంగా ఉన్న వ్యతిరేకత, బీజేపీపై జీఎస్టీ ఎఫెక్ట్, ఇతర దేశ ఆర్దిక పరిస్థితులు కూడా కారణాలు కావొచ్చు. అసలే ముందస్తు ఎన్నికలన్న మరో ప్రచారం నడుస్తుంది. దాంతో ఇప్పటికిప్పుడు ప్రయోగం చేస్తే....ఫలితాలు తలకిందులైతే రాజ్‌గోపాల్‌రెడ్డి పరువు సంగతి పక్కన పెడితే, రాష్ట్రంలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తామే అని గొంతు చించుకుంటున్న బీజేపీ పరువు కూడా గంగలో కలిసే ప్రమాదముంది. అందుకే కొన్నాళ్లు స్తబ్దుగా ఉండి ఎన్నికల ముందు పార్టీ మారాలనే నిర్ణయంతో రాజ్‌గోపాల్‌రెడ్డి ఉన్నట్టు సమచారం. ఈ అంశమే ప్రధానంగా షా, కోమటిరెడ్డిల మధ్య చర్చ జరిగిందని తెలుస్తుంది. ఉత్తర తెలంగాణ మాదిరిగా దక్షిణ తెలంగాణలో ప్రయోగాలు అంత మంచిది కాదని అమిత్‌షాతో రాజ్‌గోపాల్ చెప్పినట్టు తెలుస్తుంది. అందుకు ఉదాహరణే గతంలో జిల్లాలో జరిగిన హూజుర్‌నగర్, నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నట్టు సమాచారం. అందుకే సమయం కోసం ఏదురుచూసి అడుగులు వేద్దామని తన అభిప్రాయాన్ని అమిత్‌షాకు చెప్పారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే పార్టీకి పెద్దగా పట్టులేని మునుగోడును కాకుండా , బీజెపీకి కొంత పట్టున్న ఎల్బీనగర్ సెగ్మెంట్లో పోటీ చేసేందుకు కూడ హామీ తీసుకున్నారని సమాచారం. ఇక రాజ్ గోపాల్ రెడ్డి ప్రతిపాదనకు అమిత్ షా గ్రీన్ సిగల్ ఇచ్చారని, దాంతో .ఈ అంశాలన్నిటినీ బేరీజ్ చేసుకున్న రాజ్ గోపాల్ రెడ్డి,పార్టీని వీడే విషయంలో గానీ,రాజీనామా చేసే విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చారు. అంతేగాకుండా రాజీనామా అనే సస్పెన్స్‌కు తెరదించేసాడు.మొత్తానికి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పార్టీ మారడం పక్కానే గానీ, అది ఇప్పట్లో కుదిరే పని కాదని తెలుస్తుంది. తాజాగా రాజీనామా భయంతోనే ఆయన వెనకడుగు వేశారని మునుగోడు కోడై కూస్తుంది.మరి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఎప్పుడో..