Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంతో సహా పది టీచర్ పోస్టులు ఖాళీ
- డిప్యూటేషన్ పై జెడ్ఫీకి వెళ్లిన జూనియర్ అసిస్టెంట్
- బిల్లులు చేసేందుకు ఓ టీచర్ పై అదనపు భారం
- 6 నుంచి 10 వరకు 12 సెక్షన్లు..
- 504 మంది విద్యార్థులు
- స్వీపర్, స్కావెంజర్ లేక విద్యార్థులు, టీచర్ల ఇబ్బందులు
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు పెద్దబడి (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల)లో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోనే పెద్దబడిగా గుర్తింపు ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కనుగుణంగా ఉన్న రెగ్యులర్ పోస్టుల్లో కూడా టీచర్లు లేకపోవడంతో విద్యాబోధనకు ఆటంకంగా మారింది. ఆయా సబ్జెక్టు టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా ఉన్న టీచర్లపై అదనపు భారం పడుతోంది. 6 నుంచి 10 తరగతుల వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో 12 సెక్షన్లు, 504 మంది విద్యార్థులు ఉండగా 220 మంది బాలురు, 284 మంది బాలికలు ఉన్నారు. 9వ తరగతిలో146 మంది, 10వ తరగతిలో 112 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచర్లు లేకపోవడంతో 6 నుంచి 8వ తరగతి వరకు ఒక్కో తరగతికి మూడు సెక్షన్లు ఉండగా వాటిని రెండు సెక్షన్లకు కుదించారు. 30 మంది టీచర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 20 మంది మాత్రమే ఉన్నారు. పాఠశాలకు పెద్దదిక్కుగా ఉండే జీహెచ్ఎం పోస్టు ఖాళీగా ఉంది. తెలుగు టీచర్లు ఇద్దరు, ఇంగ్లీష్ ముగ్గురు, మ్యాథ్స్ ఒకరు, సోషల్ ఇద్దరు, సైన్స్ ఒకరు, క్రాఫ్ట్ టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. పేద, మధ్య తరగతి విద్యార్థులే ఎక్కువగా పాఠశాలలో చదువుతున్నందున టీచర్ల కొరతతో విద్యార్థులు చదువులో వెనుకబడే అవకాశముంది. స్వీపర్, స్కావెంజర్, నైట్ వాచ్మెన్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. స్వీపర్ లేక తరగతి గదులు ఊడ్చేవారు లేకపోవడంతో వంతులవారీగా టీచర్లే తరగతి గదులు ఊడ్చుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు స్కావెంజర్ లేకపోవడంతో అవి కంపుకొడుతున్నాయి. వాటిని శుభ్రం చేసేందుకు టీచర్లు తలాకొంత వేసుకుని నెలకు రూ.3 వేల వేతనంతో స్కావెంజర్ ను పెడదామన్నా ఆ కొద్దిపాటి వేతనానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నైట్ వాచ్మెన్ లేకపోవడంతో అల్లరి మూకలు, కొందరు యువకులు పాఠశాలను అడ్డాగా చేసుకుని మంచినీటి నల్లాలు, పైప్ లైన్లు, మరుగుదొడ్లు, కిటికీలు,తలుపులు పగుల కొడుతున్నారు. ఇదివరకు ఒకట్రెండు సార్లు ధ్వంసం చేయడంతో పాఠశాలకు రక్షణ కల్పించాలని టీచర్లు పోలీసులకు, మున్సిపల్ కమిషనర్‌కు విన్నవించారు.
డిప్యూటేషన్ పై జెడ్పీకి వెళ్లిన జూనియర్ అసిస్టెంట్..
పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నిఖత్ భాను డిప్యూటేషన్ పై యాదాద్రి జెడ్పికి వెళ్లారు. దీంతో జూనియర్ అసిస్టెంట్ లేక టీచర్ల సాలరీ బిల్లులు, మధ్యాహ్న భోజన బిల్లులు, పాఠశాల మెయింటనెన్స్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జూనియర్ అసిస్టెంట్ లేకపోవడంతో బిల్లులు చేయడంలో,సకాలంలో బిల్లులు సమర్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉన్న టీచర్లలోనే ఓ టీచర్ బిల్లులు చేసేందుకు సమయం కేటాయించాల్సి వస్తుండటంతో ఆ టీచర్ పై అదనపు భారంతో పాటువిద్యార్థులకు కూడా నష్టం జరుగుతుంది. డీప్యూటేషన్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ ను తిరిగి వెనక్కి పంపాలని, లేనిపక్షంలో ఆ పోస్టులో కొత్త జూనియర్ అసిస్టెంట్ ను నియమించాలని టీచర్లు కోరుతున్నారు.
బోధనకు ఇబ్బంది లేకుండా చూడాలి
పాఠశాలలో కొన్ని సబ్జెక్టులకు టీచర్లు లేరు. దీంతో ఉన్న టీచర్లు అదనపు క్లాసులు తీసుకుంటున్నారు. పేదవర్గాల పిల్లలమే ఎక్కువగా పాఠశాలలో చదువుకుంటున్నాం. చదువులో వెనుకబడకుండా పూర్తిస్థాయిలో టీచర్లను నియమించి బోధనకు ఇబ్బంది లేకుండా చూడాలి.
- అక్షయ, 10వ తరగతి
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
జిల్లాలోనే పెద్దబడి అయిన మోత్కూర్ ఉన్నత పాఠశాలలో 10 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా బోధనకు ఆటంకం ఏర్పడుతుంది.పేద విద్యార్థుల భవిష్యత్ దష్ట్యా ఖాళీ టీచర్ పోస్టులతో పాటు స్వీపర్, స్కావెంజర్, నైట్ వాచ్ మన్ పోస్టులను కూడా భర్తీ చేయాలి.
- బుర్రు అనిల్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు