Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టు వ్యవహారంతో నిలిచిన అభివద్ధి
- ఒక్కొక్కరిగా కేసు ఉపసంహరణ
- సుందరీకరణ ఎప్పటికీ..?
- నరక యాతన పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లా కేంద్రంలో పాత జాతీయ రహదారిని విస్తరింపజేసి గురువారంతో మూడేండ్లు పూర్తి చేసుకుంది. పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి దశాబ్దాల సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి రహదారి విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా 2019లో జులై 28 పాత జాతీయ రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. మూడేండ్లు అయినా పనుల్లో పురోగతి కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సూర్యాపేట పట్టణంలోని పాత జాతీయ రహదారి పై యస్వీ కళాశాల నుండి కోర్టు చౌరస్తా అక్కడ నుండి పోస్ట్ ఆఫీస్, పూల సెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్, ఈశ్వర థియేటర్ వరకు ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తుంది. దీంతో ప్రజలు, వాహనదారులు, పాదచారులు అనేక రకాలుగా నరకయాతన పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు సుందరీకరణ కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి రూ. 25 కోట్లు ప్రకటించి వెనువెంటనే పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగానే స్థానిక కోర్టు నుండి పూల సెంటర్ మీదుగా ఈశ్వర్ థియేటర్ వరకు రోడ్లు, డ్రయినేజీ, డివైడర్స్, ఫుట్ పాత్, విద్యుదీకరణ సెంట్రల్ లైటింగ్, పార్కింగ్,గ్రీనరి తదితర నిర్మాణాల కోసం నిధుల మంజూరులో మొదటి విడతగా 9.40 కోట్లతో ఈ పనులను ప్రారంభించారు. కాగా తమకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు ప్రారంభించాలని బాధితులలో 56 మంది ఆనాడు హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల నివాస ప్రాంతాల వద్ద ఎలాంటి పనులు చేపట్టవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు మాత్రం హైకోర్టులో స్టే ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగతా చోట్ల రోడ్లు,డ్రయినేజీ డివైడర్ నిర్మిస్తూ పనులను చేస్తు వచ్చారు. మూడేండ్ల నుండి కోర్టు వ్యవహారాలతో పనులు నిలిచి పోయాయి. ఇప్పటికే హైకోర్టులో ఇరువర్గాల మధ్య కొన్ని నెలలుగా వాదోప వాదాలు నడిచాయి. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్లిన వారి ప్రాంతాలను తప్పితే మిగతా ప్రాంతాలలో మాత్రమే అభివద్ధి పనులు చేస్తున్నామని మున్సిపల్ అధికారులు జడ్జి జరిపిన విచారణలో సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తాజాగా నలుగురు మినహాయిస్తే అందరూ కూడా తమ నివాసాల వద్ద కూడా అభివద్ధి పనులు చేయాలంటూ కోర్టులో కేసును ఉప సంహరించుకున్నారు. మిగిలిన బాధితులు మాత్రం నష్టపరిహారం చెల్లించాలంటూ కోరుతున్నారు. అందరి అంగీకారం మేరకే రహదారి విస్తరణ జరిగిందంటూ మున్సిపల్, ఆర్అండ్.బి అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అభివద్ధి పనులు నిలిచిపోవడంతో ఈ రహదారిపై ట్రాఫిక్ సమస్యతో పాటు గుంతల మయమైన రోడ్లు, దుమ్ము ,ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.అదేవిధంగా వర్షాల నేపథ్యంలో ఈ రహదారి మొత్తం కూడా కుంటలను మైమరిపిస్తోంది.
బాధితులకు తొలివిడత లోనే కేసారం వద్ద నిర్మాణం అవుతున్న డబల్ బెడ్ రూమ్ లో ఇండ్లు, పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మాణమవుతున్న మోడ్రన్ మార్కెట్లో షాపులు ఇవ్వడానికి మంత్రి జగదీష్ రెడ్డి ఆనాడు అంగీకరించిన విషయం తెలిసిందే. పనులు నిలిచిపోవడంతో ఈ రహదారిపై ఇరువైపులా ఉన్న 240 మంది గహల బాధితులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కోర్టు కేసు తో ఇరు వైపులా కూల్చి వేయబడిన షాపులు, నివాసాల స్థానంలో నూతన నిర్మాణాలు చేపట్టలేక వ్యాపారాలు చేసుకోలేక ఆ మొండి గోడల మధ్యనే కొందరు కాలం వెళ్ళదిస్తున్నారు.మూడు సంవత్సరాలుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోయామని ఆ ప్రాంతా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి కైనా కోర్టు కెళ్లిన వారు పట్టణ ప్రజల బాధలను మనుగడలోకి తీసుకొని కోర్టులో వేసిన కేసును ఉప సంహరించు కోవాలని నష్ట పరిహారాన్ని సామరస్యంగా చర్చలు ద్వారా పరిష్కరించుకొని అభివద్ధికి బాటలు వేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.