Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకవర్గంతో పనేంటీ నాకు..?
- తీర్మానాలు లేకుండా అభివృద్ధి పనులు
- లోలోపల కుమిలి పోతున్న కౌన్సిలర్లు
'నేను చెప్పిందే వేదం... చేసిందే అభివృద్ది... పాలక వర్గంతో నాకేంటి పని... పెద్దాయన పంపించుండు... నాకేవరితో పనిలేదు... ఎవరికి అభివృద్ధి పనులు ఎవరికి ఇవ్వాలో... ఎలా ఇవ్వాలో... అన్ని తెలుసు... పాలకవర్గంతో నాకు పనిలేదు'... అనే దోరణిలో మున్సిపల్ అధికారి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపట్ల మున్సిపల్ పాలకవర్గం లోలోపల కుమిలిపోతుంది. కోట్లాది రూపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికి కనీసం పాలకవర్గం తీర్మానం లేకుండా మాట మాత్రం కూడా చెప్పకుండా పనులు చేస్తున్నారు. ప్రతి పనికీ నిబంధనలు ఉంటాయని చెప్పే అధికారులు కోట్ల రూపాయాలు ఖర్చు చేసే ముందు కనీసం రూల్ప్ పాటించకపోతే నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుంది. ఇదిలా ఉంటే అభివృద్ధి పనులు పర్యవేక్షించే అధికారుల సంతకం కూడా లేకుండానే ఫైళ్లు ముందుకు సాగడం, దాంతో పాటుగా బిల్లులు డ్రా చేసి పంపిణి చేయడం కూడా జరుగుతుందని విశ్వసనీయ సమాచారం.ఇదంతా జరుగుతున్నప్పటికి ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇదెక్కడంటే నల్లగొండ జిల్లా కేంద్ర మున్సిపాలిటీ పరిస్థితి.
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పట్టణ అభివృద్ధి కోసం చేపట్టే పనులు లక్ష రూపాయాలు దాటితే ప్రతి పనికి టెండర్ ఆన్లైన్లో వేయాల్సిందే. ఒకవేళ అత్యవసరమైతే కలెక్టర్ సుమారు రూ.5కోట్ల వరకు నామినేషన్ పద్దతిలో కేటాయించే అవకాశం ఉంటుందని సమాచారు. ఈ మద్యకాలంలో పట్టణ మున్సిపాలటీలో పట్టణ ప్రగతి పనుల పేరుతో దాదాపు రూ.15కోట్లు కేటాయించారు. అయితే వీటిని పూర్తిగా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని సమాచారం. అయినప్పటికి ఎక్కడ చిన్న పని కూడ మొదలుపెట్టకుండానే నిధులు డ్రా చేసి, బిల్లులు చెల్లించినట్టు వినికిడి. ఇదిలా ఉంటే ప్రతి కౌన్సిలర్‌కు వార్డు అభివృధ్ది కోసమని రూ.5లక్షల కేటాయిస్తామని చెప్పారు.. కానీ ఇపుడు అడిగితే బడ్జెట్ లేదంటున్నట్లు తెలుస్తుంది. కోట్ల రూపాయాలు నామినేషన్ పద్దతిలో కేటాయించేందుకు నిధులుంటాయే కానీ పాలకవర్గ సభ్యులకు మాత్రం నిధులేవంటారా...ఇదేం పద్ధతంటూ పాలకవర్గ సభ్యులు లోలోపల కుమిలిపోతున్నారని సమాచారం.
క్రీడా ప్రాంగణాల పేరుతో రూ.75లక్షలు స్వాహా.....
నల్లగొండ పట్టణ మున్సిపల్ పరిధిలో సుమారు 15క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దానికి రూ.5లక్షల చొప్పున 15క్రీడా ప్రాంగణాలకు రూ.75లక్షలు కేటాయించారు. ఇక్కడ వసతుల కల్పనకు టెండర్ ద్వారా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ అవేమి లేకుండానే నామినేషన్ పద్ధతిలో కేటాయించారని, కనీసం పాలకవర్గం తీర్మానం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా క్రీడాప్రాంగణాలలో వసతులు భూతద్దం పెట్టిన కనిపించడంలేదు. వీటికి కోసం కేటాయించిన పూర్తి నిధులను డ్రా చేశారని సమాచారం. అంతేగాకుండా శ్మశాన వాటికల అభివృద్ది పేరుతో కూడా రూ.15కోట్లు కేటాయించారే కానీ ఏ పని ఎక్కడ కూడా జరినట్టు కనిపించడంలేదు. కేవలం ఓ బోర్డు తగిలించి చేతులు దులుపుకున్నారని సమాచారం.
ఇరిగేషన్ అధికారులు వద్దన్నా...
చర్లపల్లి చెరువులో అర్బన్ ఏర్పాటు చేయడం సరైంది కాదని, అది పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్దమంటూ ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీచేశారు. అయినప్పటికి అవేమి పట్టించుకోకుండా రూ.3.50కోట్లు కేటాయించి పనులు చేపట్టారు. ఒకవైపు పనులు కొనసాగుతుంటే వర్షం నీటితో పూర్తిగా పార్కు మునిగిపోయింది. నిధులన్ని నీటిపాలు చేసినట్లయింది. కనీస సోయి లేకుండా అధికారులు పనిచేస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరోకటి లేదని చెప్పొచ్చు.
ప్రహరీ గోడలకు మున్సిపల్ నిధులా...
వాస్తవంగా ప్రజల పన్నులతోనే మున్సిపాలిటీ అభివృద్ధి కొనసాగించాల్సి ఉంది. కానీ ఇపుడున్న పరిస్థితి పన్నులు పూర్తిస్థాయిలో వసూలు కాకపోవడం వల్ల అభివృద్ది నామమాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితిలో రోడ్డు వెడల్పులో భాగంగా ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ బంగ్లా, ఎన్జీ కాలేజీ ప్రహారిగోడ తదితర వాటి ప్రహారి గోడలు కూల్చాల్సి వచ్చింది. అయితే రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లు, షాపులు నెలమట్టం చేసి , వాటికి పరిహారం ఇవ్వరు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు ఎందుకు మున్సిపల్ నిధులతో నిర్మాణం చేస్తున్నారో అర్థం కావడంలేదు. ఆ శాఖలకు నిధుల కరువేమి లేదు కదా... అలాంటపుడు ఎందుకు ముందుచూపులేని పనులని ప్రజలు చర్చించుకుంటున్నారు..
రూ.5బోజనం క్యాంటీన్‌కు మున్సిపల్ సొమ్మే....?
పల్లెల నుంచి వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే పేదలకు రూ.5లకే బోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే పట్టణంలోని మైసయ్య విగ్రహం వద్ద అన్నపూర్ణ క్యాంటీన్ నిర్మాణం జరుగుతుంది. అది ప్రారంభం కాగానే పేదలకు రూ.5లకే భోజనం పెడతారు. కానీ ప్రతి భోజనానికి మున్సిపాలిటీ నుంచి అదనంగా రూ.23 చెల్లించాలి. అంటే సుమారు ఏడాదికి రూ. కోటి రూపాయాల వరకు అదనంగా ఆర్ధికభారం పడనుందని సమాచారం. ప్రభుత్వం పెడుతున్నపుడు పట్టణ ప్రజల పన్నుల రూపంలో వస్తున్న మున్సిపల్ సోమ్మేందుకు వినియోగిస్తున్నారో పాలకవర్గ సభ్యులకు కూడా అంతుచిక్కడంలేదు.
రెండు చోట్ల రూ.కోటిన్నర నిధుల ఖర్చు వృదాయే....
ప్రస్తుతం మున్సిపల్ నిధులతో రెండు సర్కిళ్లలో చేస్తున్న అభివృధ్ది పనులకు నిధులు వృథా ఖర్చు తప్ప మిగిలేది శూన్యమేనని తెలుస్తుంది. అందులో ఒకటి క్లాక్‌టవర్ సెంటర్లో సర్కిల్ అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి దేవరకొండ నుంచి నల్లగొండ మీదుగా నిర్మాణం చేయనున్న జాతీయ రహదారి పనులు త్వరలో మొదలుకానున్నాయి. అపుడు నిర్మాణానికి అనుకూలంగా ఉండేలా క్లాక్ టవర్ సెంటర్లో నిర్మాణం చేసే అవకాశం ఉంది. అంతేగాకుండా చర్లపల్లి బైపాస్ రోడ్డు వద్ద ఇప్పటికే ఫైఓవర్ బ్రిడ్జి మంజూరైంది. ఆ సమయంలో కూడ బ్రిడ్జికి నిర్మాణానికి అనుకూలంగా పనులు చేసే అవకాశం ఉంటది. ఈ రెండు సర్కిళ్ల కోసం సుమారు రూ.కోటిన్నర రూపాయాలకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలిసింది.
పట్టణ ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడంలేదని, ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేస్తుంటే తామేందుకని కౌన్సిలర్లు లోలోపల మదనపడుతున్నారు. అందులో భాగంగానే నిన్ననే అధికార పార్టీ కౌన్సిలర్లు జిల్లా కేంద్రానికి దూరంగా ఓ పర్యాటక కేంద్రమైన పట్టణంలో 10మంది వరకు రహస్య మీటింగ్ కూడ నిర్వహించారని తెలిసింది. ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు మరోచోట సమావేశమై ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు సమాచారం. నేడు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గం తీర్మానం లేకుండా ఏ పనులు చేయడానికి వీలులేకుండా ఉండేలా పట్టుబట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.