Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల నిర్లక్ష్యం పట్ల ఎంపీపీ అసహనం
- మెమోలు ఇవ్వాలన్న ఎంపీటీసీ
నవతెలంగాణ-మోత్కూరు
మూడు నెలలకోసారి జరిగే మండల సభకు ఎమ్మెల్యే వస్తనే వస్తారా...ఎమ్మెల్యే రాకుంటే మీరు రారా.. మండల సభకు సమయ పాలన పాటించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎంపీపీ కల్పన అధ్యక్షతన శనివారం మోత్కూరు మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోవడంతో 10.45కు ఎంపీపీ సమావేశం ప్రారంభించారు. వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచారి, ఎంపీవో రవూఫ్ అలీ, పొడిచేడు సర్పంచ్ పేలపూడి మధుతో పాటు మరో నలుగురు అధికారులు మాత్రమే వచ్చారు. మొదట మిషన్ భగీరథ ఏఈ శ్రీనివాస్ తమ శాఖ నివేదిక ప్రవేశపెట్టగా 11.30 గంటల వరకు ఒక్కొక్కరుగా రావడం ప్రారంభించారు. కొన్ని శాఖల అధికారులు తమ అసిస్టెంట్లను పంపగా, మరికొన్ని శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. ఒకరిద్దరు ఆఫీసర్లు తమ శాఖకు సంబంధించిన నివేదిక చదివి మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎంపీపీ కల్పన మాట్లాడుతూ సభకు ఎమ్మెల్యే వస్తున్నారంటే అధికారులు ముందుగానే వస్తున్నారని, ఎమ్మెల్యే రాకుంటే ఇష్టం వచ్చినట్టు వస్తున్నారని, మూడు నెలలకోసారి జరిగే సభకు సమయానికి రాకపోతే ఎలా అంటూ సమయ పాలన పాటించాలని సూచించారు. అధికారులెవరూ సమయానికి సభకు రావడం లేదని, కొన్ని శాఖల అధికారులు తమ అసిస్టెంట్లను పంపితే సమస్యలపై ప్రజాప్రతినిధులు ఎవరిని అడగాలని ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచారి ప్రశ్నించారు. సమయ పాలన పాటించని, సభకు రాని అధికారులకు మెమోలు ఇవ్వాలని ఎంపీపీని కోరారు. పది గ్రామాల సర్పంచులకు గాను ఐదు గ్రామాల
సర్పంచులు హాజరవగా, మరో ఐదు గ్రామాల సర్పంచులు, పొడిచేడు ఎంపీటీసీ రాలేదు. ఆయా శాఖలకు సంబంధించిన నివేదికలు చదివి సభను మమ అనిపించారు. సమావేశంలో తహసీల్దార్ షేక్ అహ్మద్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాంపాక నాగయ్య, పాటిమట్ల, దాచారం, అనాజిపురం, పొడిచేడు సర్పంచులు దండెబోయిన మల్లేష్, అండెం రజిత, ఉప్పల లక్ష్మీ, పేలపూడి మధు, ఏవో స్వప్న, వెటర్నరీ డాక్టర్ వల్లాల సంతోష్, ఏపీవో కరుణాకర్, ఆర్అండ్ బీ ఏఈ లింగయ్య, హార్టికల్చర్ ఆఫీసర్ నసీమా తదితరులు పాల్గొన్నారు.