Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు మున్సిపల్ రూల్స్ చదవండి
- మా హక్కులకు భంగం కలిగితే తరిమి కొడతాం
- కమీషనర్ వస్తేనే వార్డుకు నిధులొస్తాయా
- అధికారులను కడిగిపారేసిన కౌన్సిలర్లు
- ఎజెండా ఆమోదం లేకుండానే ముగిసిన కౌన్సిల్
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ పట్టణ అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే, చైర్మెన్లపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశం పోలీసు బందోబస్తు మద్య ప్రారంభమైంది.సమావేశం ప్రారంభానికి ముందు కార్యాలయం బయట కాంగ్రెస్, బాజపా కౌన్సిలర్లు అధికారుల పనితీరుపై నిరసన తెలిపారు.అనంతరం కౌన్సిలర్లను మాత్రమే సమావేశ మందిరానికి పంపించారు.సమావేశం కవరేజీ చేయడానికి వచ్చిన జర్నలిస్టులను కూడా పంపించకుండా పక్కకు నెట్టేశారు.దీంతో కౌన్సిల్ ప్లోర్ లీడర్లు ఒత్తిడి మేరకు జర్నలిస్టులను సమావేశంలోపలికి పంపించారు.పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ సమావేశం మొదలుకాగానే చైర్మెన్ మందడి సైదిరెడ్డి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కౌన్సిల్ సభ్యులకు వివరించారు.అనంతరం అధికారులు ఎజెండా చదవాలని ఆదేశించారు.వెంటనే కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ నిధులను ఖర్చు చేయడంలో కలెక్టర్ పెత్తనం ఏంటీ.. ఆయనెవరూ మా నిధులపై ఆజామాయిషీ చేయడానికి ... అధికారులకు రూల్స్ తెలుసా... మొదట వాటిని చదువుకుని సమావేశాలు పెట్టండి... స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాలకవర్గం తీర్మాణం లేకుండా, టెండర్ లేకుండా ఏలా కోట్ల నిధులు ఖర్చు చేస్తారు..ఇదేనా అధికారుల పద్ధతి ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా..అంటూ అధికారులను నిలదీశారు.కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతుంటే మూడు పేజీలలో ఎజెండా పేపర్లు ఇస్తారా... జరుగుతున్న పనుల వివరాలెక్కడా... మున్సిపల్ నిధులను గోల్మాల్ చేసిన వారికి ఉద్యోగమెలా ఇస్తారూ... అవసరానికి మించి దాదాపు 90మంది ఉద్యోగులు ఆఫీస్‌లో ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు.పాలకవర్గం తీర్మాణం లేకుండా అధికారుల సంతకాలు లేకుండా కోట్ల రూపాయల బిల్లులచెల్లింపులు ఎలా జరుగుతాయన్నారు. ఏ అర్హత లేనివారికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఎలా ఇస్తారూ.. అంతా మీ ఇష్టమేనా... కౌన్సిలర్లు వస్తే పనులు జరగవు... కానీ బ్రోకర్లు వచ్చి డబ్బులు ఇస్తే క్షణాల్లో పనులు చేసిపెడతారు ఇదెక్కడి న్యాయం. మున్సిపల్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుని పనిచేసిన ఘనులు మన ఆఫీస్‌లో ఉన్నారంటే ఇంతకంటే ఘోరం ఏముంటదీక. మా హక్కులకు భంగం కలిగించకుండా ఉంటే మంచిది.కవేళ అదే జరిగితే తరిమి కొట్టడం ఖాయం.సమావేశానికి నిర్ణయించిన ఎజెండాను తమ పార్టీ తరపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు.అనంతరం అసిస్టెంటర్ కమిషనర్‌కు ఎజెండా కాపీలను తిరిగి అందజేశారు. ఆ తర్వాత బీజేపీ ఫ్లోర్‌లీడర్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ ఆదాయానికి గండికొట్టే చర్యలకు అధికారులు పాల్పడుతున్నారని విమర్శించారు.గడువు ముగిసిన షాపులకు టెండర్ పిలిచిన తర్వాత అధిక ఆదాయం వస్తుంటే కాదని, తక్కువ ఆదాయం ఇచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.తమ పార్టీ తరపున ఎజెండా అంశాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ మాట్లాడుతూ షాపులకు అద్దె చెల్లించకుండా డీఫాల్టర్‌గా మిగిలిన వ్యక్తులకు ఎలా షాపు కేటాయిస్తారని అధికారులను నిలదీశారు. అంతేగాకుండా మరణించిన వ్యక్తిపేరుతో షాపు కేటాయింపు ప్రతిపాదన ఎలా పెడ్తారని ప్రశ్నించారు. మాజీ మున్సిపల్ చైర్మెన్ బొడ్డుపల్లి లక్ష్మి మాట్లాడుతూ షాపులకు టెండర్ వేసే ముందు వాటి గడువు ముగిసిన విషయం కౌన్సిల్‌కు చెప్పకుండా ఎలా ఏజెండా పెడతారన్నారు. తమకు తెలియకుండానే కమిషనర్ వార్డుకు వస్తుంటే , ప్రజల ముందు చులకన అవుతామని ఆవేదన వ్యక్తం చేశారు.మూడేండ్లుగా ఒక్కరూపాయి నిధులు కూడా ఇవ్వకపోతే ప్రజల ముందు ఎలా తిరగాలని ఆవేదన వ్యక్తం చేశారు.రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించి నాలుగు నెలలు గడిచినా బడ్జెట్ లేదంటూ చేతులెత్తాశారన్నారు.పట్టణ ప్రగతి పేరుతో వార్డు ప్రగతి మరిచిపోతే ప్రజలు తిరస్కరిస్తారని హెచ్చరించారు.అంతకుముందు బీజేపీ కార్యకర్తలు మున్సిపల్ సమావేశాన్ని ముట్టడించేందుకు వస్తున్న తరుణంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఆమోదం కాని ఎజెండా...
మొత్తంగా మూడు పార్టీలకు చెందిన మున్సిపల్ ఫ్లోర్‌లీడర్లు ఎజెండానును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించడంతో ఎజెండాను మోదం తెలపకుండా సమావేశం ముగిసినట్లు కౌన్సిల్ చైర్మెన్ ప్రకటించారు.దాదాపు ఎజెండా తీర్మాణం చేయకుండా పట్టణంలో ఎప్పుడు కూడా జరిగిన దాఖలాల్లేవు.బహుషా ఇదే మొదటిసారి కావొచ్చని పలువురు భావిస్తున్నారు.దీంతో ఎజెండాకు ఆమోదం తెలపకుండా ఉండడంలో అధికారుల పనితీరుకు నిదర్శమని స్పష్టంగా తెలుస్తుందని పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు.
పంతం నెగ్గించుకున్న మున్సిపల్ చైర్మెన్...
మున్సిపల్ సమావేశానికి హాజరు కాకుండా ఉంటే ఎలా నిర్వహిస్తారో చూస్తామని టీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఏగురవేశారు.అందులో భాగంగానే సుమారు 18మంది కౌన్సిలర్లు రెండు రోజుల కింద నాగార్జునసాగర్‌లో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు.మున్సిపల్ సమావేశానికి కూడా హాజరుకాకుంటే కోరం లేకుండానే వీగిపోతుందని భావించినట్లు తెలిసింది. కానీ మున్సిపల్ చైర్మెన్ సైదిరెడ్డి తనతో ఉండే అధికార పార్టీ కౌన్సిలర్లు, ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లను సమావేశానికి రప్పించి పంతం నెగ్గించుకున్నారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, కౌన్సిలర్లు మాతంగి సత్యనారాయణ, బొజ్జశంకర్, మారగోని భవాని గణేష్, మిర్యాలవెంకన్న, కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణలతో పాటుగా ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు.