Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గులాబీలకు అండగా ఉన్నదెవరూ...
- స్వపక్ష నేతలేనా... ప్రతిపక్ష నేతలా...?
- అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిన వైనం...
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక స్థాయిలో ఎమ్మెల్యేకు చికాకు తెప్పించే గ్రూపులున్నాయి.కేవలం నల్లగొండ నియోజకవర్గంలోనే ఏలాంటి గ్రూపులు లేవు. కానీ మూడేండ్ల తర్వాత ఒక్కసారిగా అసమ్మతి రాగం వినిపించి ఏకంగా ప్రత్యేక క్యాంపు నిర్వహించే స్థాయికి చేరింది.వీళ్లంతా ఇప్పటి వరకు ఎక్కడ బహిరంగంగా అసమ్మతి గళం వినిపించిన సందర్భంలేదు.కానీ ఒక్కసారిగా సుమారు 14మంది కౌన్సిలర్లు గుంపు కావడం రాజకీయ వర్గాలలో పెద్ద చర్చకే దారితీసింది. అధికార పార్టీలో ఉండి కూడ ఇంకా మూడేండ్ల పదవి కాలం ఉండగానే తిరుగుబాటు చేయడంలో ఉన్న ధైర్యమేంటీ అనే సందేహం కలుగుతుంది.
సహజంగా అధికార పార్టీలో ఉండి అసమ్మతి గళం వినిపించాలంటే చాలా రాజకీయంగా ధైర్యం ఉండాలి.ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీలో ఉండి విపక్ష పాత్ర పోషిస్తున్న అనేక మంది నేతలను అణిచివేసిన చరిత్ర రాజకీయ పార్టీలకు ఉంటుంది. మరీ ఇప్పుడున్న అధికార తెరాస పార్టీ మరింత తీవ్రంగా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి.ఇందులో ఎంతో రాజకీయ అనుభవం కలిగిన నేతలను కూడా వేధించిన సంఘటనలు ఉన్నాయి.అలాంటిది పట్టణ కౌన్సిలర్లు అధికార పార్టీ ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేయడమంటే నియోజకవర్గంపై ప్రభావం తీవ్రంగా పడుతుంది.అంతేగాకుండా కొద్దిరోజుల్లోనే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందని విస్తృత ప్రచారం జరుగుతుంది.ఒకవేళ అదే నిజమైతే ఈ తిరుగుబాటు వచ్చే ఎన్నికలపై తీవ్రప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.అయితే ఇప్పుడు అసమ్మతి గుంపులో ఉన్న వాళ్లందరికి పెద్దగా రాజకీయంగా బలమైన నాయకుడు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలతో ఎమ్మెల్యేతో రాజకీయ వైరం ఉన్న నేతలుంటే వారంతా వీరికి తాత్కాలికంగా మద్దతు ఇచ్చి ఉసిగొల్పే అవకాశం కూడా ఉంది.అదంతా పూర్తిగా వారి వారి రాజకీయ అవసరాల కోసమేననేది జగమెరిగిన సత్యం.
స్థానిక ఎమ్మెల్యే, చైర్మెన్లకు వ్యతిరేకంగా గుంపు కడుతున్న నల్లగొండ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లకు బడానేతల అండదండలు లేకపోలేదనే ప్రచారం జరుగుతుంది.ఎమ్మెల్యేకు జిల్లాకేంద్రంలోని నియోజకవర్గ నేతలెవరితో సత్ససంబంధాలు సరిగా లేవు.వారితో పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాలు జరిగినపుడు తప్ప వేరే సమయంలో కలిసి పోయింది లేదు. నియోజకవర్గంలో ఉన్న కిందిస్థాయి ప్రజాప్రతినిధులు కూడా వారి వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారనే ప్రచారం ఉంది.నేతలంతా కూడ ప్రజాప్రతినిధులుగా ఉన్నతమైన హోదాలోనే ఉన్నారు. కానీ వారి వద్దకు వెళితే ఎమ్మెల్యే చిర్రెత్తిపోతుంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితులలో అవకాశం కోసం ఏదురుచూస్తున్న ఆ నేతలు ఇపుడున్న పరిస్థితులలో అసమ్మతి వాదులను అక్కునే చేర్చుకునే అవకాశం ఉంది.అందుకే గులాబీ పక్షులు ధైర్యంగా ఎగురుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీ నేతలు కూడ అధికార పార్టీని బలహీనపర్చడానికి అవకాశం కోసం ఏదురుచూస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో గెలుపు గుర్రం అధిష్టించడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఇది.అందులో భాగంగానే తిరుగుబాటు దారులకు అండగా ఉండేందుకు ఛాన్స్ ఉంది.అయితే గతంలో కాంగ్రెస్లో పనిచేసిన కౌన్సిలర్లు ఇప్పుడు అధికార టీఆర్ఎస్లో ఉన్నారు. వారంతా ప్రతిపక్ష నేతలకు టచ్లో ఉన్నారనే ప్రచారం ఉంది. మొత్తంగా గులాబీదండుకు అండగా స్వపక్ష నేతలున్నారా...ప్రతిపక్ష నేతలున్నారా.. అనే ప్రశ్న అందరి మదిలో నిండుకుంది.