Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తుల పరిష్కారంలో లోపిస్తున్న శ్రద్ధ
- కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
ప్రజలకు పాలనను దగ్గర చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినా ప్రజావాణికి వినతుల వెల్లువకొనసాగుతూనే ఉంది.ప్రజాసమస్యలు గ్రామీణ, మండల స్థాయిలో పరిష్కారం కావడం లేదు.కొన్నిచోట్ల అధికారులు అందుబాటులో ఉండకపోగా... మరికొన్నిచోట్ల కిందిస్థాయి సిబ్బంది తీరుతో బాధితులు సమస్యలు తీరక జిల్లాకేంద్రానికి వస్తున్నారు. ప్రజలకు పాలన అందించేందుకు చిన్న జిల్లాలు ఏర్పడిన జిల్లా జనాలకు మాత్రం కష్టాలు తీరడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో గతంలో ఒక కలెక్టర్ చేసే పనిని ప్రస్తుతం ముగ్గురు కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. అయినా రావలసిన ఫలితాలు రావడంలేదనే భావన జిల్లా ప్రజల్లో కనిపిస్తోంది. గ్రామీణ మండల ప్రాంతాల నుండి ఇబ్బందులు చెప్పుకునేందుకు ప్రజావాణికి క్యూ కడుతున్నారు జనం. మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం జవాబు దారితనం లేక కలెక్టర్ కార్యాలయానికి బాట పడుతున్నారు. ప్రతి సోమవారం బాధితులతో కలెక్టరేట్ కిటకిటలాడుతూ ఉంది. దరఖాస్తులు వందల్లో పేరుకుపోయి పరిష్కారం కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సమస్యలు పరిష్కారం కాక జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన పని కావటం లేదంటున్నారు అర్జీదారులు. పని మానుకొని రోజంతా ఇక్కడే ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆఫీసుకు రావాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని మండల స్థాయిలో పరిష్కారం చూపితే ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు అంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యం.. కొందరు అధికారుల చేతివాటం కారణంగా పనులు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల సమస్యల పరిష్కార దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన అర్జీలు పరిష్కారానికి ఏ మాత్రం నోచుకోవడం లేదు. కిందిస్థాయిలో సమస్యల పరిష్కారం కాక ఏకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారికి విన్నవించిన బాధితుల బాధలు తిరగడం లేదు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే( గ్రీవెన్స్) ప్రజావాణికి స్పందన దిక్కే లేకుండా పోతుంది. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా కిందిస్థాయి అధికారులు ఈస్టానుసారంగా వ్యవహరించడంతో అంతంత మాత్రం గానే ప్రజావాణికి స్పందన ఉందని చెప్పక తప్పదు.
ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా...
సమస్యల పరిష్కారంపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు జారీ చేస్తున్న ఆదేశాలకు దిక్కే లేకుండా పోయింది. నోచుకోవడం లేదు.ఇప్పటివరకు వివిధ శాఖల సమస్యలకు సంబంధించి గత జనవరి ఒకటవ తేదీ నుండి నేటి వరకు 1486 దరఖాస్తులు రాగా అందులో కేవలం 317 మాత్రమే పరిష్కారమయ్యాయి.అంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.సామాన్యుల కష్టమంటే వారికి ఏమాత్రం పట్టదు.ఇప్పటికీ ఇంకా 1163 దరఖాస్తులు సమస్యల పరిష్కారానికి నోచుకోలేదు.
అధికంగా ఫిర్యాదులు వీటిపైనే...
జిల్లామొత్తంలో అధికంగా వచ్చిన ఫిర్యాదుల్లో వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ ,జిల్లా ఉపాధి కల్పనాధికారి ,సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, ఇరిగేషన్, కాలుష్యం నియంత్రణ బోర్డ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ,మున్సిపల్ కమిషనర్ నలగొండ, మిర్యాలగూడ ,నకిరేకల్, గిరిజన సంక్షేమ శాఖ, కు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి.
జిల్లాలో ఒక్క అర్జీకి పరిష్కారం చూపని శాఖలు....
హంగులు ..ఆర్భాటాలు చేస్తూ నిత్యం ప్రజల కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్టు పత్రికల్లో ప్రకటనలు, ఇంటర్వ్యూలు ఇస్తూ, జిల్లా ఉన్నతాధికారులతో సంబంధాలు కొనసాగిస్తూ, ఎన్నో పనులు చేస్తున్నట్టు ప్రజలపై ఎనలేని ప్రేమను కురిపించే కొన్ని శాఖల అధికారులు గడిచిన ఏడు నెలల్లో ఏ ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో ప్రజా సమస్యలపై వారికి ఏమాత్రం శ్రద్ధ ఉందో, ఉన్నతాధికారులు అంటే ఏమాత్రం గౌరవం ఉందో ఇట్టే అర్థమవుతుందనేది పలువురీ ఆరోపణ. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లాంటి ఉన్నత స్థాయి అధికారులకు విన్నవించిన బాధలు తీయడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఎక్కడి వెళ్లాలో అర్థం కాక తిరుగు ప్రయాణం అవుతున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖకు సంబంధించి 55 అర్జీలు ప్రజావాణికి రాగా అందులో ఏ ఒక్కటి నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కు సంబంధించి 37 అర్జీలు రాగా 37 పెండింగులోనే ఉన్నాయి. ఉపాధి కల్పనాధికారికి సంబంధించి 54 దరఖాస్తులు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖకు సంబంధించి అత్యధికంగా 85 అర్జీలు రాగా 85 పరిష్కారానికి నోచుకోలేదు. ఇరిగేషన్ శాఖ నల్లగొండకు 18 అర్జీలు, కాలుష్య నియంత్రణ బోర్డుకి సంబంధించి 21 లీడ్ బ్యాంకు మేనేజర్‌కు సంబంధించి 36, మున్సిపల్ కమిషనర్ నల్లగొండకు సంబంధించి 81 అర్జీలు, మిర్యాలగూడ మున్సిపల్ శాఖకు సంబంధించి 17 నకిరేకల్ మున్సిపల్ శాఖకు సంబంధించి 12 గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి 49 దరఖాస్తులు రాగా వీటిలో ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు.