Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్మథనంలో కార్యకర్తలు
- గ్రామాల్లోకి పాకిన గ్రూపు రాజకీయాలు
- రోజురోజుకూ ముదిరిపోతున్న టికెట్ లొల్లి
నవతెలంగాణ-సూర్యాపేట టౌన్
ఆది నుండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలనే నమ్ముకుని పార్టీలో కొనసాగుతున్న నిజమైన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నేడు నియోజకవర్గంలోని గ్రూపు తగాదాలతో నలిగిపోతున్నారు. అటువంటి నిజమైన కార్యకర్తలు వ్యక్తులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలనే నమ్మి పార్టీ అభ్యున్నతికి కషి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో పట్టణంతో పాటు గ్రామాల్లోనూ పార్టీలో అన్నదమ్ములుగా కలిసి ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నేడు నెలకొన్న గ్రూపు తగాదాల మూలంగా వర్గాలుగా చీలిపోతున్నారు. పార్టీ టికెట్ ఎవరికీ దక్కినా తాము పార్టీ కోసమే పని చేస్తామని పట్టుదలతో ఉన్న నాయకులు, కార్యకర్తలకు ఇట్టి విషయం మింగుడు పడనప్పటికీ తప్పని పరిస్థితుల్లో గ్రూపు రాజకీయాల్లో చేరాల్సిన పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. ఈ వర్గ పోరు వ్యక్తుల ప్రయోజనం కోసమే తప్ప పార్టీకి ఏమాత్రం ఉపయోగ పడబోదని పార్టీ సానుభూతి పరులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పార్టీలో కాస్త అంతో ఇంతో పేరున్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మాత్రం ఈ గ్రూపు తగాదాలు తమకెందుకని తటస్థంగానే ఉంటున్నారు.
అసమ్మతి వాదులను చేరదీసే పనిలో ఇతర పార్టీలు
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ పోరులో ఇమడలేక తటస్థంగా ఉన్న నాయకులు, కార్యకర్తలకు ఇతర పార్టీల నాయకత్వం గాలం వేసే పనిలో పడ్డారు. వామపక్ష పార్టీల కూటములు తమకున్న నాయకత్వం, కార్యకర్తలతో ఎటువంటి ఎన్నికలు వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇతర పార్టీల అది నాయకత్వం మాత్రం అసమ్మతి నాయకులను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు కోనసాగిస్తున్నాయి. గెలుపు సులువు కావాలంటే మరింత ఓటు బ్యాంకు అవసమని అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తుండగా, నియోజక వర్గంలో ఒక్కసారైనా కమలం వికసించాలని బీజేపీ నాయకత్వం ఉవ్విళ్లూరుతుండగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో తామే కీరోల్ అని భావిస్తున్న తెలంగాణ జన సమితి నాయకత్వం అసమ్మతి నాయకులను చేరదీసేందుకు వెనకాడటం లేదు.
రచ్చకెక్కించించిన రచ్చబండ
రైతు డిక్లరేషన్ పల్లె పల్లెకు చేరవేయాలనే సంకల్పంతో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ మే 6న నిర్వహించిన వరంగల్ సభలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాన్ని మే 21 నుండి నిర్వహించాలని సూచించిన విషయం తెలిసిందే. కాగా నియోజకవర్గ పరిధిలో జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షత మాజీ మంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డిలు పార్టీ అధిష్టానం సూచన మేరకు కలిసి నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎవరికి వారే వేర్వేరుగా నిర్వహించడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కొంత అసహనానికి లోనైనట్లు తెలిసింది. దామోదర్ రెడ్డి తనకున్న పార్టీ అనుబందంతో పీసీసీ మాజీ అధ్యక్షులు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర నాయకులతో నియోజకవర్గ పరిధిలోని కొన్ని మండలాల్లో పర్యటించి రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా, పార్టీ సిద్ధాంతాన్ని,ప్రస్తుత పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డినే నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్న పటేల్ రమేష్ రెడ్డి మాత్రం తన అనుచరగణంతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి నిర్వహణలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడానికి వెళ్లిన రమేష్ రెడ్డిని స్థానిక కౌన్సిలర్ కుమారుడు, దామోదర్ రెడ్డి అనుచరుడు, యువజన విభాగం నాయకుడు లింగస్వామి అక్కడి కార్యకర్తలతో కలిసి తనకి సమాచారం లేకుండా ఎలా వచ్చారని ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనితో నియోజకవర్గ స్థాయిలో గ్రూపు రాజకీయాలు బలంగా ఉన్నట్లు బహిరంగమైంది.
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరల అధికారం చేజిక్కించు కోవాలంటే గత ఎన్నికల్లో కలిసి పనిచేసినట్లే ఇప్పటి నుండే కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ సానుభూతి పరులకు భరోసా కల్పించేలా పనిచేస్తే గత ఎన్నికల్లో అవతలి పార్టీకి వచ్చిన స్వల్ప మెజారిటీని దాటడం పెద్ద సమస్య కాబోదని ప్రజల్లో ఉన్న విశ్వాసం. మరి అధినాయకుల కలవడిక మున్ముందు ఎలా ఉండబోతుందోనని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.