Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్ బండా, ఎమ్మెల్యే కంచర్ల
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రతి కుటుంబంలో తప్పులు దొర్లడం సహజమేనని , వాటిని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని జిల్లా పరిషత్ చైర్మెన్‌్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అసమ్మతి గళం వినిపించిన కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డ్డి సహకారంతో పట్టణ మున్సిపాలిటి కోట్లాది రూపాయాలతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కానీ వార్డులో ్ల ఎలాంటి అభివృద్ధి లేదనే బాధతో కౌన్సిలర్లు ప్రజల ముందుకు వెళ్లలేక ఇబ్బంది పడ్డారని తెలిపారు. అందువల్లే ఒకసారి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి దూరంగా ఉన్నారని అన్నారు. గత ఏడాదిన్నర నుంచి అభివృద్ధి పనుల్లో వేగం పెరిగిందని, వార్డులో వినాయక చవితి తర్వాత ప్రతి వార్డుకూ రూ.50-60లక్షల వరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌన్సిలర్లు పార్టీ మారుతారని వచ్చిన ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. విజయదశిమి పండుగ సందర్భంగా మెడికల్ కాలేజీ, వెటర్నరీ కాలేజీ, ఉదయం సముద్రం ప్రాజెక్టు, వల్లాభారావు చెరువు, మర్రిగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జీ తదితర పనులకు శంకుస్థాపన చేయడానికి సీఎం కేసీఆర్ హాజరవుతున్నట్టు తెలిపారు. అంతేగాకుండా ఇపుడున్న నిధులే గాకుండా మరో రూ.220కోట్ల నిధులను నియోజకవర్గానికి తీసుకువచ్చేందుకు కృషి జరుగుతుందన్నారు. ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే గులాబి జెండా నల్లగొండపై ఎగిరిందన్నారు. భవిష్యత్‌లో కూడా అందరం కలిసి కట్టుగా పనిచేసి మరోసారి గులాబి జెండా ఎగురవేస్తామని తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూసి ప్రతిపక్షాలు చూపిస్తున్నాయని పెర్కొన్నారు. ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా టీఆర్ఎస్ కుటుంబంలో సాగవని వారన్నారు.
పొరపాటు చేశాం... పార్టీ పెద్దలు క్షమించండి
వైస్‌చైర్మెన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ పిల్లి రామరాజు
వార్డులు అభివృద్ది జరగడంలేదనే పేరుతో కౌన్సిల్ సమావేశానికి దూరంగా ఉండి పార్టీకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేశామని అందుకే పార్టీ పెద్దలు క్షమించాలని మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ పిల్లి రామరాజు విలేకరుల సమావేశంలో అన్నారు. మా ఆవేదన కేవలం వార్డుల అభివృద్ది మాత్రమేనని, పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారంలో ఇతరులు జోక్యం చేసుకుని విడదీసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో అందరం కలిసి ఐక్యంగా పనిచేశామని అదే దారిలో మరోసారి నల్లగొండ గడ్డపై గులాబి జెండా ఎగురవేసేలా భారీ మోజార్టీతో కంచర్ల భూపాల్‌రెడ్డి గెలిపిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, ఖయ్యూమ్బేగ్, పున్న వేణు, ఊట్కూరి వెంకటరెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, మారగోని గణేష్, బకరం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
అసమ్మతి కౌన్సిలర్లు సాధించేదేమిటీ...?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి ఎమ్మెల్యేకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కొంత తలనొప్పి ఉండేది. కానీ ఒకే ఒక్క నల్లగొండ నియోజకవర్గంలో ఎలాంటి అసమ్మతి వాదులు లేరనే అభిప్రాయం ఉండేది. ఇదంతా గత వారం రోజుల క్రితం వరకు ఉన్న అభిప్రాయం. కానీ ఏనాడు బహిరంగంగా మాట్లాడని కౌన్సిలర్లు కేవలం వార్డుల్లో అభివృద్ధి జరగడంలేదని, తమకు తెలియకుండానే నిధులు ఖర్చు చేసి డ్రా చేస్తున్నారని, కౌన్సిల్‌కు అధికారులు సరైనా గౌరవం ఇవ్వడంలేదని రకరాల కారణాలు చూపి ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మెన్‌పై తిరుగుబాటు చేశారని నిన్నటి వరకు పట్టణమంతా కోడైకూసింది. కానీ ఒక్కసారిగా వారంతా సోమవారం మధ్యాహ్నం చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యమేస్తుంది. 'తప్పు చేశాం.. పార్టీ పెద్దలు క్షమించండి' అని అంటూ వారిని వేడుకున్న చందంగా మాట్లాడారు. ఒకవేళ వార్డు అభివృద్ధి లక్ష్యమైతే ప్రజల కోసం తిరుగుబాటు చేసిన వారైతే వాళ్లు చేసింది తప్పు ఎలా అవుతుంది. ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు కొంత ఇబ్బంది పడడం సహజమే... అదే పరోక్షంగా కౌన్సిలర్లు చెప్పారు. అందుకే కౌన్సిలర్ల ఇబ్బందులను గమనించిన పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఎందుకు మీరనుకున్న నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించలేదు. ఇదిలా ఉంటే గత మార్చిలో వార్డు అభివృద్ధికి రూ.5లక్షలు నిధులిస్తామన్న మున్సిపల్ అధికారులు కనీసం వాటినైనా వెంటనే విడుదల చేస్తామని ఎందుకు చెప్పలేదు. అంటే వీరంతా మనసులో ఒకటి పెట్టుకుని బహిర్గతంగా మరోకటి చెపుతున్నారనే విమర్శలొస్తున్నాయి. అంతేగాకుండా ఆర్థికంగా రూ.2-3లక్షల వరకు లావాదేవీలు కూడా జరిగినట్టు విశ్వసనీయ సమాచారం.