Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
- రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తుంది
- కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్,కిషన్ రెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాజుల నియంత పాలన కొనసాగిస్తున్నాడని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిఅన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చేపడుతున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రను మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వారు ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ప్రాణ త్యాగం చేస్తే ప్రస్తుతం తెలంగాణ ఎలా ఉందో చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కల నెరవేరలేదని ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతుందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్లకి నిజమైన నివాళి ఇవ్వాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు .కాళేశ్వరం ప్రాజెక్టును ఏ డిజైన్తో కట్టారో తమకు తెలియదని ,ఇంజనీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజ్ మునిగాయన్నారు. కమీషన్ల కోసమే కాళేేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆ ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా తయారైందని ఆరోపించారు. అవినీతిపరులను జైల్లో వేసేందుకు బీజేపీకి అధికారం ఇవ్వాలని ఆయన కోరారు.
తెలంగాణలో రాక్షస పాలన
గోల్కొండ కోటపై కాషా జండా ఎగరేస్తాం: బండి సంజయ్
తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతుందని ప్రజలు ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పక్క లేకుండా పోయాడని,గోల్కొండ కోటపై కచ్చితంగా కాషాయ జండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు .మంగళవారం గుట్టలో నిర్వహించిన ప్రజాసంగ్రామ పాదయాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జఫర్ సన్ స్కాచ్ మందు కోసమే కేసీిఆర్ ఢిల్లీకి పోయిండని విమర్శించారు. బీజేపీ ఎక్కడుందన్న వారికి పాలమూరులో చూపించామని ఇప్పుడు నల్గొండలో చూపించామని తర్వాత ఖమ్మంలో కూడా చూపిస్తామన్నారు .ప్రతి బిజెపి కార్యకర్త లక్ష్మీనరసింహస్వామి అవతారం ఎత్తి కేసీఆర్ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. యాదాద్రి ఆలయ నిర్మాణం పేరుతో నాణ్యతలేని పనులు చేయించాడని విమర్శించారు .బువ్వ కోసం ఐఐటి గురుకుల పాఠశాల విద్యార్థులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .రైతు రుణమాఫీ ఏమైందని దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. వాసాలమర్రిలో వంద హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు.కేసీఆర్ చేతకాని మూర్ఖపు పాలనతో 2000 మంది చేనేత కార్మికులు మరణించారన్నారు. 8ఏండ్లలో 4 లక్షల కోట్లు అప్పుచేసి జనం చేతికి చిప్ప ఇచ్చిండని దుయ్యబట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలతో పాటు అగ్రకులాల్లోని పేదలను మోసం చేస్తున్నాడన్నారు.గడిల్లో బంధీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తురాలు చేయాలంటే బిజెపి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్,సోయం బాపూరావు శాసనసభ్యులు రాజాసింగ్ ,ఈటల రాజేందర్ ,రఘునందన్ రావు ,మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు ,బూడిద బిక్షమయ్యగౌడ్ ,జిల్లా అధ్యక్షులు పివి శ్యాంసుందర్రావు ,బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.