Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అద్దె భవనంలో బాలుర గురుకుల విద్యార్థుల అవస్థలు
- మూడో అంతస్థులో కిందకు లీకవుతున్న మరుగుదొడ్ల నీరు
- అపరిశుభ్ర పరిసరాలతో రోగాల పాలు
- నెలకు రూ.1.66 లక్షల అద్దె
- విద్యార్థులకు కనీస వసతులు కల్పించని భవనం యజమాని
- వసతులు లేక ఇంటర్ కు మరో భవనం చూస్తున్న ఆఫీసర్లు
నవతెలంగాణ-మోత్కూరు
అదో గురుకుల పాఠశాల..అందులో 480 మంది విద్యార్థులు. గురుకుల పాఠశాలలో అన్నివసతులు ఉండి మంచి చదువు చదువుకోవచ్చని ఆశ పడిన ఆ విద్యార్థులకు ఆ భవనం నరకం చూపిస్తోంది. 2016-17 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర గురుకుల పాఠశాలలను ప్రారంభించగా మోత్కూరుకు కూడా పాఠశాల మంజూరైంది. తొలుత పాఠశాలనురాజాపేటలో రెండు నెలలు నడిపిన తర్వాత మోత్కూరు తరలించారు. ఇక్కడ అద్దె భవనంసరిపోకపోవడంతో తర్వాతి విద్యా సంవత్సరం భువనగిరిలోని ప్రైవేట్ కాలేజీ అద్దె భవనంలో నడిపారు. ఆ తర్వాత మళ్లీ మోత్కూరు తరలించి టీఆర్ఎస్ నాయకునికి చెందిన అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. అద్దె భవనంలో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా వసతులు లేకపోవడం, రెసిడెన్షియల్ అయినా వేర్వేరుగా గదుల్లేక చదువు, పడుకోవడం అదే గదుల్లో కావడంతో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. కిటికీలకు తలుపులు, గ్రిల్స్ లేకపోవడం, కరెంట్, ఫ్యాన్లు లేకపోవడంతో చలి, ఉక్కపోత, దోమల బాధతో అల్లాడిపోతున్నారు. ఇక మూత్రశాలలు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. వాటికి తలుపులు సక్రమంగా లేవు. రెండు, మూడో అంతస్థుల్లో వాటిని ఏర్పాటు చేయగా వాటికి సక్రమంగా నీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు కింద నుంచే బకెట్లలో మోసుకెళుతున్నారు. పాఠశాల మొత్తానికి మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరే దిక్కవడంతో అప్పుడప్పుడు రోజుల తరబడి నీటి సరఫరా నిలిచిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడో అంతస్థులో ఉన్న మరుగుదొడ్ల నుంచి కింది అంతస్థుల్లో ఉన్న గదుల్లోకి ఆ నీరు లీకేజీ అవుతుండటంతో కంపు భరించలేకపోతున్నారు. పాఠశాలకు సరఫరా చేస్తున్న బియ్యంలో అన్నీ పురుగులే ఉండి ముక్క వాసన వస్తున్నాయి. వంట ఏజెన్సీ వారు ఐదారుసార్లు వాటిని కడిగినా అవి పోవడం లేదని, అన్నంతో పురుగులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం పెరిగిన ధరలకనుగుణంగా మెస్ చార్జీలు పెంచకుండా 5 నుంచి 7వ తరగతి వరకు రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.30.60 పైసలు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.35 (పాత ధరలే) ఇస్తుండటంతో భోజనం నాణ్యతగా, రుచిగా ఉండటం లేదని వాపోతున్నారు. గదులు సరిపోక ఇబ్బందులు పడుతుండటంతో ఉపాధ్యాయుల ఒత్తిడితో భవనంపై ఓ రేకుల షెడ్ వేశారు. ఇన్ని ఇబ్బందుల మధ్య తాము ఎలా చదువుకోవాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
నెలకు రూ.1.66 లక్షల అద్దె...
వసతులు లేక ఇంటర్‌కు మరో భవనం చూస్తున్న ఆఫీసర్లు..
గురుకుల పాఠశాల అద్దె భవనానికి ప్రభుత్వం నెలకు రూ.ఒక లక్షా 66345 అద్దె చెల్లిస్తున్నది. అంత మొత్తంలో అద్దె తీసుకుంటూ భవనం యజమాని విద్యార్థులకు కనీస వసతులు కల్పించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అరకొర వసతులతో పాఠశాలలో తమ బిడ్డలు పడుతున్న బాధలను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కరోనా సమయంలో పాఠశాల నడవకున్నా సుమారు రెండేళ్లు లక్షల్లో అద్దె వచ్చిందని, విద్యార్థులు పడుతున్న బాధలు చూసి కనీసం మానవత్వంతోనైనా పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. భవనం యాజమానికి ఏ సమస్య చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ విద్యాసంవత్సరం వచ్చిన నూతన ప్రిన్సిపాల్ ఆకుల భిక్షమయ్య వసతులు కల్పించాలని జిల్లా అధికారులకు లెటర్ పెట్టి నోటీసులు జారీ చేశారు. అయినా ఆయన పట్టించుకోకపోవడంతో ప్రతినెలా అద్దె డబ్బుల నుంచి పదిశాతం కట్ చేయించి ఆ డబ్బులతో తలుపులు, కిటికీలు, కరెంట్, బాత్రూంలు తదితర వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ కు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఉన్న విద్యార్థులకే ఆ భవనం సరిపోక ఇబ్బందులు పడుతుండగా అధికారులు మరో అద్దె భవనం కోసం వెతుకుతున్నారు. పట్టణంలో ఖాళీగా ఉన్న మాజీ ఎంపీపీ ఓర్సు లక్ష్మీ భవనాన్ని ఎంపిక చేయగా జిల్లా అధికారులు వచ్చి పరిశీలించిన తర్వాత ఆ భవనాన్ని ఖరారు చేయనున్నట్టు తెలిసింది.
ఇక్కడ ఉండలేకపోతున్నాం - దామెర వరుణ్, 9వ తరగతి
రోజూ ఇబ్బందులు పడుతూ ఆ భవనంలో ఉండలేకపోతున్నాం. అన్ని వసతులు మంచిగా ఉంటేనే మేం బాగా చదువుకోగల్గుతాం. అరకొర వసతులు ఉన్న ఈ భవనంలో లేచింది మొదలు పడుకునే వరకు అన్నీ సమస్యలే. నీటి వసతి, బాత్రూంలు సక్కగా లేవు. పై అంతస్థులో ఉన్న మరుగుదొడ్ల నుంచి నీళ్లు కిందకులీకవుతున్నాయి. అన్నంలో పురుగులు, భోజనం అస్సలు బాగుండటం లేదు. పాఠశాల చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వస్తోంది. ప్రభుత్వం నూతన భవనం మంజూరు చేసి అప్పటి వరకు అన్ని వసతులు ఉన్న మరో భవనంలోకి తరలించారు.
సమస్యలు ఉన్నమాట వాస్తవమే- ఆకుల భిక్షమయ్య, ప్రిన్సిపాల్
పాఠశాలలో సమస్యలు ఉన్నమాట వాస్తవమే. దీంతో విద్యార్థులు, మేం కూడా ఇబ్బందులు పడుతున్నాం. వసతులు కల్పించాలని భవనం యజమాని దృష్టికి తీసుకెళితే సరిగా స్పందించకపోవడంతో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారుల ఆదేశాల మేరకు ఆయనకు చెల్లిస్తున్న అద్దెలో నుంచి నెలకుపదిశాతం వరకు కట్ చేసి ఆ డబ్బులతో తామే కొన్ని మరమ్మతు పనులు చేసుకుంటున్నాం. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ మంజూరు కాగా ఇక్కడ సరైన వసతులు లేని కారణంగా మరో భవనం చూస్తున్నాం.