Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధానకార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-చౌటుప్పల్
అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మల్లు లక్ష్మీ డిమాండ్‌చేశారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు అవ్వారి రామేశ్వరి అధ్యక్షతన ఐద్వా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మీ మాట్లాడారు. రాష్ట్రంలో లక్షా 90వేల ఇండ్లు నిర్మాణం పూర్తిచేసినట్టు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రకటించారన్నారు. నేటికీ 20వేల ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగి ఇండ్లు లేని వారు లక్షల మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా పేదలకు ఇండ్లు ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఇంటి స్థలం కలిగి ఉంటే ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు. పేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయిందన్నారు. 11 లక్షల మంది ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారని తెలిపారు. కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌చేశారు. మహిళల్లో రక్తహీనత, పిల్లల్లో పోషకాహార లోపంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. కేరళ తరహాలో రేషన్‌షాపుల ద్వారా 14 రకాల వస్తువులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడారు. ఈ నెల 1 నుండి 15 వరకు మహిళలను చైతన్యం చేయడం కోసం గ్రామగ్రామాన సెమినార్లు, సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలను అదుపుచేయాలని డిమాండ్‌చేస్తూ ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు దొడ్ల ఆండాలు, బత్తుల జయమ్మ, రాపోతు పద్మ పాల్గొన్నారు.